రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించరా..!?

by Ravi |   ( Updated:2024-12-19 00:45:30.0  )
రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించరా..!?
X

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకం విద్యార్థుల హక్కు. వీటిని క్రమం తప్పకుండా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ వేలమంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ , స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని మొర పెట్టుకుంటున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల బిడ్డల చదువులు వీటిపైనే ఆధారపడి ఉంటాయి.. అలాంటి పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంజీవని లాంటి పథకాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం కొనసాగించాలి.

సంవత్సరాల తరబడి ఇదిగో ఫీజు రీయింబర్స్మెంట్, అదిగో స్కాలర్‌షిప్ అంటూ ప్రభుత్వాలు హామీల ఆశలు చూపుతూ విద్యార్థులను హామీల ముసుగుతో ఉసిగొల్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి పబ్బం గడుపుతున్నారే తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. 2019 నుంచి రీయింబర్స్మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు దాదాపు 7500 కోట్లకు పైగా పెండింగ్‌‌లో ఉన్నాయి.

బకాయిలు చెల్లించని కారణంగా..

ప్రతి సంవత్సరం దాదాపు 14 నుంచి 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌పై ఆధారపడి చదువుతున్నారు. ఇన్ని లక్షల మంది విద్యార్థులకు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ రాకపోవడంతో నానా అవస్థలకు గురి అవుతున్నారు. గత ప్రభుత్వంలో వేలాది మంది విద్యార్థులు వినతి పత్రాలు ఇచ్చినా, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, అనేక ఉద్యమాలు చేపట్టినా కూడా పెడచెవిన పెట్టింది. దీంతో లక్షల మంది విద్యార్థులు నష్టపోయి ఉన్నత విద్యకు వెళ్లలేక మధ్యలోనే చదువు ఆపేశారు. మరికొందరు కోర్సులు పూర్తిచేసి.. ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించని కారణంగా యాజమాన్యాలు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తామంటూ విద్యార్థులను వేధించిన సంఘటనలు ఎన్నో.. ఇలా నష్టపోయిన లక్షలాది మంది విద్యార్థులు, యువత ప్రభుత్వం మారితే అయినా విద్యార్థుల సమస్యలు తీరుతాయని ఆశించి కాంగ్రెస్‌ని గెలిపిస్తే, తీరా అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా బకాయిలు మాత్రం చెల్లించడం లేదు.

బలవుతున్నది పేద విద్యార్థులే..

రీయింబర్స్‌మెంట్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కారణంగా తాము కళాశాలలు నడిపే పరిస్థితిలో లేమని, అధ్యాపకులకు జీతభత్యాలు కూడా చెల్లించలేని దీనస్థితిలో ఉన్నామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మొరపెట్టుకుంటున్న వైనం వాస్తవమే. ఫీజు రీయింబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో 25 శాతం, అకాడమిక్ ఇయర్ మధ్యలో 50 శాతం, చివరలో 25% చెల్లించాలి కానీ ప్రభుత్వం ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ సంవత్సరాలు గడుస్తున్నా చెల్లించడం లేదు. ఉదాహరణకి ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాకు దాదాపు 120 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమ గోడు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని కళాశాలలను ఇక నడిపే పరిస్థితుల్లో తాము లేమని కళాశాల బంద్‌కి సిద్ధమయ్యారు.

కళాశాలలు బంద్ అయితే...

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా అవకాశాలు లేక ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని తమ తల్లుల తాళిబొట్టు తాకట్టు పెట్టి మరి ఫీజులు చెల్లిస్తుంటే ప్రైవేటు యాజమాన్యాలు చేస్తున్న లక్షల ఫీజుల దోపిడీని అడ్డుకోవడం సంగతి దేవుడెరుగు కానీ వారికి కొమ్ముకాయడం హాస్యాస్పదం. ఫీజు నియంత్రణ చట్టం అమలు లేదు, ఫీజుల దోపిడీకి అడ్డు కట్టలేదు. పేదల రక్తాన్ని ఫీజుల రూపంలో జలగల్లా పీడిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒకపక్క ఫీజులు కట్టడానికి నానా అవస్థలు పడుతుంటే ఈ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా చెల్లించకుండా పేద విద్యార్థులకు ఉన్న కాస్తో కూస్తో ఆసరా అని కూడా మింగేసి రాష్ట్రంలో కళాశాలలు బంద్ పెట్టుకునే స్థితికి దిగజార్చింది ప్రభుత్వం.

రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు

రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడానికి లేని ఆర్థిక సంక్షోభం విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లు చెల్లించడానికి అడ్డొచ్చిందా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గత నెల రోజు లుగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రోడ్డు మీద కొచ్చి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేసి.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని విద్యార్థుల తరుపున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది.

చింతకాయల ఝాన్సీ

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

93819 21216

Advertisement

Next Story

Most Viewed