మానవతా దినోత్సవంగా గురజాడ జయంతి

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-24 15:04:52.0  )
మానవతా దినోత్సవంగా గురజాడ జయంతి
X

మహాకవి గురజాడ అప్పారావు జయంతిని జాతీయ “మానవతా దినోత్సవం”గా జరుపుకోవాలని గురజాడ ఫౌండేషన్ (అమెరికా & భారత్ ) పిలుపునిచ్చింది. గురజాడ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురజాడ రవీంద్రుడు, గురజాడ అరుణ, గురజాడ అప్పారావు 162 వ జయంతి ని పురస్కరించుకొని “మానవతా దినోత్సవం” పేరుతో ఆచార్య కొవ్వలి గోపాల కృష్ణ అధ్యక్షతన అంతర్జాల సమావేశాన్ని నిర్వహించారు. విశిష్ట అతిథిగా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం; ఆత్మీయ అతిథిగా ఆచార్య ఐనవోలు ఉషాదేవి గారు విశ్రాంతాచార్యులు, తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్; ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు, ఆచార్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం హాజరై సార్వకాలినమైన, సార్వజనీనమైన గురజాడ సాహితీ సేవను కొనియాడుతూ ప్రసంగించారు. మహోన్నత మానవతావాది గురజాడపై “మానవతా దినోత్సవం” సందర్భంగా ప్రత్యేకంగా రాసిన శ్రీ శివాజీ తుంబలి గారి గీతం సభలో ఆవిష్కరించబడింది.

మానవతా దినోత్సవం

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ఆచార్య కొవ్వలి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ "నూట అరవై రెండు సంవత్సరాల క్రితం జన్మించిన గురజాడ మరణించి 109 సంవత్సరాలు అవుతోంది. తెలుగు వారు ఇంకా ఆయనని గుర్తుచేసుకుని ఆయన రాసిన కవితలు, కథలు, ముఖ్యంగా నాటక రాజమైన కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ, మళ్ళీ చదువుతూ, వింటూ పులకిస్తున్నారంటే ఆయన చేసిన రచనలు ప్రతీ కాలంలోని పాఠకుల హృదయాలని, మస్తిష్కాలని స్పృశించే శక్తి గలవి అయి ఉండాలి. ఆయన మాటలు సామాన్యులకి వారి గురించి, వారి సమస్యల గురించి చెబుతున్నట్లుగానూ, మాన్యులకి స్ఫూర్తిదాయకంగానూ, ఉత్తేజభరితంగానూ ఉండి ఉండాలి. ఆయన యశస్సు అజరామరమైనది. ఆయన జీవించినది కేవలం 53 సంవత్సరాలు. రాసినది వాసిలో అంత ఎక్కువ కాదు. కానీ, ఆయన సృష్టించిన పాత్రలు తరతరాల సాహితీ ప్రియులని ఉత్తేజపరుస్తూ చదువరుల గుండెల్లో సజీవంగా నిలిచి ఉంటాయి. గురజాడ కమ్మునిస్టులకి కార్ల్ మార్క్స్ గానూ, అభ్యుదయ వాదులకి, ఆదర్శ వాదులకి అగ్రజుడు గానూ, చాందసులకి సత్యవాదిగాను కనిపిస్తాడు. అంగబలం, అర్ధ బలం లేని అర్భక సామాజిక చైతన్య మూర్తి మరణానంతరం శతాబ్దికి పైగా తెలుగువారి గుండెల్లో అభ్యుదయ ఆలోచనలు గుబాళిస్తున్నాడు" అని గురజాడ సాహిత్య పరిమళాన్ని సభకు పరిచయం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రతీ ఏటా "మానవతా దినోత్సవం" జరుపుకోవాలని ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ గారు పిలుపునిచ్చారు. గురజాడ పరమపదించి 109 సంవత్సరాలు అవుతున్నా, తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు మీద ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ గానీ, ఏ ఒక్క జిల్లా గానీ లేకపోవడం శోచనీయమని, సాహిత్యం ద్వారా సమాజానికి ఆయన చేసిన సేవకి గుర్తింపుగా ఒక సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్థని ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది” అని ఆచార్య కొవ్వలి గోపాల కృష్ణ గారు అభిప్రాయపడ్డారు.

వాడుక భాషే ప్రథమ సోపానం

విశిష్ట అతిథి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ గురజాడ సాహిత్యమంతా మానవీయ దృక్పధం, దేశభక్తి, స్త్రీ సముద్దరణ, ప్రజాస్వామిక భావజాలంతో విరాజిల్లుతుంది. గురజాడ సాహిత్యాన్ని మానవతా దృక్పథాన్ని విడదీసి చూపలేము. ఆయన మాటలు, చేతలు అన్నీ మానవీయ కోణంలోనే ఆవిష్కరించబడ్డాయి. మానవుల మధ్య వైరుధ్యాలు, విభేదాలు సమసిపోవాలని, కుల,మత, ప్రాంత భేదాలు విడిచిపెట్టి సమాజమంతా విశ్వయిక కుటుంబంగా మెలగాలని ఆకాంక్షించిన గురజాడ జయంతిని కేంద్ర ప్రభుత్వం దేశమంతా మానవతా దివస్ గా నిర్వహించుకోవాల్సిన అవసరం నేడు ఉందన్నారు. అప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది అని పేర్కొన్నారు. ఆత్మీయ అతిథిగా ప్రసంగించిన ఆచార్య ఐనవోలు ఉషాదేవి గారు గురజాడ సాహిత్యంలోని భాషా సౌందర్యాన్ని కొనియాడారు. సమాజహితానికే సాహిత్యమన్న సూత్రానికి కట్టుబడి రచనలు చేసిన గురజాడ సులభశైలిని, సరళ భాషని వినియోగించారన్నారు. సాహిత్యాన్ని ప్రజల చెంతకు చేర్చడంలో వాడుక భాషనే ప్రథమ సోపానం కనుక గురజాడ లలితమైన రమ్యమైన పదజాలంతో రచనలు చేశారన్నారు. గురజాడ రాసిన బాల సాహిత్య వైశిష్ట్యాన్ని ఆవిడ వివరించారు.

గురజాడ ఫౌండేషన్ ప్రతిపాదన భేష్

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ దేశ సరిహద్దులను కాకుండా, దేశాన్ని ప్రేమించాలని పిలుపునిచ్చిన గురజాడ జయంత్యుత్సవాన్ని “మానవతాదినోత్సవం”గా నిర్వహించాలని సంకల్పించడం ముదావహమన్నారు. “పాత కొత్తల మేలు కలయికతో సాహిత్య సృజన చేసిన గురజాడ రచనలు మానవీయ దృక్పథానికి నిలువెత్తు సాక్షాలు. వారి సాహిత్యమంతా మూఢ విశ్వాసాల ఖండన, అభ్యుదయ దృష్టి, సామాజిక అసమానతల నిరసన, సమాజ సంస్కరణ దృక్పధం, భాషా సంస్కరణ దృష్టితో కూడి నేటికీ ప్రాసంగికతను కోల్పోకుండా ఉంది. ఇందుకు కారణం ప్రత్యేక, సజీవ పాత్రల సృష్టితో ప్రజల సమస్యలను ప్రజల భాషలోనే ప్రజలకందించిన దార్శనికుడు గురజాడ” అని పేర్కొన్నారు. విశ్వజనీనమైన దేశభక్తి గేయం గురజాడ సామాజిక దృక్పథానికి నిదర్శనమని చెబుతూ గురజాడ రచనలలోని సత్యాన్వేషణ దృష్టిని సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా గురజాడ జయంతిని “మానవతా దినోత్సవం” గా నిర్వహించడం ఎంతో ఔచితీవంతంగా ఉందని, గురజాడ ఫౌండేషన్ వారి ప్రతిపాదనను ఆయన సమర్థించారు.

తెలుగు రాష్ట్రాలూ, కేంద్రం పూనుకోవాలి

భారత ప్రభుత్వం, రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు ప్రతి ఏటా గురజాడ జయంతిని “మానవతా దినోత్సవం” గా అధికారికంగా నిర్వహించాలని గురజాడ ఫౌండేషన్ కోరుతున్నట్లు శ్రీమతి గురజాడ అరుణ , గురజాడ రవీంద్రుడు తెలియజేశారు. ప్రముఖ చిత్రకారుడు, “మహాకవి గురజాడ” సినిమా దర్శకుడు శ్రీ చొక్కా తుషార్ గారు ఆయన దర్శకత్వంలో నిర్మిస్తునా “మహాకవి గురజాడ” సినిమా ట్రైలర్‌ని ప్రదర్శించి, వందన సమర్పణ చేశారు.

Advertisement

Next Story

Most Viewed