ప్రజాస్వామ్యంలో.. రాచరికపు పోకడలెందుకు?

by Ravi |   ( Updated:2024-02-14 01:15:55.0  )
ప్రజాస్వామ్యంలో.. రాచరికపు పోకడలెందుకు?
X

కాకతీయ రాచరికపు పాలనలో సైతం కొన్ని 'అభివృద్ధి' కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు జరిగితే జరిగి ఉంటాయి. వీటి వెనుక కూడా ప్రజల ధన, మాన, ప్రాణాల త్యాగం ఉండే ఉంటుంది. అంతమాత్రాన ఆ రాచరికపు వ్యవస్థ మొత్తం ప్రజా అనుకూలమైన పాలన చేసిందని, స్వర్ణయుగంగా కొనసాగిందని ఏకపక్షంగా రాచరికాన్ని కీర్తిస్తూ సంబరాలు నిర్వహించడం, వారి పోకడలను ప్రజలకు గొప్పవిగా ప్రదర్శించే ప్రయత్నం చేయడం అత్యంత అభ్యంతరకరం. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థను చులకన చేసినట్లుగా భావించాల్సి ఉంటోంది. ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారిక చిహ్నంపై చేసిన ప్రకటన కానీ, ఇటీవల ప్రకటించిన నిర్ణయాలు కానీ తెలంగాణలో ప్రజాస్వామ్య భావనను తిరిగి నిలబెట్టే విధంగా ఉన్నాయి. వాటిని ప్రజాస్వామ్య వాదులు ఎవరైనా ఆహ్వానించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే కుత్సిత బుద్ధి గల నాయకులను తిరస్కరించడం నేటి ప్రజాస్వామిక కర్తవ్యం.

చక్రవర్తి అనుకుని..

సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, వినోద్‌లు ప్రెస్ మీట్ల ద్వారా గగ్గోలు పెడుతున్నారు. ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. దీన్ని ఓ రాజకీయ ఆయుధంగా మలుచుకోవాలని, సెంటిమెంట్ రగిలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెడతామని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీటిపై ప్రజాస్వామిక కోణంలో చర్చ జరగాల్సి ఉంది.

వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరికానికి రాజకీయ 'పట్టాభిషేకం' కుదురుతుందా..? అట్లయితే తెలంగాణ ధిక్కారానికి అది అవమానం కదా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ పాలకుడు కేసీఆర్... నేను రాజును.. రారాజును, చక్రవర్తిని అనుకున్నడు. తెలంగాణ రాజ్యం అన్న భావన వుంది కాబట్టే రాచరిక పోకడలతో తెలంగాణ బిల్లు పాస్ కాగానే 2014లో హైదరాబాద్‌లో రాజ్యాన్ని గెలుచుకొచ్చిన అనే ఫీలింగుతో తన ఆల్లుడు హరీష్ సైన్యాధిపతి అయినట్టు.. కొడుకు యువరాజు అన్నట్టు ఏనుగులు.. గుర్రాలు.. లోటిపిటలపై సవారీలతో రాచరికపు ఊరేగింపు చేయడం తోనే, పోరాడిన తెలంగాణ ప్రజలపై దొరతనం ప్రదర్శనతో మొదలైంది.

ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో..

తను చక్రవర్తిని అంటే ఇది రాజ్యం అనుకున్నడు. ఆయన రాజు అనుకున్నపుడు ఇది రాజ్యమే అయితది. రాజ్యంలో ఉన్నోళ్లు రాజుకు బానిసలు .. బంట్లు అనే కల్చర్ పెరుగుతది కదా? కాబట్టే కొందరు బంట్లు కేసీఆర్ ప్రతి చర్యనూ అహో ఓహో కీర్తనలను అందుకున్నారు తప్పా ఇది ప్రజాస్వామ్యమని గుర్తు చేయలేదు. ఓటర్లు ..ప్రజలు అనే సంబంధం పోయి వీళ్లంతా నా బానిసలు, నేను రాజును, రాజు అంటే ఏంటి? రాజు ఏది చెబితే అదే చట్టం కదా... రాజుకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇదే జరిగింది తెలంగాణలో. ఈ తొమ్మిదిన్నర ఏళ్లుగా అందుకే కేసీఆర్ చక్రవర్తిని అనుకున్నడు. ఎమ్మెల్యేలు రాజులం అనుకున్నరు. ఈ రాజులంతా చక్రవర్తికి కేసీఆర్‌కు ఒబిడియంట్‌గా వుంటే సరిపోతదని అనుకున్నరు.

ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో ఒక రకంగా రాచరిక స్ట్రక్చర్‌తో జయ.. జయహే తెలంగాణ గీతం దళితుడు రాసిండు కాబట్టి వచ్చిన తెలంగాణలో పదేళ్లపాటు ఆ గీతం నిషేధం. తెలంగాణ మట్టి బిడ్డ.. పీడిత జన గొంతుక గద్దరన్నను గడి ముందు ఎండలో 3 గంటలు నిలబెట్టిండు కదా... దీనిలో భాగంగానే రాష్ట్ర చిహ్నం కూడా రాచరికపు అనవాళ్లు వుండేలా తన ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానపరింది సత్యం. అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం ఏది చేసినా వాటి వెనుక ఏదో ప్రయోజనం ఉంటుందనేది తరచూ విమర్శకు లోనయ్యే అంశం. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ప్రజాస్వామ్య భావనను తిరిగి నిలబెట్టే విధంగా ఉన్నాయి. వాటిని ప్రజాస్వామ్య వాదులు ఎవరైనా ఆహ్వానించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టే కుత్సిత బుద్ధి గల నాయకులను తిరస్కరించడం నేటి ప్రజాస్వామిక కర్తవ్యం.

ధిక్కార గడ్డకు అవమానకరం

తెలంగాణలో మహా జాతరగా కొనసాగే మేడారం సమ్మక్క, సారలమ్మలు గిరిజనుల ఆరాధ్య దైవాలుగా ఉన్నప్పటికీ కాకతీయ రాజులకు వ్యతిరేకంగా, వారి ఆధిపత్యానికీ, అమానుషత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించి అమరులయ్యారనేది చరిత్ర మనకు చెబుతోన్న చేదునిజం. కాకతీయ సేనతో జరిగిన యుద్ధంలో అసువులు బాసి ఆదివాసీ గిరిజన వనితలుగా కీర్తి ప్రతిష్టలను పొంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పరిశీలించినప్పుడు కాకతీయుల పాలనతో పాటు అట్టడుగు ఆదివాసీలపై అణచివేతను కాకతీయులు కొనసాగించారనేది మనకు అర్థమవుతున్న విషయం. అందుకే దేనికైనా బొమ్మ బొరుసున్నట్లు మంచీ చెడులు కాకతీయుల పాలనలో కూడా కొనసాగాయి. ప్రజల్లో 'కాకతీయ' గడ్డ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల సందర్భంగా కొన్ని ఓట్లు కొల్లగొట్టేందుకు ఇలాంటి తంతులు వేయడం కేసీఆర్ గజకర్ణ ..గో కర్ణ విద్యలలో ఒకటనేది జగద్విదితమే.

- బండి దుర్గాప్రసాద్

79811 84205

Advertisement

Next Story