డీఎస్సీ పరీక్ష ముందుకెళ్ళేదెలా?

by Ravi |   ( Updated:2024-07-17 01:15:50.0  )
డీఎస్సీ పరీక్ష ముందుకెళ్ళేదెలా?
X

డీఎస్సీ-2024 అప్లై చేసిన అభ్యర్థులు, తాము పరీక్షకు సన్నద్ధం కావడానికి సరిపోయేంత సమయం లేదని అందువల్ల డీ‌ఎస్సీని మూడు నెలల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. అయితే టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో ఉన్నాయి. డీ‌ఎస్సీ పరీక్షకు, గ్రూప్-2 పరీక్షకు మధ్య కేవలం ఒక్క రోజే వ్యవధి ఉంది. కాబట్టి, ఈ రెండు పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో తెలియక నిరుద్యోగ యువత తల్లడిల్లుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి పరీక్ష రాయడానికి కూడా సరిపోయే సమయం ఇస్తే బాగుంటుందని, నిరుద్యోగులు దిక్కుతోచక రోడ్లమీదకు వచ్చి నిరసనలకు దిగుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారణాల్లో ఒకటైన నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే మెగా డీఎస్సీ కూడా వేస్తామని చెప్పింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 వేల పైచిలుకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం వేసిన డీ‌ఎస్సీ-2023ను రద్దుచేసి, వాటికి అదనంగా 6 వేల పోస్టులను కలిపి మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులు నింపడానికి ఫిబ్రవరి 29న డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువరించింది. దీనికి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువే ఇచ్చినప్పటికీ, వచ్చిన వినతులను బట్టి జూన్ 20వ తారీఖు దాకా పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం.

అభ్యర్థుల డిమాండ్ ఏమిటి?

నిజానికి ఈ డీఎస్సీ-2024 ప్రకటన రావడానికి ముందుగా ఎవరైతే టెట్ ఉత్తీర్ణులై ఉన్నారో వారు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానీ చాలా మంది అభ్యర్థులు టెట్ నిర్వహించాలని కోరితే, ప్రభుత్వం మార్చి నెలలో దానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి ఒక లక్షా యాభై వేల మంది వరకు పరీక్ష రాయగా, యాభై వేల మంది అర్హత సాధించారు. వీరందరికీ డీఎస్సీ -2024 అప్లై చేసుకోవడానికి, అలాగే టెట్‌లో అంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ మార్కులు పొందిన వారు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ-2024కు చెందిన అన్ని రకాల ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు నిర్వహించాలని ప్రకటన విడుదల చేసింది. దానికి అనుగుణంగా ఈ నెల పదకొండో తారీఖు నుండి అభ్యర్థుల హాల్ టికెట్లను కూడా వె‌బ్‌సైట్‌లో ఉంచింది. డీఎస్సీ అభ్యర్థులు మాత్రం వారి నిరసనలు కొనసాగిస్తూనే, డీఎస్సీ వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు.

ప్రభుత్వ వాదనలు ఏమిటంటే..

డీ‌ఎస్సీ-2024కు మొత్తం 2,79,956 మంది అప్లై చేశారు. అంటే ఒక ఉద్యోగానికి సుమారుగా 25 మంది పోటీ పడుతున్నారు. ఈ డీఎస్సీ పరీక్ష కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అనగా వారంతా పరీక్ష వచ్చే నెలలోనే అయిపోతుందనుకుంటే, దాదాపు 9 నెలలుగా ఈ పరీక్ష కోసమే, అన్ని పనులు మానేసి భగీరథ ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఒక్కసారి ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం జరిగి, ఫలితాలు వెల్లడిస్తే జాబ్ వచ్చిన వారు ఉద్యోగాల్లో చేరుతారు. మిగిలిన 2,68,894 మంది మళ్లీ వారి జీవనోపాధిని వెతుక్కోక తప్పదు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత ఎన్నో అప్పులు చేసి, ప్రభుత్వ ఉద్యోగంతోనే ఇంటి ముఖం చూడాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వ కొలువు కొట్టనిదే వారు పెళ్లి చేసుకోమని మొండికేస్తున్నారు. ఈ రోజుల్లో ఉన్న పోటీని బట్టి, ఎంత ప్రయత్నించినా, కొన్ని సందర్భాల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేని పరిస్థితుల్లో ఉంటే వారు కుంగిపోవద్దని, మళ్లీ తమ ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అలాగే ఈ ఉద్యోగాల భర్తీ అనేది నిరంతర ప్రక్రియని దానికోసం త్వరలోనే ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేస్తామని కూడా నిరుద్యోగ యువతకు భరోసానిస్తోంది. నిరుద్యోగ యువతలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఇక నుండి సంవత్సరానికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నిరుద్యోగుల అభిప్రాయాలు తీసుకున్నాకే..

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థి నాయకులతో ప్రజాస్వామ్య పద్ధతిలో సంప్రదింపులు జరిపి ఈ సున్నిత సమస్యకు వెంటనే చరమగీతం పాడాలి. తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ-2024ను వాయిదా వేయకపోవడానికి న్యాయ సంబంధ చిక్కులున్నాయా? లేక ఇతరత్రా బలమైన కారణాలేమైనా ఉన్నాయా? అన్నది స్పష్టంగా నిరుద్యోగ యువతకు వెల్లడించాలి. ఇకముందు ఇటువంటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం నిరుద్యోగుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ప్రతీ సంవత్సరం ‘జాబ్ క్యాలెండర్’ ను రూపకల్పన చేయాలి. అలాగే నిరుద్యోగ యువత కూడా ప్రతీ ఉద్యోగ నియామక పరీక్షను వాయిదా వేయమనడం సబబు కాదు. దీని ద్వారా కోచింగ్ సెంటర్లు బాగుపడుతాయే తప్ప, ఉద్యోగం కోసమే సంవత్సరాల తరబడి కష్టపడి చదివే సగటు నిరుద్యోగికి దక్కేది ఏముండదు. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు, ప్రభుత్వ టీచర్లతో సమానమైన జీతాలు, ఉద్యోగ భద్రత, పీ‌ఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించగలిగితే ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత అంతగా అర్రులు చాచారు.

డా. శ్రీరాములు గోసికొండ

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సోషియాలజీ,

నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ,

92484 24384

Advertisement

Next Story