పింఛనర్ల బాధలు పట్టించుకుంటారా!

by Ravi |   ( Updated:2022-11-14 18:30:30.0  )
పింఛనర్ల బాధలు పట్టించుకుంటారా!
X

గౌరవ నరేంద్రమోడీ, భారత ప్రధానమంత్రి గారికి,

సీఎంపీఎస్-1998 నోటీసు కింద పెన్షన్‌ను సమీక్షించి సవరించడం కోసం 5 డిసెంబర్ 2022న ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఒక రోజు ధర్నా చేయాలని ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. మేము బొగ్గు గనుల పెన్షన్‌లో సత్వర సంస్కరణల కోసం, స్కీమ్-1998 మీద సమీక్ష కోసం చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. గతంలో రెండు సార్లు రిలే దీక్షలు కూడా చేశాం. మా డిమాండ్లలో ఉన్న కొన్ని సంస్కరణలు ప్రారంభమైనప్పటికీ అవి నెమ్మదిగా సాగుతున్నాయి. దీనివలన బొగ్గు గనుల పెన్షనర్లు పింఛను సవరణ ఫలం తినకుండానే చనిపోతున్నారు.

నిజానికి బొగ్గు గనుల ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీఎంపీఎస్)-1998 కింద కవర్ చేయబడతారు. వీరికి పటిష్ట సామాజిక భద్రత కల్పించేందుకు విప్లవాత్మక చర్యగా దీనిని ప్రారంభించారు. ఈ పథకం కిందకు సుమారు 5.56 లక్షల బొగ్గు గనుల ఉద్యోగులు వస్తారు. దీనిని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌ఓ) ద్వారా నిర్వహిస్తారు. 31-03-1994 తర్వాత చాలా మంది ఉద్యోగ విరమణ చేశారు. వారికి రూ.500 లోపు మాత్రమే పెన్షన్ వస్తున్నది. దీంతోపాటు సింగరేణి కంపెనీ ఇచ్చే పెన్షన్ రూ.1000 ఇలా రెండు జాయింట్ పెన్షన్లు వస్తున్నా ఇది నెలవారీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆసరా పెన్షన్ కన్నా దారుణంగా ఉంది. ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పెన్షన్‌ను ఇప్పటికీ సవరించలేదు. ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి సవరించాలనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదు. ఈ విషయంలో బొగ్గు మంత్రిత్వ శాఖది మాత్రమే తప్పు కాదు. ఇతర మంత్రిత్వ శాఖల తప్పు కూడా ఉంది. దీనిని బలోపేతం చేయడానికి అవకాశం ఉంది.

ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇతర రంగాలలో సంస్కరణలు చేపట్టారు. అందుకే బొగ్గు గని కార్మికులు సైతం ధర్నా చేసి తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. బొగ్గు గని కార్మికుల పెన్షన్ పథకం పునర్నిర్మాణం, డియర్‌నెస్ రిలీఫ్ బాగాన్ని ఉద్యోగ విరమణతో సంబంధం లేకుండా చేర్చడం, టన్నుకు రూ 20 చొప్పున నిర్బంధ సెస్ వసూలు వేగవంతం చేయడం, అన్ని బొగ్గు కంపెనీల నుండి మూడు సంవత్సరాలకోసారి సెస్ పెంపు, ప్రతి మూడు సంవత్సరాలకు పెన్షన్ సమీక్షించడానికి అనుమతి, కనీస పెన్షన్ అమలు, సీఎంఫీఎఫ్ఓ స్వయంగా ప్రకటించిన బ్యాంక్ స్థాయిలో వితంతువు పెన్షన్ ప్రారంభించడం వంటివి నెరవేర్చేందుకు దయతో నిర్ణయం తీసుకోండి. ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని రిటైర్డ్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

దండంరాజు రాంచందర్ రావు

అధ్యక్షుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం

హైదరాబాద్, 98495 92958

Advertisement

Next Story

Most Viewed