హాలీవుడ్ సమ్మెకు వంద రోజులు..

by Ravi |   ( Updated:2023-08-19 00:01:04.0  )
హాలీవుడ్ సమ్మెకు వంద రోజులు..
X

ప్రపంచంలోనే గొప్ప, భారీ ఇంగ్లీష్ సినిమాలు నిర్మించే హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు రచయితల, నటీనటుల సమ్మెతో తాళం పడింది. మే నెలలో మొదలైన రచయితల సమ్మెకు జులై నుండి సై అంటూ తారాగణం కూడా జత కూడగా ఉధృతమైన సమ్మె ఆగస్టు పది నాటికి వంద రోజులు పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది. అప్పుడెప్పుడో జరిగిన సమ్మె వంద మార్క్‌తో ఆగిపోతే ఈ ఆందోళన మాత్రం ఆ రికార్డును దాటి వేసింది. 1960 తర్వాత హాలీవుడ్‌లో జరిగిన సుదీర్ఘ సమ్మె ఇదేనట.

పెరుగుతున్న టెక్నాలజీకి వ్యతిరేకంగా..

రోజు రోజుకు సినిమాల్లో పెరిగిపోతున్న టెక్నాలజీ వాడకం చిలికి చిలికి ఇలా సమ్మెకు దారితీసింది.టెక్నాలజీ విస్తరణ తమ అస్తిత్వానికే ప్రమాదంగా మారబోతోందని గ్రహించిన హాలీవుడ్ లోని స్క్రిప్ట్ రచయితలు, నటీనటులు తమ హక్కులను, ఆదాయాన్ని కాపాడుకునేందుకు మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ మండలితో కొన్ని ఒప్పందాలు చేసుకోవాలని ప్రయత్నించారు. ఆ చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమై ఇప్పటికి కొనసాగుతోంది.

కొత్తగా వచ్చిన చాట్ జిపిటి వాడకాన్ని పరిమితం చేయాలని, చిత్రంపై రచనా హక్కులు తమకే ఉండాలని స్క్రిప్ట్ రచయితలు హాలీవుడ్ నిర్మాతలను కోరారు. అవసరమైతే కృతిమ మేధస్సు వాడకంతో మేమే సినిమాకు అవసరమైన కథ, స్క్రీన్ ప్లే , మాటలు సిద్ధం చేసి ఇస్తామని సినిమా టైటిల్స్‌లో రచయితగా పేరు ఉండాలని, ఆ క్రెడిట్ తమకే దక్కాలని, టెక్నాలజీ సాయంతో చేసిన పనికి రచయితకు కాపీ రైట్ ఉండే అవకాశం ఉండదని మోషన్ పిక్చర్స్ వారిని, టెలివిజన్ ప్రొడ్యూసర్స్‌ను కోరుకున్నారు. ఇక ముందు సినిమా టైటిల్స్‌లో రాసినవారు అని కాకుండా కథ ఇచ్చినది, పాత్రలను సృష్టించింది అని సంస్థల పేర్లు చేర్చవలసివస్తుందని, వీటికి చట్టపర నిర్ణయాలు కూడా కావాలని కొత్త వాదన వినిపిస్తోంది. ఈ సమ్మెకు పిలుపునిచ్చిన గిల్డ్ లో 11,500 మంది రచయితలు సభ్యులుగా ఉన్నారు.

పెట్టుబడిని తగ్గించుకోవడానికి…

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రమేయంతో చిత్రసీమలో నటీనటుల నటనకు కూడా ప్రాధాన్యత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని సన్నివేశాల్లో వారి ఆకారాలను, రూపాలను అవసరార్థం టెక్నాలజీ సాయంతో మార్చుతూ మిగతా సన్నివేశాలు చిత్రీకరించి సినిమాలను పూర్తి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. గుంపులో నటించే ఎక్స్‌ట్రా నటులకు ఒక రోజు వేతనమిచ్చి ఆ దృశ్యాలను సినిమా అంతా వాడుకుంటూ నిర్మాతలు పెట్టుబడిని తగ్గించుకుంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తమ అనుమతి లేకుండానే తమ రూపాలను, గొంతులను సృష్టించి పాత్రల నిడివి పెంచుకోవడంపై హాలీవుడ్ నటీనటుల నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. ఒకసారి క్లౌన్ రూపానికి తాము అనుమతి ఇచ్చాక దానిని విచ్చలవిడిగా వాడి కళాకారులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

జులై 13న సమ్మెకు దిగిన యాక్టర్స్ గిల్డ్ లో 65,000 నటీనటులు ఉన్నారు. దీనితో హాలీవుడ్‌లో కొన్ని క్రాఫ్టులు తప్ప నిర్మాణంలో ప్రధాన పాత్ర నిర్వహించే వర్గాలు సమ్మెలో ఉన్నట్లయింది. ఈ జంట సమ్మెల వల్ల హాలీవుడ్‌లో ఎన్నో భారీ చిత్రాల నిర్మాణం పనులు స్తంభించాయి. జులై 17న లాస్ ఏంజెల్స్‌లో వందలాది హాలీవుడ్ నటులు తమ డిమాండ్ల ప్లకార్డులతో రోడ్డెక్కారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, బోస్టన్, షికాగో నగరాలతో పాటు లండన్ లోనూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. సంఘాల మధ్య జూమ్ చర్చలో ప్రముఖ హాలివుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రత్యక్షమై సమ్మెకు మద్దతుగా మాట్లాడడంతో నటీనటుల్లో ఉత్సాహం, పట్టుదల మరింత పెరిగాయి.

టెక్నాలజీ నియంత్రించాలి

దేశదేశాల్లో అవుట్ డోర్ షూటింగులు, భారీ సెట్టింగులు, తారాగణానికి మిలియన్ డాలర్ల పేమెంట్లు తప్పించుకునేందుకు హాలీవుడ్ చిత్ర నిర్మాణ రంగం టెక్నాలజీని విరివిగా వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. రాను రాను చిత్ర నిర్మాణమంతా విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల చేతిలోకి వెళితే నిర్మాత గడప దాటే అవసరం కూడా ఉండదు. డిజిటల్ కంటెంట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రచయితల, నటీనటులు ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయే అవకాశముంది. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని సంఘాలు పట్టుదలతో ఉన్నాయి. టెక్నాలజీ వాడకం పెరగడాన్ని ఆపలేకున్నా దాని నియంత్రణకై తగిన చట్టాలు రూపకల్పన, హక్కుల పరిరక్షణ జరగాలని ప్రధాన డిమాండ్‌గా కనబడుతోంది. కృత్రిమ మేధస్సు వాడకం వల్ల సృజనకారుల అస్థిత్వానికి భంగం కలుగకుండా చిత్ర నిర్మాణాలు కొత్త ఒప్పందాలతో కొనసాగాలని గిల్డ్ నేతలు కోరుతున్నారు. మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కలిసి సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం తేవలసి ఉంది. అయితే చిత్ర పరిశ్రమపై బతికే యాక్టర్లు, రైటర్లు నిర్మాతలను ఎదిరించి ఏం సాధిస్తారో కాలమే చెబుతుంది. ఇలా అన్ని రంగాలపై పంజా విసురుతున్న సాంకేతిక భూతం ఇంకెన్ని సహజ కళలను మింగేస్తుందో.. కళాకారులను ఏ గతికి తెస్తుందో అన్న బెంగ ప్రపంచాన్ని ఆవరిస్తోంది.

బి.నర్సన్

94401 28169

Advertisement

Next Story

Most Viewed