అన్ని ప్రభుత్వ పాఠశాలల కథ.. కన్నీటి పర్యంతమే!

by Ravi |   ( Updated:2023-07-21 00:15:37.0  )
అన్ని ప్రభుత్వ పాఠశాలల కథ.. కన్నీటి పర్యంతమే!
X

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాభివృద్ధిపై ముఖ్యంగా విద్యాభివృద్ధిపై సీమాంధ్ర పాలకవర్గాలు శీతకన్ను వేశారని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సైతం అవే ఇబ్బందులు పడుతుండటం విచారకరం. కేజీ నుంచి పీజీ వరకు చిరు ఉద్యోగి నుండి కలెక్టర్ వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా అంతరాలు లేని సమాన అవకాశాలతో కూడిన విద్యను అందిస్తామని తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావంలో పాలక పెద్దలు ప్రకటించిన విషయాన్ని ఇంతవరకు అమలులోకి తీసుకురాలేదు. గతంలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించడం, ఖాళీగా ఉన్న పోస్టులలో విద్యా బోధన చేస్తున్న 12,000 మంది విద్యా వాలంటీర్లను తొలగించడం, భౌతిక, మౌలిక వసతులకు నిధులు సరిపోయేంతగా సకాలంలో అందించకపోవడంతో పాఠశాలలన్నీ కనీస సౌకర్యాలు లేకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దుస్థితిని ఎదుర్కొంటున్న గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి మనవడు, కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు దత్తత తీసుకొని అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాలగా, ఆకర్షణీయంగా తీర్చి దిద్దడం జరిగింది. తన పుట్టినరోజున విద్యాశాఖ మంత్రితో కలిసి పలు సౌకర్యాలకు ప్రారంభోత్సవం చేస్తూ, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిమాన్షు మాట్లాడుతూ.. మొదటిసారి ఈ బడిని చూసినప్పుడు కన్నీళ్లు వచ్చాయని కనీసం వసతులైన మరుగుదొడ్లు లేకపోవడం, పరిసరాలు, బడిలో మెట్లు కూడా సరిగా లేకపోవడం, ప్రత్యేకంగా హెడ్మాస్టర్‌కు గది కూడా లేకపోవడంతో చలించిపోయానని అందుకే ఈ పాఠశాల అభివృద్ధికి నిధులు సేకరించి ఆధునీకరించానని చెప్పాడు ఇది అభినందనీయం.

అడుగడుగునా అవసరాల లేమి

అయితే , అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కన్నీటి పర్యంతమేనని అందరూ తెలుసుకోవాల్సిన విషయం. హైదరాబాదుకు సమీపంలో ఉన్న పాఠశాలలోనే కనీస అవసరాల లేమితో ఉంటే, అత్యంత మారుమూల ఆదివాసీ గూడాలలో పల్లెలలో గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాల పరిస్థితి ఎంత దయనీయంగా అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలు నిధుల లేమితో పూర్తికాలేదు. పైగా గతంలో ఉన్న కొద్దిపాటి వసతులను నూతన నిర్మాణాల పేరిట తొలగించడంతో బాలికలు, ఉపాధ్యాయినిలు మానసిక వేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో సుమారుగా 26,000 ప్రభుత్వ బడులు ఉండగా, వాటిలో 25 లక్షలకు మందికి పైగా చదువుకుంటున్నారు. బడి బాటలో మరో లక్ష మంది పాఠశాలలో చేరడం జరిగింది. దీంతో స్కూల్ టీచర్ల కొరత తీవ్రమైంది.

ఇంగ్లీష్ సరే.. టీచర్ల సర్దుబాటు!

గత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టింది. ఈ విద్యాసంవత్సరం నుండి 9వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సింది. ఆ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సర్దుబాటు లేదు. తాత్కాలికంగా 7 వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. కానీ పాఠశాల విద్యా భాగంలో చదువు చెప్పే టీచర్ నుంచి పాఠశాలలను పర్యవేక్షించే వరకు అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దాంతో సరైన పర్యవేక్షణ లేక చదువుకుంటూ పడుతుందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, ఏడుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు, డిప్యూటీ డీఈఓలు 6గురు, అలాగే మండల విద్యాధికారుల పోస్టుల్లోనూ 95 శాతం మంది ఇన్ఛార్జీలే కొనసాగుతున్నారు. ప్రధానోపాధ్యాయులు 4252 కావాల్సి ఉండగా 2270 మంది మాత్రమే ఉన్నారు. 10 డైట్ కాలేజీలు ఉండగా అందులో 6 ఖాళీగా ఉన్నాయి. 70 సీనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం లేదు.

ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాదనలు కూడా ఉన్నాయి.

పాఠ్యపుస్తకాలూ లేవు

పాఠశాలలు సక్రమంగా నడవాలన్నా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందాలన్నా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ కీలకం. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, అన్ని విషయాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నేటి వరకు చేరలేదు. పుస్తకాలు రెండు భాషలలో ముద్రించడం మూలంగా పార్ట్ వన్, పార్ట్ 2 గా విడదీయడం జరిగింది. పోయిన విద్యా సంవత్సరంలో పార్ట్ వన్ పుస్తకాలే పూర్తి స్థాయిలో అందినాయి. ఈ సంవత్సరం పాఠశాల ప్రారంభమై రెండో నెల పూర్తి కావస్తున్న పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు నేటి వరకు కూడా అందలేదు. ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు నిర్వహించకపోవడం వలన, సంవత్సరాల తరబడి ఒకే పాఠశాలలో పనిచేస్తూ, నియామకం పొందిన దగ్గర నుంచి ఓకే క్యాడర్లో పనిచేస్తూ, 317 జీవో ద్వారా నాన్ లోకల్ పేరుతో ఇతర జిల్లాలకు విసిరి వేయబడటంతో, కుటుంబాలకు దూరమయ్యారు.భోజన బిల్లులు అందకపోవడంతో కార్మికులు సమ్మె చేస్తున్నారు.దీనివల్ల ఉపాధ్యాయులే గరిట తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పూర్వ విద్యార్థులు స్పందించాలి

ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో కేశవనగర్ పాఠశాల అభివృద్ధికి హిమాన్షు చేసిన కృషి సామాజిక బాధ్యత, స్పృహతో కూడిన, అభివృద్ధికరమైన కార్యం. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి అభివృద్ధి కార్యక్రమం, మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం అందించడం, విద్యార్థులకు పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు అందించడం, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం లాంటి ప్రగతిశీల కార్యక్రమాలు ఉన్నా... క్షేత్రస్థాయిలో విద్య పట్ల, పాఠశాలల అభివృద్ధి పట్ల ఇంకా ఎంతో శ్రద్ధ చూపవలసిన అవసరం ఉన్నది. కనుక ప్రభుత్వంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుని ఆర్థికంగా బలపడిన వారు పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...

తండ సదానందం

టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

99895 84665

Advertisement

Next Story