- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదీ సంగతి:చీపురు బలమెంత?
సీఎంను కాకున్నా గవర్నర్‌ను కలిసే అవకాశం జనానికి రావడం కొంత శుభ పరిణామం. ఇలాంటి ఎన్నో విషయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పని సంగతి పక్కన బెడితే పలకరింపునకు నోచుకోని పరిస్థితి ఉంది. ఇవన్నీ ఈ రోజు 'ఆమ్ ఆద్మీ పార్టీ' తెలంగాణలో విస్తరించడానికి మంచి అవకాశాన్ని సూచిస్తున్నాయి. 'ఏ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నామో, ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమించామో, ఆ గౌరవం మర్యాద, సామాన్యులకు, ఉద్యమకారులకు లేదు' అనే చర్చ తెలంగాణ గడప గడపలో జరుగుతున్నది. ఇది టీఆర్ఎస్‌కు చాలా ప్రమాదకర ఘంటిక. లైట్‌గా తీసుకుంటే మొదటికే మోసం.
చీపురు బలమేమిటో సామాన్యుడి నుంచి అతి పెద్ద బంగాళాలు ఉన్న పెద్దలకు కూడా తెలుసు. చీపురు ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అవినీతిని శుభ్రం చేసే, నిజాయితీతో కూడిన పాలన అందించే పనిలో పడింది. ఈ మాటే విస్పష్టంగా చెబుతున్నారు 'ఆమ్ ఆద్మీ పార్టీ' (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 'ఆమ్ ఆద్మీ పార్టీ' ప్రస్తుతం దక్షిణాదిలో విస్తరించేందుకు యత్నిస్తున్నది. తెలంగాణ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల కన్నా ఎక్కువగా తటస్థులు, ప్రజలలో మంచి పేరు ఉన్న వారి దృష్టి అంతా 'ఆప్' వైపే కనిపిస్తున్నది. అయితే, ఎప్పుడు, ఎలా? అనే అంశం మీదే ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినా టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోని చాలా మంది విద్యావంతులు, మేధావులు అంతా ఆప్ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ కి ప్రస్తుతం అననుకూల పరిస్థితులు ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆమ్ ఆద్మీ పార్టీ నమ్ముతున్నాయి. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నామనే జోష్‌తో బీజేపీ నేతలు పని చేస్తున్నారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ఒక్క ప్రజా దర్బార్ పెట్టలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలూ అంతే. సీఎం జనాన్ని కలువడం గగనమే. ఇలాంటి తరుణంలో గవర్నర్ ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారని మీడియాలో వచ్చింది. జనంలో ఫుల్ రెస్పాన్స్ ఉంది. గవర్నర్ ప్రజా దర్బార్ పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ వాటిని తీర్చే సీఎం లేదా మంత్రి ఇంటర్వ్యూలు దొరకక ఆగం అవుతున్న రోజులలో గవర్నర్ ప్రజా దర్బార్‌ను తప్పనిసరిగా స్వాగతించాల్సిందే.
వెలుగు చూస్తున్న నిజాలు
సీఎంను కాకున్నా గవర్నర్‌ను కలిసే అవకాశం జనానికి రావడం కొంత శుభ పరిణామం. ఇలాంటి ఎన్నో విషయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పని సంగతి పక్కన బెడితే పలకరింపునకు నోచుకోని పరిస్థితి ఉంది. ఇవన్నీ ఈ రోజు 'ఆమ్ ఆద్మీ పార్టీ' తెలంగాణలో విస్తరించడానికి మంచి అవకాశాన్ని సూచిస్తున్నాయి. 'ఏ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నామో, ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమించామో, ఆ గౌరవం మర్యాద, సామాన్యులకు, ఉద్యమకారులకు లేదు' అనే చర్చ తెలంగాణ గడప గడపలో జరుగుతున్నది.ఇది టీఆర్ఎస్‌కు చాలా ప్రమాదకర ఘంటిక. లైట్‌గా తీసుకుంటే మొదటికే మోసం.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళన సరే. కానీ, తెలంగాణలోని గల్లీలలో అసంతృప్తి గురించి చూసే ఓపిక లేదా? ప్రజా ప్రతినిధులు ఎలా ఉన్నారు? వెలుగు చూస్తున్న అవినీతి, అక్రమాలు, భూ ఆక్రమణల ఆరోపణలు విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. వరి కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్ కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టింది. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర, రోజూ పెరుగుతున్న పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు, ప్రైవేటీకరణ, నిరుద్యోగం లాంటి విషయాలలో కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే, శివసేన, ఎన్‌సీపీ, ఆప్, టీఆర్ఎస్ తదితర పార్టీలు కేంద్రంలోని బీజేపీని నిలదీస్తున్నాయి.
అంతా ఎన్నికల స్టంట్
ఇందులో చాలా పార్టీలవి ఎన్నికల రాజకీయాలే. రాజకీయ పార్టీల చేతులలో రెండు వైపులా ఒకే బొమ్మ గల కాయిన్సే ఉంటాయి. 'షోలే' సినిమాలో అమితాబ్ బచ్చన్ ఇలాంటి కాయిన్‌తోనే చనిపోయే దాకా ధర్మేందర్ ను తన దిశగా తీసుకెళ్లడానికి వినియోగించుకుంటాడు. ఇపుడు అధికారం శాశ్వతంగా ఉంచుకోడానికి అలాంటి కాయిన్‌నే దగ్గర పెట్టుకుని రాజకీయ పార్టీలు జనంతో ఆటాడుతున్నాయి. 'రోటీ' సినిమాలో రాజేష్ ఖన్నా మీద చిత్రించిన 'యార్ హమారీ బాత్ సునో' అనే కిషోర్‌కుమార్ పాట గుర్తుకు వస్తుంది. అందులో ఒక మహిళ ఏదో తప్పు చేసిందని రాళ్ల తో కొడుతూ ఉంటారు. రాజేష్ ఖన్నా 'పాపం చేయని వారే రాయి విసరాలి' అంటూ అడ్డుకుంటాడు.
ఈ సినిమా తెలుగులోనూ 'నేరం నాది కాదు ఆకలిది' అనే టైటిల్‌తో ఎన్‌టీఆర్ హీరోగా వచ్చింది. ఇతరుల పాపాలను, తప్పులను ఎత్తి చూపే ప్రతీ పొలిటికల్ లీడర్‌కు ఇది వర్తిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' లాంటివి ఏ మేరకు నిల దొక్కుకుంటాయో చూడాలి. ఢిల్లీ సంగతి పక్కనబెడితే, పంజాబ్ దిశను ఆప్ ప్రభుత్వం ఎలా మార్పు చేస్తుందో చూడాలి. గుజరాత్‌లోనూ గట్టిగానే కాలు మోపుతున్నారు. ఆ తరువాత తెలంగాణ అంటున్నారు. చూద్దాం ఏమి జరుగబోతుందో?
విద్వేషాల విస్తరణ
పిడికెడు మంది వ్యక్తులు విద్వేషాలను రెచ్చగొట్టి సమాజంలో విషం నింపుతున్నారు. దేశంలో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిరుద్యోగం కోట్లలో ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. కార్పొరేట్‌లకు ఇచ్చిన భారీ రుణాలను మాఫీ చేసిన బ్యాంకులు దివాలా తీసిన పరిస్థితి ఉంది. విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదు. పేదరికం పెరిగింది. అసమానతలు పెరుగుతున్నాయి. 27 లక్షల కోట్లు పన్నులు వసూలు అయినా దేశం ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. ఇవేవీ అసలు సమస్యలే కానట్టుగా దేశంలో 80-20 విద్వేషాలు రెచ్చగొట్టటానికి నయా మనుషులు బయలుదేరారు. గతంలో ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి దేశం అంతా ఒక్కటయ్యేది. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని బుద్ధిజీవులు నిలదీసి, వెలి వేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
వీరికి పాలకులు అండగా ఉండడమే కాదు, వారు కూడా అదే పాట పాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు వంద కిలోమీటర్‌ల దూరంలో ఉన్న సీతాపూర్ జిల్లాలో ఈ నెల రెండున 'బజరంగ్ ముని' అనే వివాదాస్పద మహంత్ తన వాహనంతో పోలీస్ పహారాలో వచ్చాడు. యువతను తీసుకుని ఒక మతానికి సంబంధించిన ప్రార్థనాలయం పక్కన నిలబడి 'ఆ మతం మహిళలను బయటకు లాగి రేప్ చేయాలి' అంటూ మాట్లాడాడు. వెంట ఉన్న పోలీసులకు అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా మౌనం వహించారు. ఆరు రోజుల తర్వాత ఈ వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేశారు.
దీని మీద రాజకీయ పార్టీ నేతలు ఒక్క మాటా మాట్లాడరు.మహిళలు అంటే అంత చులకన భావనా? ఇంటికి పోతే ఓ అమ్మో, అక్కో, చెల్లో, భార్యో అన్నం పెట్టేది, నీళ్లు ఇచ్చేది మహిళనే కదా? దేశంలో ఏం జరుగుతున్నది? అసలు పాలకులకు సోయి ఉందా? మహిళలు మహిళలే, వారు ఒక కులానికో, మతానికో సంబంధించిన వారు మాత్రమే కాదు. 848 కోట్ల రూపాయలు 'బేటీ బచావో-బేటీ పడావో' యోజనకు కేటాయించారు. సంతులు ఇలా మహిళల గురించి ఏ మాత్రము గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సింధ్ ప్రాంతంలో ఒక ప్రజా ప్రతినిధిని తప్పు పడుతూ వార్త రాసాడని కనిష్క్ తివారీ అనే జర్నలిస్ట్‌ని, కొందరు సామాజిక కార్యకర్తలను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అందరి బట్టలూడదీసి డ్రాయర్ల మీద నిలుచోబెట్టారు. బలియాలో ముగ్గురు పాత్రికేయులను విడుదల చేయాలనీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాస్తవాలను రాసే, నిజాలను చెప్పే జర్నలిస్ట్‌లకు రక్షణ లేని పరిస్థితి ఉంది. రాజ్యం తప్పులను ప్రశ్నించేవారు దేశ ద్రోహులు అవుతున్నారు.
మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223