క్రీడలకు కరికులంలో చోటేది..?

by Ravi |   ( Updated:2024-08-29 00:45:41.0  )
క్రీడలకు కరికులంలో చోటేది..?
X

క్రీడలు, విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలకభూమిక పోషిస్తాయి. అటువంటి క్రీడలను అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వాలు ప్రోత్సహించకపోవడంతో మన దేశం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలను సాధించడంలో వెనుకంజ వేస్తున్నది.

ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్‌లో మన దేశం అరకొరగా పతకాలు సాధించడం అందులోనూ స్వర్ణం సాధించకపోవడం నిరాశను కలిగిస్తున్న అంశం. జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న దేశం పతకాలను సాధించడంలో రెండంకెల సంఖ్యను దాటకపోవడం ఆందోళనను కలిగిస్తున్నది. ఇటువంటి పరిస్థితులకు కారణం ఏమిటి? చిన్న చిన్న దేశాలు కూడా పతకాల వేటలో ముందంజంలో ఉంటున్నాయంటే లోపం ఎక్కడుంది అన్న ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఆటస్థలాలు లేని స్కూళ్లు..

స్వాతంత్ర్యం లభించిన తొలినాళ్లలోనే వ్యాయామ విద్య ప్రాధాన్యతను గూర్చి తారాచంద్ కమిటీ సూచించింది. ఆ తరువాత నియమించబడిన అనేక కమిటీలు కూడా క్రీడల ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. 2005లోని కరికులం ఫ్రేమ్ వర్క్, 2009లోని విద్యాహక్కు చట్టం కూడా ఆటపాటలతో కూడిన చదువులకే జైకొట్టాయి. కానీ ఆచరణలో మాత్రం ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పకతప్పదు. 1994లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో-01 ప్రకారం ఆట స్థలం కలిగిన పాఠశాలకు మాత్రమే అనుమతులివ్వాలని నిర్దేశించినా నేడు యాభై శాతానికి పైగా పాఠశాలల్లో ఆట స్థలాలు లేవనేది నిర్వివాదాంశం. పట్టణ ప్రాంతాల్లోనైతే మెజారిటీ ప్రైవేటు పాఠశాలలు అపార్ట్‌మెంట్‌లలో, చిన్న చిన్న గదులలో నడుస్తున్నాయనేది అంగీకరించాల్సిన విషయమే. కనీసం నిలబడడానికి కూడా చోటు లేకపోవడం విడ్డూరం. ఇక సర్కారు బడుల విషయానికొస్తే అట స్థలాలు ఉన్నా చాలా పాఠశాలల్లో విద్యార్థులను ఆటల్లో సన్నద్ధం చేయడానికి సరిపడా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. అందుకే ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు చేపట్టాలి. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లో చోటు కల్పించాలి. విద్యా ప్రణాళికల్లో క్రీడలకు తగు ప్రాధాన్యాన్ని కల్పించాలి. అకడమిక్ క్యాలెండర్లో మిగితా సబ్జెక్టులకు కేటాయించిన విధంగా, క్రీడలకు కూడా సరిపడా పీరియడ్‌లు కేటాయించాలి. వివిధ క్రీడలలో విశేష ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల గురించి విద్యార్థులకు తెలియజేసి వారిలో స్ఫూర్తిని నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

క్రీడలను ప్రోత్సహించేందుకు..

క్రీడలపై తల్లిదండ్రుల వైఖరిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు చదువులే కాకుండా చదువులతో పాటు క్రీడల్లో కూడా పిల్లలను ప్రోత్సహించాలి. ఆటలు ఆదుకునేందుకు వారికి సమయమివ్వాలి. ఇటీవలి కాలంలో పిల్లలు శారీరక దృఢత్వాన్ని పెంపొం దించే ఆటలకు దురమవుతున్నారనేది అంగీకరించల్సిన నిజం. ఎంతసేపు మొబైల్ ఫోన్లలో గేమ్స్‌కు బానిసలవుతున్నారు. తద్వారా అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఈ అలవాటు నుండి పిల్లలను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఎంతైనా ఉన్నది. ఇక స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ద్వారా పాఠశాలల్లో విద్యార్థి నుండి వసూలు చేస్తున్న మొత్తాన్ని అన్ని మేనేజ్మెంట్ల పాఠశాల నుండి ఖచ్చితంగా వసూలు చేసి ఆ మొత్తాన్ని మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి. ప్రతి మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణాలలో యువతకు శిక్షణ ఇప్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల మాదిరిగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలి. యువ క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు రూపొందించాలి. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో స్పోర్ట్స్ స్కూల్‌ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ముదావహం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఖేలో ఇండియా తరహాలో నూతన కార్యక్రమాలను ప్రవేశపెట్టి క్రీడాకారులను పోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం.

(నేడు జాతీయ క్రీడా దినోత్సవం)

- సుధాకర్ ఏ.వి.

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed