నేతన్నలకు కరువైన రాజకీయ బలం

by Ravi |   ( Updated:2023-03-03 18:45:53.0  )
నేతన్నలకు కరువైన రాజకీయ బలం
X

తొలితరంలో పద్మశాలి సామాజిక వర్గం నుండి చెప్పుకోదగ్గ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన తర్వాత, ఆలె నరేంద్ర, దేవరకొండ విఠల్ రావు, పులి వీరన్న, రాపోలు ఆనంద భాస్కర్, చింత ప్రభాకర్, రమణ, సుధారాణి మొదలైన వారు ఎం‌పీ,ఎం‌ఎల్‌ఏ‌గా ఎన్నికై మంత్రులుగా ఉన్నప్పుడు నేతన్నల సంక్షేమం కోసం పాటుపడ్డారు. కానీ ఇప్పుడు ఈ సామాజిక వర్గం నుండి రమణ ఒక్కరే ఎం‌ఎల్‌సిగా ఉన్నారు.

వృత్తి వీడుతున్న నేతన్నలు

ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు, వారి కులవృత్తి అయిన చేనేతలో కొంతమంది, అలాగే టెక్నాలజీ జోడించిన అనంతరం వచ్చిన పవర్‌లూమ్‌లపై మరికొంత మంది పనిచేస్తున్నారు, కానీ, చాలా మంది పద్మశాలి కులస్తులు, వారి కులవృత్తి అంతగా లాభదాయకంగా లేదని ఇతర వృత్తులను ఎంచుకుంటున్నారు. కొంతమంది ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగస్తులుగా వారి వృత్తులను మార్చుకొని జీవితంలో నిలదొక్కుకుంటున్నారు. అయితే, ఆధునిక విద్య, నూతన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ మొదలైనవాటి ప్రభావాల వల్ల ఇలా కుల వృత్తులు వదులుకొని, కొత్త వృత్తులు ఎంచుకోవడం (వృత్తి చలనశీలత) దేశమంతటా అన్నికులాల్లో కానవస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని కులాలన్నింటిలో, మరీ ముఖ్యంగా బీసీ కులాల్లోకెల్లా ఈ పద్మశాలి కులస్థుల్లో ఇటువంటి ట్రెండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఆ సామాజిక వర్గాల వైపే పార్టీలు

పద్మశాలి కుల సంఘాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 5% జనాభా పద్మశాలీలే. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షా పది వేల మంది నేత కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు లక్షకుపైగా కార్మికులు పద్మశాలి కులానికి చెందినవారే ఉండటం గమనార్హం. వీరు మాత్రమే కాకుండా ఇతర వృత్తులు చేస్తున్న పద్మశాలి కులస్తులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు.

మొత్తం మీద రాష్ట్రంలో వీరి జనాభా ఎక్కువగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా బలంగా ఉన్న సామాజిక వర్గాల అభివృద్ధికే పాటుపడుతాయి. కానీ తరతరాలుగా చేనేత వృత్తి పై ఆధారపడ్డ సామాజిక వర్గాలను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాటికి ఓట్లు కావాలి. ఏ వర్గాన్ని మచ్చిక చేసుకుంటే అధికంగా ఓట్లు పడుతాయో వాటికి బాగా తెలుసు. మరోవైపు నానాటికీ నేతన్నల సంఖ్య బాగా తగ్గుతుందంటే ఒక్క నేతన్నల ఓట్లతో ఎం‌ఎల్‌ఏ గాని, ఎం‌పీ గాని గెలిచే పరిస్థితి లేదన్నమాట.

రాష్ట్రం ప్రభుత్వం కులవృత్తులు చేసేవారికి నిధులు ఎక్కువగానే కేటాయిస్తుంది. ఒక్క చేనేత కార్మికులకు తప్ప. చేపపిల్లల పంపిణీ, చేపలు విక్రయించేందుకు మినీ ట్రక్ లాంటి వాహనాలు, గొర్రెల పంపిణీ, తాటిచెట్ల పైనున్న పన్నుల రద్దు, నీరా వంటి పానీయాలకు స్టాళ్ల ఏర్పాటు, మాడ్రన్ సెలూన్ల ఏర్పాటు, ఇస్త్రీ షాపులకు కరెంట్ మినహాయింపు, భూమి ఉన్న ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం అందించడం, తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ వివిధ సాంప్రదాయ కులవృత్తులను కాపాడేందుకు తీసుకున్న చర్యలే. మరోవైపు, సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఇతర లాభసాటి వృత్తులు చేపట్టి ఆర్థికంగా ఎదిగేందుకు వారికి పది లక్షల రూపాయలు అందిస్తుంది. ఇలా, వివిధ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎం‌ఎల్‌ఏలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండటం వల్ల, వారు ఆయా వర్గాల సమున్నతికై పాటుపడుతున్నారు. కానీ పద్మశాలి వర్గానికి చెందిన వారు ఎవరూ ఎన్నిక కాకపోవడం వల్ల, నేతన్నల బాగుకోసం శ్రద్ధ తీసుకునే రాజకీయ నాయకులు కరువయ్యారు.

నేతన్నల్లో కొరవడిన ఐకమత్యం

మగ్గం నేసే సొసైటీ సభ్యుల మధ్య మాత్రమే ఐకమత్యం కనిపిస్తుంది. కానీ, పద్మశాలీల కుల సంఘాలు ఎన్నడో బలహీనపడి కనుమరుగయ్యాయి. ఎక్కడన్నా ఉన్నా అవి పేరుకు మాత్రమే ఉన్నాయి. పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) వంటి సంఘాలు ఇతర వృత్తులు చేస్తున్న పద్మశాలీలకు సంబంధించినది. పద్మశాలిల్లో కుల సంఘాలు లేకపోవడం అనే ఒరవడి ఆధునిక ప్రగతికి సంకేతం కానీ, రాజకీయ అభివృద్ధికి గొడ్డలిపెట్టు. ప్రస్తుతం దేశంలో కులాన్ని రాజకీయాల నుండి వేరుచేసి చూడలేని పరిస్థితి నెలకొంది. అలాగే, ఏదైనా కులం సాధికారత, రాజకీయాల్లో వారి సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుంది. అంటే, కులసంఘాలు బలహీనపడితే వారి అభివృద్ధికి అవరోధమే అవుతుంది. పద్మశాలి ఓటర్లు, సుమారు 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎం‌ఎల్‌ఏ అభ్యర్థి యొక్క గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఆయాచోట్ల ఈ కులంలో కొంతమంది విద్యావంతులకు సామాజిక సేవా నిరతి, రాజకీయ అనుభవంతో పాటు ఆర్థిక బలం ఉన్నప్పటికీ వారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు పద్మశాలి కులస్తులను, నేత కార్మికులను వేర్వేరుగా చూస్తున్నాయి. అంటే అల్ప సంఖ్యలో ఉన్న నేత కార్మికులకు మేలు చేసినా కూడా అధిక సంఖ్యలో ఉన్న పద్మశాలిల ఓట్లు పడవనే తప్పుడు భావనలో వాటి అగ్రనాయకులున్నారు. పద్మశాలి కులస్తులు వేర్వేరు వృత్తుల్లో స్థిర పడటం వల్ల వారందరూ ‘ఒకే కట్టు’ మీద ఉండటం సాధ్యపడటం లేదు. కానీ ఇతర కులాలన్నీ కూడా ఒకే మాట మీద నిలబడి వారికి రాజకీయంగా ఏం కావాలో అవి సాధించుకుంటాయి.

నేతన్నలు అధికంగా ఉన్న సెగ్మెంట్లు

రాష్ట్రంలోని సిరిసిల్ల, పరకాల, బాల్కొండ, భువనగిరి, జగిత్యాల, సిద్దిపేట, వేములవాడ, వరంగల్ (తూర్పు), మునుగోడు, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఆలేరు, గద్వాల, హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లల్లో పద్మశాలి ఓటర్లు అధికంగా ఉన్నారు. అందువల్ల పద్మశాలి కులానికి చెందిన వారందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ స్థానాల్లో పద్మశాలి అభ్యర్థులకే టికెట్లు ఇచ్చేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచాలి. ఈ మధ్యనే జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో సుమారు 10% ఓటర్లు పద్మశాలి వర్గానికి చెందినవారున్నప్పటికీ, ఏ ఒక్క పార్టీ కూడా ఆ వర్గానికి చెందిన అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వనేలేదు. అంటే కనీసం పద్మశాలిలు అధిక సంఖ్యలో ఉన్న సెగ్మెంట్లో కూడా, వారు రాజకీయంగా అభివృద్ధి చెందడం ఏ రాజకీయ పార్టీకి ఇష్టం లేనట్లుంది. రాబోయే రోజుల్లో పద్మశాలి కులానికి చెందిన శ్రీమంతులు, వస్త్ర వ్యాపారులు, ఇతర వ్యాపారస్తులు, పోపా సభ్యులు, ఇతర రంగాల్లో స్థిరపడ్డవారందరూ కలిసి కనీసం అరడజను ఎం‌ఎల్‌ఏలను గెలిపించి, అసెంబ్లీకి పంపిస్తేనే నేతన్నకు ‘అండాదండా’ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎన్నుకోబడ్డ పద్మశాలి నేతలు చేనేత రంగ సమస్యలపై, నేతన్నల సాధక బాధకాలపై అసెంబ్లీ వేదికగా గళం విప్పగలుగుతారు. తద్వారా తరతరాల వారసత్వ సంపద అయిన చేనేతను, ఆ రంగంపై ఆధారపడ్డ నేతన్నలను బ్రతికించవచ్చు.

డా. శ్రీరాములు గోసికొండ

అసిస్టెంట్ ప్రొఫెసర్

9248424384

Advertisement

Next Story