మళ్లీ బిగుసుకుంటున్న హుస్నాబాద్ పిడికిళ్లు!

by Ravi |   ( Updated:2024-10-22 01:15:18.0  )
మళ్లీ బిగుసుకుంటున్న హుస్నాబాద్ పిడికిళ్లు!
X

శాతవాహనులు, రాష్ట్రకూటులు, మొఘలులు, కాకతీయుల పాలనలో హుస్నాబాద్ కీర్తి మకుటంగా నిలిచింది. ఢిల్లీ రాజులపై తిరగబడిన సర్వాయి పాపన్నను కడుపుల దాచుకుంది. రాజుల కాలంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ హుస్నాబాద్ ఓ పెద్ద రాజకీయ అడ్డా. రాజకీయ కేంద్రంగా, విప్లవ పోరాటాల నిలయంగా చాలా కాలం పాటు తెలుగునాట అనేక పరిణామాలను ప్రభావితం చేసింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా హుస్నాబాద్ ప్రభావం తగ్గింది. రాష్ట్ర విభజన తర్వాత కనీసం సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంగా కూడా ప్రాభవం పెంచుకునే ప్రయత్నమే జరగలేదని, అభివృద్ధి ముద్ర కూడా కనిపించలేదనే అభిప్రాయం ఉంది. పదేండ్ల అరాచకాన్ని ధిక్కరించిన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

ఈ ప్రాంతం ఎర్రజెండా పోరాటాలు, ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువై ఖండాంతర ఖ్యాతిని గడించింది. ఇక్కడి గడ్డ మీద పట్టు నిలుపుకొంటే చాలు రాజకీయంగా ఓ మెట్టుపైన ఉండవచ్చని పార్టీలన్నీ భావించిన రోజులు కూడా ఉన్నాయి. బానిసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఈ గడ్డపై బీఆర్ఎస్ వచ్చి ఆనాటి గురుతులను చెరిపేసింది. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లాలో కలిపారు. సరిహద్దులు చెరిగిపోయి అభివృద్ధీ మసకబారింది. గత ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహించిన జిల్లాలో కలిసినా ఆ ప్రతిష్టకు తగ్గట్టుగా అభివృద్ధి చెందలేదు. దొరతనపు పాలనతో ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. బిగుస్తున్న పిడికిళ్లకు బేడీలు వేశారు. మోసాలను ఎత్తిచూపే వేళ్లను విరిచేశారు. లాఠీలతో వెన్ను విరిచి నోళ్లు మూయించారు.

జిల్లాల పునర్విభజన చేసి..

ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. 2014లో పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. జిల్లాల భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పాలనకు ఇబ్బందులున్నాయని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన కమిటీ వేసి జిల్లాల పునర్విభజన చేపట్టింది. కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలకు చేరుకోవాలంటే దాదాపు 200 నుంచి 250 కిలో మీటర్ల వరకూ ప్రయాణించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులు అధిగమించేందుకని చెబుతూ కేసీఆర్ అప్పటివరకు ఉన్న జిల్లాల పునర్విభజన చట్టం, 1974కు మార్పులు చేస్తూ బిల్లు నంబర్14ను తీసుకొచ్చారు. 2016 అక్టోబరులో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఖ్య కేసీఆర్‌కు కలిసి రావడంలేదని మళ్లీ వనపర్తి, ములు గు, జోగులాంబ గద్వాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేసి జిల్లాల సంఖ్యను 33కు పెంచుకున్నారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరడంతో పాటు రెవెన్యూ మండ లాలు 612కు పెరిగాయి. అయితే వీటిని అశాస్త్రీయంగా విభజించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రాజకీయ ప్రయోజనం కోసం..

కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనం కోసం హుస్నాబాద్‌ను మూడుముక్కలు చేసి దెబ్బతీశారు. ఇక్కడ సీపీఐ, కాంగ్రెస్ బలంగా ఉండడంతో వాటిని బలహీనపరిచేందుకు కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపారు. సిద్దిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావాలంటే గిరిజన జనాభా ఉండాలని, హుస్నాబాద్ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని అటు కలుపుకొని లబ్ధిపొందారు. బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఆయనను నాన్ లోకల్ అనకుండా ఉండేందుకు దూరంగా ఉన్న బెజ్జంకిని కూడా సిద్దిపేటలో కలుపుకున్నారు. ఈ ప్రాంతాన్ని కరీంనగర్ లోనే కొనసాగించాలని ఇక్కడి ప్రజలు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. 39 కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా కేంద్రం కరీంనగర్‌కు రవాణా ఈజీగా ఉండేది. 50 కిలోమీటర్లున్న సిద్దిపేట ఎడమచేయిలాగా కావడంతో పాటు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆఫీసులు సంగారెడ్డిలో ఉండడంతో ప్రజలు అంత దూరం వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారు. దీనికి తోడు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉంది. నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉండగా, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాలు హనుమకొండలో ఉన్నాయి. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో కలుపుకున్న బెజ్జంకి మానకొండూరు నియోజకవర్గంలో ఉంది. ఇలా జిల్లాలు, మండలాల వి‌‍భజన అశాస్త్రీయంగా ఉందని, అవసరానికి తగ్గట్టుగా జరగలేదని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా..

ఎన్నికల ముందు వరకు మండలాల వి‌భజన చేసుకుంటూ వెళ్లారు. ఇక్కడ కొత్తగా అక్కన్నపేట, వేలేరు మండలాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ ఆఫీసులను నిర్మించలేదు. అక్కన్నపేటలో వెలమదొరల ఆధిపత్యం ఉండేది. దానిని తిరిగి పొందేందుకే మండలంగా మార్చారు. ధరణిని తీసుకొచ్చి ఇక్కడి పేదల భూములన్నీ దొరల పరం చేశారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో విలీనమైనా అందుకు తగినట్టుగా హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు నినాదంగా మారిన శ్రీరాంసాగర్ వరదకాల్వ (ఇప్పటి గౌరవెల్లి ప్రాజెక్టు) నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం చేశారు. నిర్వాసి తులకు సరైన పరిహారం ఇవ్వకుండా, పోలీసులతో కొట్టించి, వాళ్ల ఇండ్లను కూల్చేసి బలవంతంగా వెళ్లగొట్టారు. కేసీఆర్‌‌తో పాటు ఆయన అల్లుడు, కొడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రాజెక్టులను పూర్తిచేసుకున్నారు. ఇక్కడి ఎల్లమ్మ చెరువును, ఎల్లమ్మగుడిని డెవలప్ చేయలేదు. మరో వేములవాడగా తీర్చిదిద్దేందుకు ఆస్కారమున్న పొట్లపల్లిలోని రాజన్న ఆలయాన్నీ పట్టించుకోలేదు. పేరెన్నిన కొత్తకొండ ఈరన్న గుడిపైనా నిర్లక్ష్యమే చేశారు. పాపికొండలను పోలిన మహాసముద్రంగండి, లోకల్ నయగారాగా చెప్పుకునే రాయికల్ జలపాతాన్నీ పట్టించుకోలేదు. చరిత్రకు ఆనవాలుగా మిగిలిన సర్వాయి పాపన్న కోటనూ అభివృద్ధి చేయలేదు. విద్యా, వైద్యాన్నీ నిర్లక్ష్యం చేశారు. సర్వాయిపేట సమీపంలో దాదాపు 20 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న ఎత్తైన గుట్టలను పట్టించుకోలేదు.

ఏడాది కావస్తున్నా కరీంనగర్‌లో కలుపలే..!

తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హుస్నాబాద్‌ను పూర్వపు కరీంనగర్ జిల్లాలో కలుపుతరా? జిల్లాగా మార్చుతరా? అనే చర్చ మొదలైంది. ఎన్నికలకు ముందు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా హుస్నాబాద్ వచ్చి కేసీఆర్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హుస్నాబాద్ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్‌లో కలుపుతామని ఇక్కడి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలుపుతామన్న హామీపై నోరెత్తకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి రేగుతోంది. ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.

జిల్లా చేయడానికి తగిన వనరులు..

అయితే దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఇదే జరిగితే పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులు మరోసారి మారతాయి. కరీంనగర్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల కూడలిలో ఉన్న హుస్నాబాద్ ఆ జిల్లాలకు దాదాపు సమాన దూరంలో ఉంది. భౌగోళికంగానూ పెద్ద విస్తీర్ణం కలిగి ఉంది. జిల్లా కేంద్రం చేసేందుకు తగిన వనరులూ ఉన్నాయి. సర్ధార్ సర్వాయి పాపన్న పేరుతో గానీ, రేణుకాఎల్లమ్మ పేరుతో గానీ, పీవీ నరసింహారావు పేరుతో గానీ హుస్నాబాద్‌ను జిల్లా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. హుస్నా బాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరుతోపాటు కొత్తగా రామ వరం, ఇందుర్తి లేదా నవాబుపేట, వంగరను మండలాలు చేసి హుస్నాబాద్‌ను జిల్లాగా మార్చాలంటున్నారు. లేకపోతే ఇదే మండలాలతో కరీంనగర్‌లో కలు‌పుతూ హుస్నా బాద్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉంచుతూ, ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా కొందరు ముందుంచుతున్నారు. అయితే ప్రభుత్వం హుస్నా బాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతుందా? జిల్లాగా మార్చుతుందా? అనేది వేచిచూడాలి.

- మేకల ఎల్లయ్య,

జర్నలిస్టు,

99121 78129

Advertisement

Next Story

Most Viewed