- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదంలో.. ప్రభుత్వ విద్యారంగం!
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలతో సతమతమవుతున్నాయి. కానీ, ఇదే సందర్భంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం సరైన నాణ్యత ప్రమాణాలు లేకున్నా ఇష్టాను రీతిలో ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ఫీజులను అరికట్టడంలో చోద్యం చేస్తుంది. ప్రైవేటు పాఠశాలలో నర్సరీకి నాలుబై వేల నుండి రెండు లక్షల వరకు డబ్బులు దండుకునే పరిస్థితి దాపురించింది. దీన్ని అరికట్టడానికి ఫీజు నియంత్రణ చట్టం తేవాలని విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫీజు నియంత్రణ చేయలేదంటే ప్రైవేటు కార్పొరేట్ వర్గాలకు ప్రభుత్వం కొమ్ముకాయడమే. ఈ సంవత్సరం పాఠశాలల పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ లో దేశంలో మన రాష్ట్రం 31 వ స్థానంలో ఉంది. విద్యా నాణ్యత ప్రమాణలలో కూడా వెనుకబడింది. విద్యారంగానికి ప్రభుత్వం కేటాయించే నిధులు ఆరా కోరగా ఉండటంతో పాటు, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమస్యలతో స్వాగతం చెబుతున్నాయి.
ప్రాథమిక విద్యలో..
మన రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలో సుమారు 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగతా 40 లక్షల విద్యార్థులందరూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ఐతే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారని కారణం చూపి నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. పైగా మరిన్ని మూసివేయాలనే ధోరణిలోనే ప్రభుత్వం ఉంది. దీంతో పేద వర్గాలకు ప్రాథమిక విద్య భారమయ్యే పరిస్థితి ఉంది. మొత్తం తొమ్మిదేళ్ల పాలనలో పాఠశాల విద్యకు కేటాయించింది ప్రభుత్వం అరకొర నిధులే, అవీ పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. అందుకే చాలా పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవు. విద్యార్థులు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ వంటివి లేవు. ఈ విద్యా సంవత్సరం స్వచ్ఛ కార్మికులు లేకపోవడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే తరగతి గదులను ఊడ్చే పరిస్థితి నెలకొన్నది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తయిన యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పూర్తిగా విద్యార్థులకు అందలేదు. మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలల రూపురేఖలు మారుతాయనుకుంటే, దీనికి నిధుల విడుదలలో జాప్యం. దీనివల్ల విద్యా సంవత్సరం ప్రారంభమైన సగం పనులే జరిగాయి. రాష్ట్రంలో సుమారుగా 26 వేల పైగా టీచర్ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు సరైన టీచర్ లేక ఒక టీచర్ రెండు సబ్జెక్టులు బోధించే పరిస్థితి ఉంది. పాఠశాలల పర్యవేక్షణ చేసే ఎంఈఓ, డీఈఓలే రాష్ట్రంలో కరువైనారు.
ఇంటర్మీడియట్ విద్యలో..
ఇక, ఇంటర్మీడియట్ విద్యా పూర్తిగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో బందీ అయింది. ఉద్యమ కాలంలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు తెలంగాణలో ఉండవని మాట్లాడిన పాలకులు నేడు వాటిని అన్ని జిల్లాల్లో విస్తరించడానికి అనుమతి ఇస్తున్నారు. రకరకాల పేర్ల మీద లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడుతూ, కనీస ప్రమాణాలు లేకుండా అనుమతులు లేకుండా కాలేజీలు నడుపుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 9.5లక్షల విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతుంటే, ఇందులో 1.8లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నారు. వీరికి నేటికీ పాఠ్యపుస్తకాలు అందలేదు. పైగా కాలేజీల్లో లెక్చరర్ల కొరత తీవ్రంగా ఉంది. వీరికి మధ్యాహ్న భోజనం హామీ నేటికీ అమలు కాలేదు. సొంత భవనాలు లేకపోవడంతో చాలా జిల్లాలలో షిఫ్ట్ వైస్‌గా కాలేజీ నడిచే పరిస్థితి ఉంది. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న గురుకులాలుకు స్వంత భవనాలు లేవు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికే పరిస్థితి ఉంది. పౌష్టికాహారం విద్యార్థులకు అందడం లేదు.
ఉన్నత విద్యలో..
ఇక, ఉన్నత విద్యకు కేంద్రాలైన విశ్వవిద్యాలయాలు నేడు సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో సుమారుగా రెండు వేల పైన ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవి భర్తీ చేయకపోవడంతో కొన్ని డిపార్ట్మెంట్స్ మూతపడే పరిస్థితి దాపురించింది. కొన్ని డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్, పార్ట్ టైం టీచర్లతో నడుస్తున్నాయి. పీజీ సెంటర్స్, డిగ్రీ కళాశాలలో కూడా అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం కళాశాలలో ఒకరిద్దరు పూర్తి కాలం అధ్యాపకులు ఉంటే, మిగతా వారు కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీతో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉన్నత విద్యకు ప్రభుత్వం కేటాయించే నిధులు కేవలం టీచర్లకు జీతాలు ఇవ్వడానికి సరిపోతుంది. సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో, విశ్వవిద్యాలయాలు వివిధ కోర్స్ ఫీజులు భారీగా పెంచారు. దీంతో పేద సామాన్య విద్యార్థులు చదువుకోవడం గగనం అవుతుంది. గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పూర్తిగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రొఫెషనల్ విద్యార్థులు సైతం కోర్సు పూర్తయిన తర్వాత వివిధ ఉద్యోగ అవకాశాలు వచ్చిన బకాయిలు విడుదల రాకపోవడంతో డబ్బులు కట్టలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. పై చదువులు చదువుకోడానికి కూడా ఇది ఆటంకంగా మారింది. రీసెర్చ్ చేసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫెలోషిప్ సహకారం లేదు. ఘనమైన చరిత్ర కలిగిన ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలు నేడు సమస్యలతో బోసిపోతున్నాయి.
ఇలా రాష్ట్రంలో అట్టడుగు పేద వర్గాలకు చదువును దూరం చేస్తూ, వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీలను పూరించకుండా నిర్లక్ష్యం చేస్తూ, ఫీజు నియంత్రణ చట్టంను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తూ.. ప్రైవేట్ కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు జరగనున్న బంద్‌ను జయప్రదం చేద్దాం.
-ఆర్.ఎల్.మూర్తి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు
82476 72658