- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తీరుతెన్నులు పరిశీలించు.. తీర్పును ప్రకటించు
తెలంగాణలో ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా బరిలో ఉన్న ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మ్యానిఫెస్టోల గురించి, అవి ఇచ్చిన హామీల గురించి పరిశీలిస్తే.. ఏ పార్టీ ఏ హామీలు ఇస్తున్నాయి. వాటిలో ఆచరణ సాధ్యమైనవి ఏవి, సాధ్యం కానివి ఏవి అని నిర్ధారించుకుని అంతిమ తీర్పు చెప్పాల్సింది ఓటర్లే.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో..
సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ. 3 వేల గౌరవ వేతనం, దివ్యాంగుల పెన్షన్లు రూ. 6 వేలకు పెంపు, ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు పెంపు, రైతుబంధు కింద ఇస్తున్న రూ.10 వేల నగదు సాయాన్ని క్రమంగా 16 వేలకు పెంపు ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపు, అర్హులైన వారందరికీ రూ. 400కే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం,'కేసీఆర్ బీమా ప్రతి ఇంటికీ ధీమా' పేరుతో రూ. 5 లక్షల బీమా పథకం అంటూ అనేక కొత్త హామీలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పించింది.
సుస్దిరతా ప్రభుత్వం, గతంలో చేసిన అభివృద్ధి, అమలు పరచిన సంక్షేమాలే తమను మూడోసారి గెలిపిస్తాయి అని నమ్మకంతో వుంది అధికారపక్షం. ఎన్నికల ప్రచార కంటెంట్‌ను కరెంట్ చుట్టూ తిప్పి మీటర్లు, మోటర్లు అంటూ మ్యాటర్‌ని బీఆర్ఎస్ పార్టీ వేడెక్కించిందనే చెప్పాలి. అభ్యర్దుల ప్రకటన నుంచి ప్రచారం వరకూ దూకుడుగానే వ్యవహరించింది. దృశ్య, ప్రతికా, సామాజిక ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. పార్టీ అధినేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు తమదైన శైలిలో రసవత్తరమైన ప్రసంగాలు, పిట్టకథలు, సామెతలతో ఓటర్లను ఆకర్షించారు. ప్రభుత్వ వ్యతిరేకత, ధరణిలో లోపాలు, సంక్షేమ పథకాలు లబ్దిదారులకు చేరకపోవడం. నియామక ప్రక్రియలో కాస్త అలసత్వం లాంటివి ప్రతికూల అంశాలు. ఏదైనా సంస్కరణలు చేపట్టి అమలు చేయడానికి సమయం పట్టవచ్చు, వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు వాటిని సరిదిద్దుతాం అంటూ ప్రభుత్వ నేతలు ప్రదర్శిస్తున్న ఆత్మ పరిశీలన ఓటర్లపై ప్రభావం చూపుతుందా అనేది తేలాల్సి ఉంది.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. ఆరు గ్యారంటీలు
ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మహాలక్ష్మి స్కీమ్, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరుతో ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక పథకాలను పొందుపరిచారు. మహిళలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కర్ణాటక తరహాలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏప్రిల్ ఒకటిన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తేదీలతో సహా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. జూన్ 1న గ్రూప్-3, గ్రూప్-4 నియామకాలకు నోటిఫికేషన్ వెల్లడిస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పింఛన్, ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొంది.
కర్ణాటక ఎన్నికల ముందు వరకూ జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. పార్టీలో చేరికలు బలాన్ని ఇచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలు కలిసివచ్చే అంశాలు. గెలిచిన ఎంఎల్ఏ పార్టీలో కొససాగటంపై అనుమానాలు గత అనుభవం. పైగా ముఖ్యమంత్రి పదవి రేసుకై బహిరంగ వ్యాఖ్యలు అ పార్టీని కలవర పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు అలాగే ఖమ్మం, నల్గొండ ప్రాంతాలలో పెరిగిన ప్రాబల్యం కలిసి రావచ్చు. ప్రతికా, సామాజిక ప్రచార మాధ్యమాల ద్వారా విసృతంగానే ప్రచారం చేసింది. ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. నిరుద్యోగ సమస్య, కాళేశ్వరం, పరిశ్రమల స్థాపన, తదితర అంశాలతో ప్రచార వేడిని పెంచింది.
డీలా పడ్డ డబుల్ ఇంజన్
ఇక బీజేపీ ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించడం ద్వారా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గింపు. ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన ‘మీభూమి’ వ్యవస్థ. ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, ఎస్సీ వర్గీకరణ, డ్వాక్ర బృందాలకు నామమాత్రపు 1% వడ్డీకే రుణాలు మహిళా రైతులకు మద్దతు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో.. గ్రూప్-1, గ్రూప్-2 సహా.. రిక్రూట్మెంట్ పరీక్షలను 6 నెలలకోసారి పారదర్శకంగా నిర్వహణ, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లో భర్తీ. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమీక్ష, కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణం.
బీఆర్ఎస్‌కు ప్రత్యామ్యాయం మాదే అన్న బీజేపీ మూడో స్థానానికి పోటీపడే పరిస్దితికి వచ్చింది. పార్టీ ఆధ్యక్షుడి మార్పు, పార్టీ నుంచి వలసలు, జనసేనతో పొత్తు నిర్ణయాత్మక తప్పిదాలు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ప్రాజెక్టులు కేటాయింపు సకాలంలో కేటాయించక పోవడం. విద్యుత్ సంస్కరణలపై స్పష్టత నివ్వకపోవడం ఎన్నికల ముందు పసుపు బోర్డు, ట్రైబల్ విశ్వవిద్యాలయ ప్రకటన నామ మాత్రపు చర్యలే. తెలంగాణపై బీజేపీ చూపిన వివక్ష స్పష్టం. బీసీ ముఖ్యమంత్రి ఎన్నికల కార్డు. ఎన్నికల వాగ్దానాలు, ప్రచారానికి ఆఖరి నిమిషం వరకూ మీనమేషాలు లెక్కించడం వ్యూహమా లేక ఆత్మరక్షణ అనేది ఢిల్లీ పెద్దలు చెప్పాల్సిన విషయం. చేజేతులా బీజేపీ చేసుకున్న స్వయంకృతం.
ఓటును వివేకంతో వినియోగించండి
ఉచితానుచితాలను మరచి పార్టీలు ప్రకటించే పథకాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. కిట్లు, కనికట్లు. పార్టీషన్, న్యూట్రీషన్ రాజకీయాలు, మూడు గంటల కరెంటు, మూడు పంటల కామెంట్, భూములను ప్రజల వద్ద భద్రంగా పెట్టిన ధరణి, భూమాత పేరుతో భూములను కాజేస్తరనే ధోరణి లాంటి ఆంశాలను నిశితంగా పరిశీలించాలి. సామాన్యునికి అవసరమైన ఆహారం, నివాసం, ఉపాధి, శాంతి భద్రత సాధ్యమైనంత వరకూ సుస్థిర పారదర్శక పాలన ఆందించే వారిని ఎన్నుకోండి. ప్రలోభాలకు తలవంచితే ప్రశ్నించే హక్కును కోల్పోవడమే కాకుండా వ్యవస్దలో రాజీపడి బ్రతకాలి. అలోచించండి ఓటర్లూ... ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఓటును వివేకంతో వినియోగించండి. తీరు తెన్నులు తెలుసుకుని తీర్పును ప్రకటించండి.
- వాడవల్లి శ్రీధర్
99898 55445