- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్లో తెలంగాణపై చిన్న చూపెందుకు?
2024-25 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణకు 11వసారి కూడా తీవ్ర అన్యాయం చేశారు. గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి "శుష్క వాగ్ధానాలు,శూన్య హస్తాలు" చూపారు. ఈ సారి కూడా మోడీ సూచన మేరకు ఆర్థిక మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ 'తెలంగాణ' అనే పదాన్ని కూడా తన 85 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించ లేదు. బీజేపీ గత పదేళ్లుగా అదే పనిగా ఇంత అన్యాయం చేస్తున్నా.. మన తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకి ఓట్లు గుద్ది 8 పార్లమెంట్ సీట్లను కట్టబెట్టి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు తలలు పట్టుకొని ఏం లాభం?
మోడీకి మొదటి నుంచి వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఇష్టం లేదు. ఇప్పటికే రెండు మూడు సార్లు 'తల్లిని చంపి, బిడ్డను తీశారు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో అనేక సార్లు తెలంగాణ అభివృద్ధి పథకాలకు ఆర్థిక సహాయం చేయాలని గత ముఖ్య మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రులు కేంద్రానికి అనేక వినతి పత్రాలు, విజ్ఞప్తులు చేశారు. కేంద్ర మంత్రులను కలిసి ప్రాధేయపడ్డారు. అయినా మోడీ ప్రభుత్వం వారి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టింది.
కేవలం మంత్రి పదవులేనా..?
తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు ఒరిగిందేమిటి? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ ప్రజలకు ఏం దక్కింది? బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు జరిగిన అన్యాయానికి పంజాబ్ వాళ్లు గొంతెత్తారు. కర్ణాటక వాళ్లు కత్తులు దూశారు. బెంగాల్ వాళ్లు బెబ్బులులై గర్జించారు. కానీ తెలంగాణ బీజేపీ నాయకుల గొంతు సభ లోపల, బయటా పెగల్లేదు. వీరు అసమర్థులనీ, కనీసం పార్లమెంట్‌లో నోరు తెరవని వాజమ్మలనీ వారికి వారే రుజువు చేసుకున్నారు. వారికి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా సోయి కూడా లేదు. 48 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్‌లో 4 పైసలు కూడా నిర్మలమ్మ తెలంగాణకు విదిలించలేదు.
ఊతకర్రలకు ఊతం ఇచ్చి..
చంద్రబాబు, నితీష్ కుమార్ ఊత కాళ్లతో నిలబడిన బీజేపీ ప్రభుత్వం తరపున కృతజ్ఞతా పూర్వకంగా ప్రధాని మోడీ కేవలం తన కుర్చీని కాపాడుకొనేందుకు బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు పారించారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో పోలవరం నిర్మాణానికి హామీ లభిం చింది. రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు ఇస్తుంది. అలాగే బిహార్‌కు రహదారుల నిర్మాణానికి రూ. 26 వేల కోట్లు, పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ. 21,400 కోట్లు, వరదల నివారణకు రూ.11,500 కోట్లు, గయాలో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి, అలాగే పర్యాటక కేంద్రంగా నలంద ప్రాంతం అభివృద్ధికి, కొత్త ఎయిర్ పోర్టులకు, వైద్య కాలేజీలకు బిహార్ రాష్ట్ర బడ్జెట్‌ను తలపించేలా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను ఈసారి నిర్మలమ్మ ప్రభుత్వం చేసింది. ఆ రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇవ్వవలసిందే. మనకు అభ్యంతరం లేదు. వారిపై మనకు సోదర రాష్ట్రంగా అసూయ కూడా లేదు. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ కూడా ఉందనే విషయం మోడీ ప్రభుత్వానికి తెలియదా? తెలంగాణపై ఇంత చిన్న చూపు ఎందుకు?
ఉమ్మడి పోరుతో బీజేపీని ఓడించాలి!
తెలంగాణ పెండింగ్ సమస్యలు ఉదాహరణకు మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రోరైల్, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఐటీఐఆర్ వంటి సమస్యలపై కనీసం బడ్జెట్‌లో నిధులు కేటాయించే ప్రస్తావన ఎందుకు చేయలేదు? తెలంగాణపై ఇంత కక్ష దేనికి? ఈ బడ్జెట్‌లో ఎంతో కొంత నిధులు కేటాయిస్తే కేంద్రానికి పోయేదేముంది? అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడిగా బీజేపీ పతనానికి ఏకం కావాలి. బీజేపీయేతర రాష్ట్రాలలో విపక్ష కూటమితో చేతులు కలిపి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని గెలవకుండా చూడాలి. మన బీజేపీ ఎంపీలకు తెలంగాణ నుంచి ఓట్లు, సీట్లు మాత్రమే కావాలి కానీ, వారికి తెలంగాణ అభి వృద్ధి అవసరం లేదు. ఉంటే ప్రధానిని, ఆర్థిక మంత్రిని నిధుల కోసం ఎందుకు నిలదీయలేదు? ఇలాంటి నాయకులు మనకు ప్రతినిధులుగా ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీని ఉమ్మడిగా ఎదిరించి చిత్తుచిత్తుగా ఓడించాలి.
డా. కోలాహలం రామ్ కిషోర్,
98493 28496