కశ్మీర్‌లో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా?

by Ravi |   ( Updated:2024-11-13 00:46:12.0  )
కశ్మీర్‌లో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా?
X

జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో స్టేట్ సర్కార్ తీర్మానాన్ని ప్రతిపాదించిన సమయంలో సభలో బీజేపీ వ్యవహరించిన తీరు యావత్తు దేశాన్ని కలవరపరిచింది. బీజేపీ, సభలో చర్చకు ఆస్కారం లేకుండా గందరగోళం చేయడం ద్వారా కశ్మీర్ ప్రజల పట్ల తమ వ్యతిరేక తీరును మరోసారి బయటపెట్టింది.

ఆర్టికల్ 370ని దశాబ్దాలుగా వాడుకొని..

అసెంబ్లీలో ఈ తీర్మానం మెజార్టీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినప్పటికీ, రెండు దినాల పాటు సభను నడవనీయకపోవడంపై బీజేపీకి ప్రజాస్వామ్యంపై, చట్టసభలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. తాము అధికారంలోకి వస్తే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) హామీ ఇచ్చింది. ప్రజలు ఆ పార్టీ ఆధ్వర్యంలోని కూటమిని మెజార్టీ స్థానాలతో గెలిపించారు. దీంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హామీ ఇచ్చినట్లుగానే తీర్మానం పెట్టింది.

రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య మీద నైనా సభ్యులు సభలో చర్చించడం వేరు, వైఖరి చెప్పడం వేరు. అసలు తీర్మానమే వద్దనడం వేరు. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తీర్మానం పెట్టకూడదని బీజేపీ నాయకులు అడ్డుకోవడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. జమ్మూ కశ్మీర్‌లో తాము ఆర్టికల్ 370ను తొలగిస్తామని ఆర్ఎస్ఎస్, బీజేపీ కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలకు వాడుకున్నాయి. ఇప్పటికీ వాడుకుంటూనే ఉన్నాయి. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రాగానే ఏకపక్షంగా 370 ఆర్టికల్‌ను 35 (A)ను తొలగించింది. జమ్ముకశ్మీర్‌ను జమ్ము, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతా లుగా విభజించింది. అయితే ఇక్కడ 370 ఆర్టికల్ ద్వారా జమ్మూకశ్మీర్‌కు లభించిన ప్రత్యేక హోదాను అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోరడం బీజేపీకి భూతంలాగా కనిపించింది.

రాష్ట్ర హోదా ఇస్తేనే..

ఏ రాష్ట్రాన్నయినా విభజించాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది రాజ్యాంగ అంశం. కానీ ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి గవర్నర్‌తో నివేదిక తెచ్చుకుని జమ్ము కశ్మీర్‌ను బీజేపీ విడదీసింది. జమ్మూ కశ్మీర్‌కు దశాబ్ధం పాటు ఎన్నికలు లేవు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పీడీపీ పార్టీ తరఫున ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ముఖ్యమంత్రి అయ్యా రు. ఆయన మృతి చెందిన తర్వాత అదే బీజేపీ మద్దతుతో 2016లో ఆయన కుమార్తె మోహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. ఆమె 2018లో బీజేపీ మద్దతు వెనక్కి తీసుకోని తన పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది.

2019లో రాష్ట్ర విభజన తర్వాత 2024లో రెండు సార్లు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించిన బీజేపీ కావాలనే అసెంబ్లీ ఎన్నికలను ఆపింది. 370 ఆర్టికల్ రద్దు చేశాక కొంతకాలంగా భారీ భద్రతా బలగాల పహారా, విపక్ష నేతలను నిర్బంధించడం, పత్రికా స్వేచ్ఛను హరించడం, ఏకంగా ఇంటర్ నెట్‌ను బంద్ చేయడం ఇలా బీజేపీ ఉద్రిక్తతలకు అంతులేకుండా పోయింది. అందు కే ప్రజలు ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించారు. అయినా కూడా తన విద్వేష రాజకీయాలనే నేటికీ కొనసాగిస్తోంది. జమ్మూ అసెంబ్లీలో బీజేపీ సభ్యుల ప్రవర్తన ప్రధాని, కేంద్ర హోంమంత్రి డైరెక్షన్‌లోనే జరిగిందన్నది వాస్తవమే. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తేనే అక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. రాజ్యంగంపై వారికి నమ్మ కం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీలు సైతం అందరితో న్యాయమైన సంప్రదింపులు జరిపితేనే జమ్మూకశ్మీర్‌లో శాంతి ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

పట్ట హరిప్రసాద్

87908 43009

Advertisement

Next Story

Most Viewed