పాలనలో.. రాజకీయ పార్టీలన్నీ అంతే!

by Ravi |   ( Updated:2023-08-29 00:46:13.0  )
పాలనలో.. రాజకీయ పార్టీలన్నీ అంతే!
X

పాలక పార్టీలన్నీ 2024 సాధారణ ఎన్నికలకు సిద్దమౌతున్నాయి. ఎన్నికల పొత్తులు, ఎత్తులు, పై ఎత్తులు పన్నుతున్నాయి. ఎన్‌‌డీఏ కూటమికి వ్యతిరేకంగా 26 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. పరస్పరం ఈ రెండు కూటముల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

కూటముల విధానాలన్నీ ఒక్కటే..

ఆంధ్రప్రదేశ్‍లో అధికారంలో ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలసి ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయంగా కన్నిస్తున్నది. బీజేపీ వైఖరి ఇంకా స్పష్టపడలేదు. ఈ మూడు పార్టీలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అందుకు ప్రతిగా వైసీపీ విమర్శలు సంధిస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రలోభాలతో తమలో కలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తామని ప్రకటించింది.

కేంద్ర స్థాయిలో ఏర్పడిన రెండు కూటములకు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలకు అధికారం చేజిక్కించుకోవడం ప్రధాన లక్ష్యం. సామ్రాజ్యవాద, బడా పారిశ్రామిక వేత్తల, బహుళజాతి సంస్థల ప్రయోజనాలు కాపాడంలోను, దేశ సంపదలను వాటి పరం చేయటంలోనూ, వాటి దోపిడీకి ద్వారాలు తెరవటంలోనూ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంలోనూ, చిన్న, సన్నకారు రైతుల భూములు కార్పొరేట్ల కట్టబెట్టే విధానాలు అమలు జరపటంలోనూ ఈ పార్టీల విధానాలన్నీ ఒకటే. ఒక్క మాటలో ఈ కూటము లేవీ ప్రజా సమస్యలు పరిష్కరించవు. పరిష్కరించే కార్యక్రమం లేదు.

అధికారం కోసం..హక్కులు హరిస్తూ

అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ కూటమి, అధికారంలోకి రావడానికి ఇండియా కూటమి ప్రత్యర్ధులపై విరుచుకు పడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ కూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈడీ ద్వారా ప్రత్యర్థి పార్టీల నాయకుల ఇండ్లపై దాడులు చేయించి, కేసులు బనాయించి దెబ్బ తీయాలని చూస్తున్నది. తనకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు గవర్నర్లను పావుగా వాడుకుంటున్నది. తెలంగాణ, తమిళనాడు,కేరళ గవర్నర్లు అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం మాట్లాడుతున్న తీరు అందులో భాగమే. గవర్నర్ల నియామకంలో తన విధేయులనే మోడీ ప్రభుత్వం నియమిస్తున్నది. రాష్ట్రాల హక్కులను హరించేందుకు చట్టాలనే మారుస్తున్నది. అలాగే ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉండే విధంగా ప్రధాన ఎన్నికల అధికారితో పాటు కమిషన్ ఇతర సభ్యులను ఎన్నుకోవటానికి ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కమిటీ ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగైతే తన ఆటలు సాగవని గ్రహించిన మోడీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించే విధంగా రాజ్యసభలో 2023 ఆగస్టు 10న బిల్లు ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఎన్నికల కమిషన్ తన చేతుల్లో ఉండేలా చేసుకోవడమే కాకుండా, సుప్రీంకోర్టు తీర్పును అమలు జరపనని చెప్పకనే చెప్పింది.

370 ఆర్టికల్‌ను రద్దు చేసి, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. ఎన్నికల్లో గెలిచి ఏర్పడిన అమ్ ఆద్మీ పార్టీని అస్థిర పరిచేందుకు ఆ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా లెప్ట్‌నెంట్ గవర్నర్‌కు అధికారాలు కట్టబెడుతూ పార్లమెంట్‌లో చట్టాన్ని సవరించింది. దీని ద్వారా ఢిల్లీ ప్రభుత్వ అధికారుల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించింది. మహారాష్ట్రలో ఫిరాయింపులను ప్రోత్సహించి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చింది. రాహుల్ గాంధి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించింది. సుప్రీం తీర్పుతో తిరిగి పునరుద్ధరించింది.

పాలనలో.. రెండు పార్టీలు అంతే!

బీజేపీ ఫాసిస్టు తరహా విధానాలు అమలు చేస్తుంది. వీటిని వ్యతిరేకించాల్సిందే. ఇండియా కూటమి ఇదే చేస్తానంటున్నది. అదే క్రమంలో సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా దేశ ఆర్థిక విధానాలను అమలు పరిచింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించింది. ప్రజా ఉద్యమాలను క్రూరమైన అణచివేతకు గురిచేసింది. కులమతాలను నైపుణ్యంగా ఉపయోగించుకున్నది. కాశ్మీర్ సమస్యపై చేసిన ఒప్పందాలను ఉల్లంఘించి, ప్రజా అభిప్రాయ సేకరణ వాగ్ధానాన్ని పక్కన పెట్టింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించకుండా రావణకాష్టంలా మార్చింది. అత్యవసర పరిస్థితి ప్రకటించి పౌరహక్కులు కాలరాసి, అనేక నిర్బంధ చట్టాలు చేసింది. టీయంసీ, డీఎంకే, సమాజ్ వాది, ఆర్‌జేడీ పార్టీలు కూడా ప్రజా వ్యతిరేక పాలననే సాగించాయి. బీఆర్‌ఎస్ సైతం ఇదే తరహాలో పాలిస్తున్నది. బీజేపీ ప్రజాస్వామ్య ముసుగును తొలగించి ప్రజా వ్యతిరేక, ఫాసిస్టు తరహా పాలన సాగిస్తున్నది. బీజేపీ ఫాసిస్టు తరహా విధానాలను వ్యతిరేకిస్తూనే, ఇండియా కూటమి పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.

ప్రజావిశ్వాసానికి దూరంగా వామపక్షాలు

వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఐఎం, సీపీఐ ఎంఎల్( లిబరేషన్)పార్టీలు విప్లవ ప్రజా ఉద్యమ నిర్మాణం నుండి వైదొలగి పార్లమెంటరీ పంధాలో మునిగి పోయాయి. ఫలితంగా ప్రజా పునాది లేని పార్టీలుగా మారి పాలక వర్గాల చెంతకు చేరి పార్లమెంట్, అసెంబ్లీలలో నాలుగు స్థానాలు సంపాదించి పడక కుర్చీ రాజకీయాలకు దిగజారాయి. అందుకే పాలక పార్టీల ఇండియా కూటమిలో చేరాయి. ఈ పార్టీలకు ప్రస్తుత వ్యవస్థ మార్పునకు గాని, పాలక వర్గాలకు వ్యతిరేకంగా గాని స్వతంత్ర కార్యక్రమమంటూ లేదు. పాలక పార్టీల వెనక తిరగటమే వీటి పని. సీపీఐ, సీపీఐఎం పార్టీలు టీడీపీ,కాంగ్రెస్, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఏమి సాధించాయి? పట్టు ఉన్న గ్రామాలను, కార్యకర్తలను కూడా ఆ పార్టీల్లోకి వెళ్లేలా చేశాయి. వీరి విధానాలు కమ్యూనిస్టుల ఎడల ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేశాయి.

కొసమెరుపు..

అధికార మార్పిడి జరిగి 76 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ప్రజల మౌలిక సమస్యలైన భూమి, ఉపాధి, ఉద్యోగం మొదలైన సమస్యలను ఏ పార్టీ ప్రభుత్వమైనా ఉద్దేశపూర్వకంగానే విస్మరించాయి. సామ్రాజ్యవాదుల, బడా పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వాలు కావటమే అందుకు కారణం. ఎన్‌డీఏ కూటమైనా, ఇండియా కూటమైనా, మరే పాలక పార్టీ కూటమైనా ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం చూపవు. దోపిడీ వర్గాల రక్షణ కోసం ఎవరు అధికారంలో ఉండాలన్నా దాని కోసమే ఈ కూటముల మధ్య వైరుధ్యం. ఇందుకు భిన్నంగా విశాల ప్రజా ఉద్యమం ద్వారా నేటి దోపిడీ వ్యవస్థను రద్దు చేసి నూతన ప్రజాతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడే ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అందుకు ప్రజలు ముందుకు రావాలి.

బొల్లిముంత సాంబశివరావు

కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం

98859 83526

Advertisement

Next Story

Most Viewed