వీఆర్‌ఏల నిరీక్షణ ఇంకెన్నాళ్లు?

by Ravi |   ( Updated:2024-12-13 01:01:00.0  )
వీఆర్‌ఏల నిరీక్షణ ఇంకెన్నాళ్లు?
X

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని 2024 ఫిబ్రవరి 10న నియమించింది. కానీ గత 10 నెలలుగా ఆ కమిటీ కూర్చున్నదీ లేదు. వీఆర్‌ఏల సమస్యలను అధ్యయనం చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది లేదు. దీనిపై పలుమార్లు వీఆర్ఏల సంఘాలు కమిటీని కలిసి విన్నవించినా చేద్దాం, చూద్దాం అని కాలయాపనే తప్ప సమస్య మాత్రం గత 10 నెలలుగా కమిటీ పరిష్కారం చేసింది ఏమీ లేదు. కమిటీ నియమించింది. కాలయాపన కోసమా! సమస్య పరిష్కారం కోసమా! ఇంకా ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ?

2023 జూలై 24న జీవో నెం.81, ఆగస్టు 3న జీవో నెం.85లను నాటి ప్రభుత్వం విడు దల చేసింది. ఆ జీవోలను అనుసరించి 20,555 మంది వీఆర్ఏల్లో 61 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన 16,758 మంది వీఆర్ఏలకు ప్రమోషన్‌ఇచ్చి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌తో పాటు మున్సిపల్‌, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, విద్యా, వైద్యం, వ్యవసాయం, సాంఘిక సంక్షేమ తదితర శాఖల్లో సర్దుబాటు చేశారు.

కారుణ్య నియామకాల ఆనవాయితీ ఉన్నా..

ఆ జీవోలో మిగిలిన 61 సం.ల వయస్సు పైబడిన 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఇంతలో ప్రభు త్వం మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఏడాదిగా ఎదురు చూస్తున్న వీఆర్‌ఏలకు నిరాశే మిగిలింది. గత ప్రభుత్వం సుమారు 200 మంది వీఆర్ఏలకు శాఖలు కేటాయించి ఆ శాఖలో ఖాళీ లు లేక పది నెలలుగా పోస్టులు చూపించకుండా, జీతం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశారు. చర్చల్లో 2014 జూన్‌ రెండు తర్వాత సమ్మె జీవో వచ్చేనాటికి (జూలై వరకు) చనిపోయిన వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది కానీ నేటి వరకు వారి ఊసే లేదు. కొంతమంది వీఆర్‌ఏలు జీవో వచ్చిన రెండు, మూడు నెలలకు రిటైర్మెంట్‌ అయిన వారు ఉన్నారు. గతంలో చనిపోయిన, రిటై ర్మెంట్‌ అయిన వీఆర్ఏల వారసులకు ఉద్యో గం ఇచ్చే ఆనవాయితీ వీఆర్ఏ వ్యవస్థలో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. రెవిన్యూ నుండి ఇతర డిపార్ట్‌మెంట్‌లు మార్చి పీహెచ్‌సీ వర్కర్లుగా, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ వర్కర్లుగా పారిశుద్ధ్య పనులు చేయాలని ఆ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఒత్తిడిలు పెడుతున్నారు. మరోపక్క జీతాలు సకాలంలో రాక, కుటుంబాలు గడవక వీఆర్ఏలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇచ్చిన జీవో ప్రకారం కొందరికి ఉద్యోగాలు ఇచ్చి మరికొందరికి ఇవ్వకుండా గత 16 నెలలు గడిచాయి.

వారసుల బాధలు వర్ణనాతీతం!

61 సంవత్సరాలు వయసు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చర్చల్లో ప్రభుత్వం అంగీకరించడం, జీవోలో పొందుపరచటం మూలంగా తెలంగాణ ప్రాంతంలో వీఆర్ఏల వాటాబంధి సమస్య పరిష్కారం కోసం. తండ్రుల స్థానంలో తమ కుమారులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు గ్యారెంటీగా వస్తాయని, తమ కున్న అర ఎకరం, ఎకరం భూమిని వాటా కింద అన్నదమ్ములకు ఇవ్వడం, భూమి లేకపోతే డబ్బులు అప్పు చేసి ఇవ్వటం, అగ్రిమెంట్‌ కాగితాలు రాసుకోవడం జరిగింది. ఉద్యోగం తప్పకుండా వస్తుంది. కనుక తల్లిదండ్రులను కూడా ఉద్యోగం తీసుకునే వారే చూడాలని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 16 నెలలు అవుతున్నా ఉద్యోగం రాక, చేసిన అప్పులు తీరక ఉన్న ఎకరం, అరెకరం భూమి కూడా కోల్పోయి చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మానసికంగా ఒత్తిడికి లోనై 30 మంది వీఆర్‌ఏ వారసులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కాలంలో 260 మంది వీఆర్‌ఏలు మరణించారు. కొందరికి బీపీ, షుగర్‌, పక్షవాతం వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడి మంచం పడుతున్నారు.

ఇచ్చిన జీవోను అమలు చేస్తే చాలు..

వీఆర్ఏలను ఇతర డిపార్ట్‌మెంట్‌లతో పోల్చొద్దు. వీఆర్ఏలు తరతరాలుగా తాతల నుండి, తండ్రులు వారి నుండి పిల్లలు వారసులుగా ఈ వ్యవస్థలో కొనసాగుతున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు, గ్రామాలకు సేవలు చేశారు. ప్రభుత్వం భూములను, చెరువులను, చెట్లను, మనుషులను రక్షించారు. జీతమే లేకుండా కొన్నాళ్లు ఈ వ్యవస్థకు వెట్టి చాకిరీ చేశారు. రైతులు, గ్రామ పెద్దలు ఇచ్చిన దాన ధర్మాల మీద వారి కుటుం బాలు జీవిస్తున్నాయి. వీఆర్‌ఏల సమస్యను ప్రత్యేకంగా చూడాలి. వీరంతా వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన అట్టడుగు ప్రజలు. అతి తక్కువ వేతనంతో చాలీచాలని జీవితాలు గడిపారు. కాబట్టి వారి వారసులకు ఉద్యోగం కారుణ్య నియామకం క్రింద ఇవ్వడం న్యాయమని గత ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. ఆ జీవోను అమలు చేయడమే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని. దీనికి 16 నెలల కాలయాపన ప్రజా ప్రభుత్వానికి తగునా!

ఆర్‌ఓఆర్‌ చట్టంలో వీఆర్ఏలు..

ప్రభుత్వం నూతన ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని త్వర లో తీసుకురావాలని ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. గత పాలకులు తెచ్చిన ధరణి పోర్టల్‌లో అనేక తప్పిదాలు జరిగాయని, వాటిని సరిచేయటానికి, రైతులకు మేలు చేయటానికి కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. ఉద్యోగులతో, రైతులతోనూ, రాజకీయ పార్టీలతో చర్చలు చేస్తున్నది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త చట్టాలు తీసుకురావడం మామూలు అయింది. కొత్త చట్టంతో పాటు కొత్తగా రెవిన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి జూనియర్‌ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ) వ్యవస్థను తీసుకురావాలని, వారి తో పాటు గ్రామానికి ఒక వీఆర్ఏను పెట్టా లని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్న అనుభవం ఉన్న, అర్హత ఉన్న 61 సంవత్సరాలు పైబడి ఆరోగ్యం సహకరించని వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇవ్వడం వలన కొత్త యువ రక్తం రెవెన్యూ వ్యవస్థలోకి వస్తారు. రెవెన్యూ వ్యవస్థ బలపడుతుంది. పేద వీఆర్ఏ కుటుంబాలకు కూడా న్యాయం చేసినవారవుతారు. అలాగే పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి.

వంగూరు రాములు,

వీఆర్‌ఏ జేఏసీ కన్వీనర్‌

94900 98247

Advertisement

Next Story

Most Viewed