- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనుమరుగవుతున్న వృత్తి
ఆధునిక జీవనశైలికి అర్రులుచాస్తూ, చదువు లేకపోయినా, సరైన ఉద్యోగం లేకపోయినా యువత కూలిపని చేస్తూ అయినా హైదరాబాద్ వంటి నగరాల్లో నివసించడానికి మొగ్గు చూపుతున్నారు. అంతే కానీ సొంత ఊరిలో ఇంటిపట్టున ఉంటూ కులవృత్తిని చేస్తూ జీవనం గడపడానికి నేటి యువత విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలో కులవృత్తులు కనుమరుగవుతున్నాయి.
ఈ కులవృత్తులలో ముఖ్యమైనది, సమాజానికి నాగరికత నేర్పినది చేనేత వృత్తి. అలాంటి చేనేత వృత్తి నేడు రాష్ట్రంలో పూర్తిగా క్షీణ దశకు చేరుకోవడానికి కారణం చేనేత పరిశ్రమ పూర్తిగా వ్యాపారులకు అనుకూలంగా ఉండటం. ఈ నేతవృత్తిలో రెండు రకాలున్నాయి అందులో మొదటిది చేనేత మగ్గం, రెండవది మరమగ్గం.
చేనేత మగ్గంతో.. శ్రమ దోపిడీ
చేనేతమగ్గం, విశాలమైన వరండాలో చెక్కతో చేసిన మగ్గం ముందు గుంటలో వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతని ఎదురుగా మగ్గం ఫ్రేముపై నిలువుదారాలు పేర్చి వరండా ఆ చివర కట్టబడి ఉంటాయి. ఫ్రేములో అడ్డుదారం కోసం దారపు కండెలు అటూ ఇటూ పంపుతూ దారాలు సరిచేసుకుంటూ ఆ వ్యక్తి మగ్గం నేస్తుంటాడు. అతడికి రోజు పొడవునా కావలసిన దారపు కండేలను భార్య తయారుచేసి ఇస్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ రోజుకు 8 గంటలు కష్టపడితే చీర నేసినందుకుగానూ ఇంత కూలి అని ఇస్తున్నారు తప్పితే ఆ ఆడమనిషి చేసే పనికి వెల కట్టడం లేదు. ఇది మహిళల శ్రమను దోచుకున్నట్టే. బహుశా ఈ తరహా శ్రమదోపిడి ప్రపంచంలో మరే వృత్తిలోనూ కనిపించదేమో.
ఒక మగ్గం ఉన్న వ్యక్తి వ్యాపారస్తుని దగ్గర ముడి సరుకు తెచ్చుకొని మగ్గం నేస్తే, భార్యాభర్తలిద్దరూ పనిచేసి ఒక వ్యక్తి కూలీని మాత్రమే పొందుతున్నారు. అదే నాలుగు మగ్గాలు సొంతంగా ఉన్నవాళ్ళు ముడిదారం మాత్రమే తెచ్చుకొని దారాలకు రంగులద్దడం, డిజైన్లను తయారుచేయడం, కండెలు పట్టడం వంటి అన్ని పనులు ఇంటిల్లిపాదీ (కనీసం నలుగురు) చేసి మగ్గం నేస్తున్నారు. ఇందులో కూడా మహిళల శ్రమదోపిడే కనిపిస్తుంది. వారికి ప్రత్యేక వేతనం అంటూ ఏమీ ఉండదు. ఇలా ఒకరి కూలీకి ఇద్దరూ లేదా ముగ్గురు పని చేస్తూ చాలీచాలని డబ్బులతో ఆర్థిక లేమితో బతుకు వెళ్లదీస్తున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి వాటికి ఆర్థిక భారం మోయలేక అప్పులు చేసి, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాలుపడుతున్నారు.
వ్యాపారులకే లాభకరం
మరమగ్గం, ఇవి నడిపే నేత కార్మికుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ కూడా మహిళల శ్రమ దోపిడీ జరుగుతుంది. ఒక వ్యక్తి నాలుగు మరమగ్గాలు కూలీకి నడుపుతుంటే, తప్పనిసరిగా అతని భార్య సహకారం అవసరం అవుతుంది. కరెంటు సరిగా ఉండక, ఎప్పుడు కరెంటు ఉంటే అప్పుడే రాత్రి పగలు తేడా లేకుండా మరమగ్గం నడుపుతూ, నిద్రకు దూరమవుతూ, తాగుడుకు దగ్గరవుతూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు.
ఈ చేనేత, మరమగ్గాల వారికి ప్రభుత్వ పరంగా రుణాలు అందుతున్నాయి, ఆ తర్వాతి కాలంలో రుణమాఫీలు కూడా జరుగుతున్నాయి కానీ అవన్నీ వ్యాపారస్తుల వరకే పరిమితమవుతున్నాయి. కానీ మగ్గం నేసే సాధారణ కార్మికుడి దగ్గరకు చేరలేకపోతున్నాయి. ఇది ఎలా ఉందంటే మూల వ్యవస్థ (వేరు) చెదలు పట్టి నాశనమవుతుంటే పూలు, కాయలకు పురుగు పట్టకుండా మందు పిచికారీ చేస్తున్నట్లు ఉంది. మన ప్రభుత్వ పరిస్థితి.
ఏం చేయాలి?
ప్రభుత్వం చేనేత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 2 గ్రామాలకు ఒకటి ఏర్పాటు చేయాలి. 2 గ్రామాల మధ్య ఒక 5 ఎకరాల స్థలంలో రెండు, మూడు షెడ్లు వేసి మగ్గాలు ఏర్పాటుచేసి, కార్మికులకు నెలసరి వేతనం ఇస్తూ, వీటి నిర్వహణ బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పగించాలి. మూడు పూటలా తిండి సరిగా లేని ఈ పరిస్థితులలోనే అద్భుతమైన డిజైన్లను సృష్టించి, పోచంపల్లి వస్త్రాల ఖ్యాతిని దేశ, విదేశాల్లో వ్యాపింపజేసిన నేత కార్మికుడు... ప్రభుత్వం కూడు, గూడు ఏర్పాటుచేసి నెలసరి వేతనం ఇస్తూ, ఆందోళన లేని జీవితాన్ని గడపగలిగేలా చేస్తే, మన పోచంపల్లి వస్త్రాల ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపచేస్తాడు. చేనేత ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గ్రామాల మధ్య షెడ్లను వేసి, అక్కడే రంగులద్దడం, దారాలు పోయడం, కండెలు పట్టడం, డిజైన్లు తయారు చేయడం వంటి అన్ని విభాగాలను ఒకే చోట చేర్చి ప్రతి వ్యక్తికి సరైన వేతనం కల్పించగలిగితే మహిళల శ్రమ దోపిడీ ఆగుతుంది, కార్మికుల ఆత్మహత్యలు తగ్గుతాయి. నెలలో 20 రోజులు విదేశీయులు, విద్యార్థులు మన పోచంపల్లిని మాత్రమే సందర్శిస్తున్నారు. కానీ మిగతా చేనేత గ్రామాలను కూడా పై విధంగా అభివృద్ధి చేస్తే పోచంపల్లిలా అవి కూడా పర్యాటక ప్రాంతాలుగా భాసిల్లుతాయి. ఉరూరా చేనేత పార్క్‌లను ఏర్పాటు చేసి ఆ షెడ్లలో అన్ని విభాగాలలో ట్రైనింగ్లు కూడా ఇస్తూ, నేత కులస్తులకు సగం ప్రాతినిధ్యం కల్పిస్తూ, మిగతా కులాలవారికి మిగిలిన సగం సీట్లను కేటాయిస్తూ వారిలోని సృజనాత్మకతను కూడా పెట్టుబడిగా పెట్టి చేనేతలో ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు. అది నిజంగా గాంధీజీ కళలు కన్న “గ్రామ స్వరాజ్యం”ను మనం సాధించినట్లే. మన తెలంగాణా రాష్ట్రంలో అయినా ప్రభుత్వం విద్య, వ్యవసాయం తర్వాత చేనేతకు ప్రాముఖ్యతను కల్పించాలని ఆశిస్తున్నాను.
డాక్టర్ ఎ. కల్యాణి
98660 67943