- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్దుబాటు కాదు.. దిద్దుబాట కావాలి!?
విద్యారంగ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఆశయం కలిగిన ఉపాధ్యాయ సంఘాలన్నిటి బాట ఒకటే. విద్యార్థులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చాలని కోరుకునే ఉపాధ్యాయులందరిదీ ఒకే మాట! అదే జీఓ 117 రద్దు. ఈ జీఓ వల్ల ఉపాధ్యాయులు వృత్తిపరంగా నష్టపోతున్నారా? జీతభత్యాలకేమైనా సమస్యా? అంటే కానే కాదు. అదొక సామాజిక అంశాల అజెండా వెలుగులో ఆలోచిస్తున్న మేధావుల సమస్య.
వాస్తవానికి ఉపాధ్యాయ లోకం మనస్ఫూర్తిగా విద్యారంగం బాగు కోరుకుంటున్నారు. అందుకే విద్యారంగాన్ని కుదిపేస్తున్న జీఓ 117 రద్దు కోసం దరిమిలా పట్టుపడుతున్నారు.. దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయ చికిత్స చేస్తే గానీ విద్యారంగానికి పట్టిన కేన్సర్ వ్యాధి నుండి విముక్తి లభించదు. అలాగే ఇపుడు నడుస్తున్న ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమం పునరుద్ధరణ చేయాలి. తద్వారా ఉపాధ్యాయ పోస్టులు పెరిగి ప్రభుత్వ విద్యాబోధన తిరిగి పుంజుకుంటుంది.
జీఓ 117 అంటే ఏమిటి?
నూతన విద్యా విధానం 2020 ని పురస్కరించుకుని రాష్ట్రానికి మరిన్ని నిధులను రాబట్టుకునేందుకు 25కు పైగా రాష్ట్రాలు పక్కన పడేసిన విధానాన్ని గత ప్రభుత్వం నెత్తికెత్తుకొంది. విద్యాబోధన నాణ్యత పెంచడమనే సాకు చూపి ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తరగతులను విడగొట్టింది. ఉపాధ్యాయ పోస్టులను పునర్విభజన చేసింది. విద్యార్థులను భావి ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యమట! ఆ మేరకు 2022 జూన్ 10న జీఓ అమలులోకి తెచ్చింది. జీఓను నిరంతరాయంగా అమలు చేయడం కోసం రాష్ట్ర స్థాయిలో సిద్ధహస్తులు, కుయుక్తులతో ఉపాధ్యాయులను భయపెట్టగలిగిన అధికారులను నియమించుకున్నారు. శాటిలైట్ స్కూల్స్, 1, 2 తరగతులను పిపి-1, పీపీ -2, ఫౌండేషన్ క్లాస్, ప్రీ స్కూల్, హై స్కూల్, హై స్కూల్ ప్లస్ అనే కొత్త పేర్లు సృష్టించడం. 3నుండి 5 వ తరగతి వరకు 3 కిలోమీటర్ల దూరంలో వున్న హైస్కూల్‌లో కలపడం, దూరంగా వుంటే యధాస్థితి కొనసాగించడం. హైస్కూళ్లలో ఇంటర్మీడియెట్ ప్రారంభించడం వంటివి చేశారు.
టీచర్లను చీల్చి చెండాడారు..
పేర్లు బాగున్నాయ్. కానీ చిక్కంతా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వచ్చిపడింది. జీఓ నెంబర్ 2 ప్రకారం నడుచుకోవాల్సిన స్టాఫ్ పాటర్న్, విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి (PTR) అటకెక్కింది. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లచే బోధనా అంటూనే ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్స్ లేకుండా చేశారు. 98లోపు విద్యార్థులున్న హైస్కూళ్లలో ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేశారు. కనీస పదోన్నతులు ఇవ్వకుండానే హైస్కూల్స్‌లో పనిచేసే సబ్జెక్టు టీచర్స్‌ను తరలించారు. ఒక చోట సెక్షన్స్ ప్రాతిపదికన, మరోచోట విద్యార్ధుల ప్రాతిపదికన ఉపాధ్యాయులను చీల్చి చెండాడారు. 30 లోపు విద్యార్థులకు 1 సెకండరీ గ్రేడ్ అంటూనే, 31 వద్ద రెండో పోస్ట్ ఇవ్వలేదు. దీనికి అదనంగా కొన్ని సవరణలతో జీఓ 128 తెచ్చారు. ఇక్కడ కూడా ఉపాధ్యాయులను మిగులు తేల్చడమే లోగుట్టు వ్యవహారం. పదోన్నతులు ఇవ్వకుండా, గడిచిన అయిదేళ్లుగా ఒక్కరూ కూడా పదవీ విరమణ చేయకుండానే మిగులు ఎలా తేలారు? ఇన్ని సమస్యల పరంపరలోనే ఆ జీఓను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం తాలూకు దుశ్చర్యల కొన సాగింపుగా ఇప్పుడు సర్ధుబాటు ప్రక్రియను నెత్తికెత్తుకుంది.
జీఓ- 47 భూస్థాపితమైనట్లేనా?
ఉపాధ్యాయులను మిగులు చూపి సుదూర ప్రాంతాలకు తరలించే వ్యవహారాన్ని రాత్రికి రాత్రే కొనసాగిస్తోంది. "ఏంటో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి. 2023 మేలో జారీ అయిన జీఓ నెంబర్ 47 ఆధారంగా సరిగ్గా ఏడాది కిందట బదిలీలపై వివిధ పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? వారి ప్రాధాన్యత పాయింట్ల సంగతేంటి? వారి సీనియారిటీ మాటేంటి? వ్యాధి పీడితులకు ఇచ్చిన వెసులుబాటు గతేంటి? యాజమాన్యాల మధ్య ఏర్పడిన సర్వీస్ ఇబ్బందుల సంగతేంటి? ఆయా ఉపాధ్యాయులను ఇప్పుడు సర్దుబాటు పేరుతో మరో చోటకు తరలిస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారి పిల్లల చదువుల మాటేంటి? జీఓ నెంబర్ 47 భూస్థాపితమైనట్లేనా? అందుకే ఇన్ని అవాంఛనీయ సంఘటనలకు హేతువైన సర్ధుబాటు ప్రక్రియను వెంటనే పక్కన పెట్టాలి. ఇప్పుడు యావత్ ఉపాధ్యాయ లోకం కోరుతున్నది. ఆర్థిక సమస్యలు, పరిష్కరించలేని సమస్యలు కావు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, నైతికతకు కట్టుబడి జీఓ 117ను రద్దు చేయమని కోరుతున్నాం.
జీఓ-117 వల్ల ఎన్నో నష్టాలు..
గత ప్రభుత్వం జీఓ-117 అమలు చేయడం వలన ఎంతో మంది బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కువ దూరం నడవలేక బడి మానివేశారు. ఆవాస ప్రాంతాల్లో బడులు మాయమయ్యాయి. అదే సమయంలో ప్రవేటు పాఠశాలలు ఎన్నో పుట్టుకొచ్చి అందులో ఎన్‌రోల్‌మెంట్ గణనీయంగా పెరిగింది. ఉపాధ్యాయ పని భారం పెరిగింది. వారానికి 30 పీరియడ్లకు బదులు 42-48 పీరియడ్లకు చేరడంతో బోధనా నాణ్యత పడిపోయింది. విద్యా ప్రమాణాలు తగ్గాయి. పోస్టులు రద్దయ్యాయి. ఉపాధ్యాయులు చాలా సుదూర ప్రాంతాలకు బదిలీ కావాల్సి వచ్చింది. కొందరు కనీసం వందకు పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. బాలల హక్కులకు భంగం కలిగింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు భిన్నంగా బాలలు చదువుకునే హక్కును ప్రభుత్వమే దూరం చేసింది.
ప్రత్యామ్నాయ మార్గాలేంటి?
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు, ఉపాధ్యాయులను ఇక్కట్లను బయట వేసేందుకు ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ముందు ఎన్నో పరిష్కార మార్గాలను పరిశీలించాలి. పదోన్నతులు ఇవ్వడం, విద్యా వాలంటీర్లను నియమించడం, డిఎస్సీ నియామక ప్రక్రియను వేగవంతం చేయడం. ఒక అపరాధ భావన నుండి ప్రభుత్వానికి విముక్తి కలగాలన్నా, విద్యావ్యవస్థ బాగుపడాలన్నా శాస్త్రీయ అవగాహనతో ముందుకు సాగాల్సిన అవసరం వుంది.
- మోహన్ దాస్,
ఏపిటిఎఫ్ రాష్ట్ర నాయకులు,
94908 09909