ఎన్నికల్లో భూమి... ఎజెండా కావాలి!

by Ravi |   ( Updated:2023-11-05 01:16:08.0  )
ఎన్నికల్లో భూమి... ఎజెండా కావాలి!
X

భూ హక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారమైతేనే అభివృద్ధి చెందిన రాష్ట్రమవుతుంది. రైతు జీవితం మెరుగుపడుతుంది. భూమి హక్కుల కల్పన, వాటి రక్షణ, మెరుగైన భూపరిపాలన, భూమి రికార్డులు నిర్వహణ ఏ ప్రభుత్వానికైనా ప్రధానమైన అంశాలు కావాలి. భూమి హక్కు ఒక రాజ్యాంగ హక్కు. ఐక్య రాజ్య సమితి గుర్తించిన మానవ హక్కు. అందుకే, భూమి హద్దులు స్పష్టంగా, హక్కులు భద్రంగా ఉండేలా చూడాలి. ఆ వైపు ప్రయత్నాలు జరుగుతున్నా కానీ ఇంకా ఆశించిన ఫలితాలు రాలేదు.

వేలాది మంది రైతులను కలిసి..

ప్రతి తెలంగాణ పల్లెలో వందల్లో భూమి సమస్యలు ఉన్నాయి. భూమి హద్దులకు స్పష్టత, హక్కులకు భద్రత లేదు. 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లక్షల ఎకరాల పట్టా భూమి నిషేధిత జాబితాలో తప్పుగా చేరింది. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై ఎన్నో సమస్యలు. భూముల సర్వే జరిగి 80 ఏళ్ళైనా రీ సర్వే జరగలేదు. పట్టాదారు పాసు పుస్తకానికి ప్రభుత్వ హామీ లేదు. 10 లక్షలకు పైగా ఉన్న కౌలుదారులకు గుర్తింపు లేక రైతుగా ఏ సాయం పొందలేక పోతున్నారు. పోడు భూములకు పట్టాలు రాని గిరిజనులు వేల సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో పదేండ్ల తర్వాత కూడా ప్రతి ఊరిలోనూ కనీసం 200 సమస్యలు ఉన్నాయి. భూమి హక్కులకు భద్రత లేదు. హద్దులకు స్పష్టత లేదు. ప్రభుత్వం ఇన్నేండ్ల పాలనలో సమస్యలను పెంచారు. వాటి పరిష్కారాలను జటిలం చేశారు. మూడో సారి ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూ పరిపాలన, భూమి హక్కుల గురించి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అసలేం కావాలి అనే కోణంలో లీఫ్స్ అనే సంస్థ పర్యటించింది. వేలాది మంది రైతులను కలిసింది. లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు ఎం.సునీల్ కుమార్ నేతృత్వంలో 40 వేల మంది రైతులను ప్రత్యక్ష్యంగా కలిసి భూమి ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించింది. ప్రతి పార్టీ ఈ భూమి ఎజెండాను అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది.

టైటిల్ గ్యారంటీ కావాలి

భూమి రికార్డుల్లోని వివరాలకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి. ఇది కేసీఆర్ ఇచ్చిన హామీనే. అలాంటి వ్యవస్థను రూపొందించడానికి పలు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంలో సక్సెస్ అయ్యింది. త్వరలోనే టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నది. అలాంటి చట్టాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలి. తెలంగాణలో సుమారు 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు అసైన్ చేశారు. అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలన్న డిమాండ్ బాగా ఉన్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీత కాలవ్యవధి తర్వాత హక్కులు కల్పించాయి. పీవోటీ చట్టాన్ని సవరించి అసైన్డ్ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పించాలి.

రెవెన్యూ ట్రిబ్యునళ్లు

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కోర్టులు ఉండాల్సిందే. వాటిని రద్దు చేయడం ద్వారా పేదలు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక ట్రిబ్యునళ్ల ద్వారా పాత కేసులన్నింటినీ పరిష్కరించినట్లుగా చూపారు. కొత్త కేసులన్నీ సివిల్ కోర్టులకు వెళ్లాల్సిందేనని తేల్చారు. ఆర్వోఆర్ చట్టం కింద భూ రికార్డులను సవరించే అధికారం మాత్రమే రెవెన్యూ కోర్టుల నుంచి తీసేశారు. కానీ అసైన్డ్ భూముల అన్యాక్రాంతం, ఇనాం, పీటీ భూముల సమస్యలు, ఇతర అనేక భూ వివాదాలు వీటి పరిధిలోనే ఉన్నాయి. ఐతే వీటిపై స్పష్టత లేకుండానే రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. రెవెన్యూ యంత్రాంగం ఏ భూమి సమస్యలను పరిష్కరించకుండా కోర్టుకే వెళ్లమని సూచిస్తుండడంతో పేదలు అన్యాయానికి గురవుతున్నారు. అందుకే భూమి ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉండాలి. భూమి సమస్యలు ఉన్న పేదలకు ఉచిత న్యాయ సాయం అందించేందుకు పారాలీగల్ వ్యవస్థను రూపొందించాలి.

తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టో 2023

1. భూధార్ భూముల రీ సర్వే చేసి ప్రతి కమతానికి 'భూధార్' కార్డ్ ఇవ్వాలి. ఆ భూకమతానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఆ కార్డులో ఉండాలి.

2. ఒకే భూమి చట్టం ఇప్పుడు అమలులో ఉన్న అన్ని భూమి చట్టాలను కలిపి ఒకే చట్టంగా చెయ్యాలి.

3. టైటిల్ గ్యారంటీ భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి.

4. సాదా బైనామా ఆర్వోఆర్ చట్టాన్ని సవరించి పెండింగులో ఉన్న సాదా బైనామా ధరఖాస్తులను పరిష్కరించి పట్టాలు ఇవ్వాలి.

5. అసైన్డ్ భూములు పి.ఓ.టి. చట్టాన్ని సవరించి అసైన్డ్ భూములపై పేదలకు పూర్తి హక్కులు కల్పించాలి.

6. పోడు భూములు పోడు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి హక్కు పత్రాలు అందించాలి.

7. రెవెన్యూ ట్రిబ్యునల్ భూ వివాదాల పరిష్కారానికి జిల్లాకు ఒక భూమి ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి. భూమి సమస్యలు ఉన్న పేద కుటుంబాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. అందుకోసం పారా లీగల్ పథకాన్ని అమలు చెయ్యాలి.

8. ధరణిలో ఉన్న తప్పులను గ్రామ స్థాయిలో రెవెన్యూ కోర్టులు నిర్వహించి సత్వరం పరిష్కరించాలి. కంప్యూటర్లు ఉన్న భూమి రికార్డుల వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండాలి. రికార్డుల్లో తప్పులు ఉంటే సత్వరమే సవరించే మార్గం ఉండాలి. కంప్యూటర్లో ఉన్న రికార్డుకు భద్రత ఉండాలి.

9. 22ఏ జాబితా నిషేధిత ఆస్తుల జాబితాలో తప్పుగా నమోదైన పట్టా భూములను గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి వెంటనే ఆ జాబితా నుండి తొలగించాలి.

10. భూ పరిపాలన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన యంత్రాంగాన్ని పటిష్టపరచాలి. మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. అందుకోసం భూమి అకాడమీని ఏర్పాటు చెయ్యాలి.

11. భూమి కమిషన్, భూ పరిపాలన, భూమి చట్టాలు, విధానాల అధ్యయనం, మారుతున్న కాలమాన పరిస్థితులలో చెయ్యాల్సిన మార్పుచేర్పులను సూచించడానికి నిపుణులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కూడిన భూమి కమిషన్ ఏర్పాటు చెయ్యాలి.

12. భూ విధానాలు భూమి విధానం, భూమి వినియోగ విధానాన్ని రూపొందించాలి.

13. భూసేకరణ 2014 లో చేసిన భూసేకరణ చట్టాన్ని యధాతధంగా అమలు చెయ్యాలి.

14. కౌలు రైతులు, కౌలుదార్లను సాగుదార్లుగా గుర్తింపు ఇచ్చి వారికి రైతులుగా అందాల్సిన అన్ని మేళ్లు అందించాలి. అందుకోసం కొత్త కౌలు చట్టం రూపొందించాలి.

-శిరందాస్ ప్రవీణ్ కుమార్

80966 77450

Advertisement

Next Story

Most Viewed