ఆంధ్రాలో.. సినీమావి చిగురించేనా?

by Ravi |   ( Updated:2024-06-29 01:00:06.0  )
ఆంధ్రాలో.. సినీమావి చిగురించేనా?
X

తెలుగు సినీరంగ పరిశ్రమ దశలవారీగా ఎదుగుతూ వస్తోంది. మొదట్లో మద్రాసు కేంద్రంగా మొదలై, తరువాత హైదరాబాదుకు తరలివచ్చింది. అనేక విభాగాల్లో, అనేక రూపాల్లో విస్తరించి, ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగింది. అనేకమంది నటులకు, సాంకేతిక నిపుణులకు, కళాకారులకు సినీ పరిశ్రమ జీవనాధారంగా నిలుస్తోంది. సినిమా పరిశ్రమ మద్రాసులో ఉన్న రోజుల్లో సైతం అనేక సినిమాల షూటింగులు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో చాలావరకూ జరిగేవి. అవుట్‌ డోర్‌ షూటింగులకు అనువైన ప్రదేశాలు, వైవిధ్యభరితమైన నేపథ్యాలూ ఆంధ్రప్రదేశ్‌ నిండా ఉండటమే ఇందుకు కారణం. ఈ సారి తెలుగు సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి జరుగుతుందనే అభిప్రాయం ప్రముఖుల్లో వ్యక్తం అవుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత...

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా, ఆంధ్రా పేరుతో నటులు, నిర్మాతలు, దర్శకులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇలా అనేక రంగాలకు చెందిన వారు తమ సంఘాలను కొత్తగా స్థాపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం సుందర నగరం. బీచ్‌లు, విస్తారమైన సుందర మైదానాలు మంచి లకేషన్లుగా ఉన్నాయి. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో కొన్ని షూటింగులు జరుగుతున్నాయి. ప్రతినెలా విశాఖ కేంద్రంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని ఓ సినిమా విడుదల అవుతుంటుంది. అరకు, భీమిలి, మన్యం ప్రాంతాల్లో పెద్దఎత్తున షూటింగ్‌లు జరుగుతున్నాయి. విజయవాడ కేంద్రంగా కూడా షూటింగులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ, కృష్ణానది, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, అమరావతి, హంసలదీవి, నూజివీడు, చల్లపల్లి, ముక్త్యాల కోటల్లో షూటింగులు కొనసాగుతున్నాయి.

అయితే, సినిమాకు సంబంధించిన అన్ని రకాల పనులూ ఇక్కడే పూర్తయ్యే అవకాశం లేదు. సాంకేతిక నిపుణులూ, నటులు, స్టూడియోలూ హైదరాబాదులోనే ఉన్నాయి. ఒక మేరకైనా ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు జరగాల్సి ఉంది. ‘ఆంధ్రప్రదేశ్‌లో విస్తారమైన నదీ, సముద్ర తీరాలు, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల్లో షూటింగులు చేసుకోవడానికి అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ నగరాలు సరికొత్త శోభతో అలరారుతున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు అతి చేరువలో అటవీ ప్రాంతాలు, కోటలు షూటింగ్‌ జరుపుకునేందుకు అనువుగా ఉన్నాయి’.

సినీ పరిశ్రమ ఇక్కడా విస్తరిస్తే..

ఆంధ్రప్రదేశ్‌ కాస్తా తెలంగాణా, ఆంధ్రాగా విడిపోవటంతో మళ్లీ పరిశ్రమ విస్తరణపై చర్చ మొదలైంది. విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా సినిమా పరిశ్రమ ఆంధ్రాలోనూ విస్తరించాలనే ఆకాంక్ష వ్యక్తమైంది. విస్తారమైన సాగరతీరం, అడవులు, కృష్ణా గోదావరి నదులు, ప్రకృతి అందాలూ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏడెనిమిది దశాబ్దాలుగా షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రకాల నేపథ్యాలకు అనువైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో పరిశ్రమ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేసిన సహకారం ఇంతవరకు రాష్ట్రంలో కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉనప్పుడే విశాఖలో రామానాయుడు స్టూడియోస్‌ నిర్మించారు. అయినా, అక్కడ షూటింగులు, నిర్మాణ పనులూ జరిగింది తక్కువ. అందుకే ఆంధ్రలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతీయ కేంద్రాలుగా సినిమా స్టూడియోలు ఏర్పాటు కావాల్సివుంది. స్థానికంగా సినిమా నిర్మాణం చేసే వారికి తగిన రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా కృషి కొనసాగడం లేదు. అడపా దడపా సినిమా షూటింగ్‌లు అరకు, పాడేరు, విజయవాడ ప్రకాశం బ్యారేజీ, హార్స్‌లీ హిల్స్‌, బైరవ కోన వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అక్కడ మౌలిక వసతులు సరిగా లేక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. విశాఖ, తిరుపతి, అరకు వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ అతిథి గృహాలను నామమాత్రపు రుసుంతో కేటాయిస్తే పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చినట్టవుతుందని చిన్న నిర్మాతలు అంటున్నారు. కేరళ రాష్ట్రం మాదిరిగా ఏపీ ప్రభుత్వం కూడా ఇండోర్‌, అవుట్‌డోర్‌ యూనిట్లు ఏర్పాటు చేసి షూటింగ్‌లకు ఇస్తే పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది.

రెండు రాష్ట్రాల్లో తెలుగు సినిమా

నంది అవార్డులు ప్రకటించి సుమారు ఎనిమిదేళ్లు గడిచింది. అప్పట్లో వచ్చిన ఏదో చిన్న సమస్యను బూచిగా చూపించి అవార్డుల ప్రకటన ఆపేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో తిరిగి అవార్డులను ప్రకటిస్తారనే ఆశాభావం పరిశ్రమలో కన్పిస్తోంది. ఈ అవార్డులు ప్రకటించటం ద్వారా ఇండస్టీలో హీరోహీరోయిన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, 24 విభాగాల్లో ఉన్న సాంకేతిక నిపుణులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉన్నా పరిశ్రమకు అనుకున్నంత మేలు జరగటం లేదు. హైదరాబాద్‌ కేంద్రంగానే సినిమా పరిశ్రమ కొనసాగుతోంది. తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో కాక దేశవ్యాప్తంగా వ్యాపార పరిధిని విస్తరించుకుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఆంధ్రాలో కూడా పరిశ్రమ విస్తరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగటమే కాకుండా స్థానికులకు కొంతమేరకైనా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది.

తరలివచ్చిన చిత్ర పరిశ్రమ

తారలు దిగి రావాలని కాసులు కదలాడాలని, టిక్కెట్ల ఇక్కట్లు తీర్చాలని, ఏకగవాక్ష విధానం ద్వారా సినిమా చిత్రీకరణకు అనుమతులు ఇవ్వాలని వినోదపు పన్ను ఇతర రాయితీలు ప్రకటించాలని సినీ దర్శక నిర్మాతలు కోరుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఈ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సారిగా తెలుగు చిత్ర పరిశ్రమ విజయవాడకు కదిలొచ్చింది. ప్రముఖ నిర్మాతలందరూ వచ్చి పవన్ కల్యాణ్ భేటీ కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు చలన చిత్ర రంగ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు అడుగులు ముందుకు పడనున్నాయనే చర్చ సాగుతోంది. ఈ సారి తెలుగు సినిమా రంగానికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి జరుగుతుందనే అభిప్రాయం ప్రముఖుల్లో వ్యక్తం అవుతోంది.

టాలీవుడ్‌కి మంచి రోజులు

తెలుగు సినీ పరిశ్రమకి మళ్లీ మంచి రోజులు వచ్చాయని తెలియజేస్తోంది కూడా. చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి వేదికపై ప్రధాని మోడీ పక్కనే స్థానం కల్పించినప్పుడే తెలుగు సినీ పరిశ్రమకు జరిగిన అవమానాలకు ఉపశమనం కల్పించి మంచి రోజులు మొదలయ్యాయని సూచించినట్లయింది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ సీఎం, డెప్యూటీ సీఎంలుగా ఉన్నారు. జనసేనకు చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్‌కు రప్పించి ఆత్మగౌరవం కల్పించారు. ఇప్పుడు ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌,కందుల దుర్గేష్‌ల మీద ఉంది. వారు ఈ 5 ఏళ్లలో తెలుగు సినీ పరిశ్రమని ఏపీలో కూడా విస్తరించేలా చేయగలిగితే దానికీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా మహోపకారం చేసినవారవుతారు.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story

Most Viewed