గిగ్ ఎకానమీనా... బిగ్ ఎకానమీనా?

by Ravi |   ( Updated:2024-06-14 01:15:59.0  )
గిగ్ ఎకానమీనా... బిగ్ ఎకానమీనా?
X

మనదేశంలో నిరుద్యోగానికి మారుపేరే గిగ్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో సాధారణ జీతం చెల్లించడానికి బదులుగా పని సామర్థ్యాన్ని బట్టి చెల్లింపులు ఉంటాయి. కార్పొరేట్ సంస్థలు తాత్కాలిక పని కేటాయింపుల కోసం గిగ్ కార్మికులను ఉపయోగించుకుంటున్నారు. వీరికి నిర్దిష్టమైన కాలంగానీ స్థలం గానీ ఉండదు. అంతా ఒక స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ. అటూ ఇటూ అందరూ స్వతంత్రులే. అంతా అనిశ్చితమే.

దేశంలో మెల్లగా ప్రైవేట్ రంగం విస్తరించింది. ఈ కార్పొరేట్ రంగం పునాదులు బలంగా ఏర్పడడంతో ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు గిగ్ వర్కర్స్‌గా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గిగ్ ఎకానమీగా ఉంటూ.. పలానా పనికి ఇంత డబ్బు అని పనులు గుత్తకు ఇవ్వడం జరుగుతున్నది. ఉపాధి అవకాశాలు కానీ జీతభత్యాలు కానీ పర్మనెంట్ ఉద్యోగం లేనందున, వాటికి చట్టబద్ధత లేనందున, ఇంకా ఇక్కడ పని చేయాలంటే ఏముందనే ధోరణితో దేశ యువత వలస బాట పడుతున్నారు. ఇది కడు శోచనీయం.

జీడీపీ ముఖ్యం కాదు..

సాధారణంగా మన ఆర్థిక శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు దేశ ఆర్థిక వ్యవస్థను జీడీపీ పరంగా అంచనా వేస్తారు. శ్రామిక శక్తి గురించి గానీ, వారి ఉపాధి ఆదాయాలు ఆధారంగా చేసుకుని ఆర్థిక వ్యవస్థను అంచనా వేయరు. జీడీపీ పరంగా కాకుండా జాబ్స్ పెరుగుదల పరంగా అంచనా వేయరు. అందుకే ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదైనా దేశంలో శ్రామికులు తాత్కాలిక కార్మికులుగా ఇండిపెండెంట్ శ్రామికులుగా, స్వయం ఉపాధి కార్మికులుగా బతుకీడుస్తున్నారు. అంటే గిగ్ వర్కర్లుగా తమ శ్రామిక శక్తిని స్వతంత్రంగానో, సైడ్ ఉద్యోగంగానో రూపొందించుకోవడం జరుగుతున్నది. ప్రజల శ్రామిక శక్తిని తెలియజేసేది గిగ్ ఎకానమీ. వీరిని కార్పొరేట్ సంస్థలు ఇంటర్నల్ శ్రామిక శక్తిగా ఉపయోగిస్తున్నాయి. ప్రజల నుండి వచ్చిన వస్తు సేవల డిమాండ్‌ను ఈ గిగ్ కార్మికుల ద్వారా తీర్చుతారు. బీబీసీ ప్రకారం, గిగ్ శ్రామికులు అంటే శాశ్వత ఉద్యోగాలకు విరుద్ధంగా స్వల్పకాలిక ఒప్పందాలతో కార్మికుల మార్కెట్ ఉండటం, వారు చేసే పనిని బట్టి ఈ కార్మికులకు చెల్లింపులు ఉండడం జరుగుతుంది. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా వీరు తమ కార్యక్రమాలను రూపొందించుకొని జరుపుకుంటారు. గిగ్ అనే పదం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఉండే ఉద్యోగానికి సంబంధించినది. ఇలాంటి గిగ్ వర్కర్స్ దేశంలో నేడు కనీసంగా 80 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. మనదేశంలో యువతకు ఇదే నేడు జీవనాధారంగా ఉన్నది.

ఉద్యోగ కల్పన హుష్ కాకి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి తద్వారా ఉత్పత్తులను, ఉద్యోగ కల్పనను పెంచాలని తలపెట్టి భారత ప్రభుత్వం సఫలీకృతమైంది. 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడం జరుగుతున్నది. 1951లో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలో ఐదు పరిశ్రమలతో మన పారిశ్రామికీకరణ ప్రారంభం కాగా, 1956లో 17 మౌలికమైన కీలకమైన పరిశ్రమలను దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే విధంగా నెలకొల్పాం. 2021 నాటికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు 365కు చేరాయి. దేశం స్వయం సమృద్ధిని, పారిశ్రామిక అభివృద్ధి సాధించగలిగింది. తద్వారా ఉద్యోగ కల్పన చేయగలిగాం. కానీ దేశంలో మెల్లగా ప్రైవేట్ రంగం విస్తరించడంతో కార్పొరేట్ రంగం పునాదులు బలంగా ఏర్పడ్డాయి. దీంతో ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు గిగ్ వర్కర్స్‌గా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడినది. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు శాతం మాత్రమే శ్రామికులు పనిచేస్తుండగా అధికారిక ప్రైవేట్ రంగంలో ఐదు శాతం మంది మాత్రమే శ్రామికులు ఉన్నారు. అల్ట్రా క్యాపిటల్ లిస్ట్‌లో ఉన్న అమెరికాలో కూడా ప్రభుత్వ రంగం మొత్తం దేశ శ్రామికులలో 15% శ్రామిక శక్తిని కలిగి ఉంది.

నిరుద్యోగానికి మరోపేరు..

ఆనాడు వలస పాలనలో జరిగిన ఎకనమిక్ డ్రైవ్ కన్నా నేడు జరుగుతున్న, బ్రెయిన్ డ్రైవ్ అధికంగా ఉండటంలో ఎలాంటి సందేహం లేదు. బ్రిటిష్ వలస పాలనలో జరిగిన ఎకనమిక్ డ్రైవ్ వలన అన్ని రకాలుగా దేశం వెనకడుగు వేసిందని మనకు తెలుసు. ఇప్పుడు మానవ వనరుల ద్వారా మన దేశాభివృద్ధి జరగవలసిన పరిస్థితుల్లో, మన మానవ వనరులు వలసబాట పట్టడం శోచనీయం. నిరుద్యోగానికి మారుపేరే గిగ్ వ్యవస్థ. ఉద్యోగాలు లేక నేడు వలస బాటలో దేశ యువత పరుగులు పెడుతున్నారు. వలస పాలన నుంచి మన పాలన వచ్చిందని సంబరపడి మన బతుకులు బాగా పడతాయని భావించడం ఆనాడు జరిగింది. ఇప్పుడు ఉపాధి కోసం, ఉద్యోగిత కోసం వలస పోవడం దేశ ప్రజలకు తప్పనిసరిగా మారింది. లక్షల కొలదీ ప్రజలు ఈ దేశ పౌరసత్వం వదులుకుంటున్నారు. విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఇది ఈ దేశానికి నేడు పట్టిన అధోగతి. 2011 నుంచి నేటి వరకు 16 లక్షల మంది భారత దేశ పౌరసత్వం వదులుకున్నారు. దీనినే బ్రెయిన్ డ్రైవ్ అంటారు. మరొకవైపు విద్యార్థులు కూడా దేశంలో తగినన్ని విద్యా ఉపాధి సౌకర్యాలు లేక విదేశీ విద్యకు, ఉపాధికి పరుగులెట్టడం వల్ల అక్కడే స్థిర పడిపోవడం కూడా దేశానికి జరుగుతున్న మరొక నష్టం.

అభివృద్ధి అంటే..

2024 నాటికి ఒక కోటి 80 లక్షల మంది భారతీయులు 85 బిలియన్ డాలర్ల మేరకు విదేశీ విద్యపై ఖర్చు పెడుతున్నారంటే.. ఈ దేశ ఆదాయం ఎటుపోతుందో గమనించగలరు. విదేశాలలో ఎక్కువగా ఉద్యోగాలు ఆదాయాలు లభించడం వలన బ్రెయిన్ డ్రైవ్ జరుగుతున్నది. అభివృద్ధి అంటే అందరి వృద్ధి, అంతేగాని కొందరి వృద్ధి మాత్రం కాదు అని గాంధీజీ అన్నారు. దేశ ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు, ప్రజలకు కనీస అవసరాలు తీరడం, తిండి, బట్ట, విద్య, వైద్యం ఏ మేరకు పొందగలుగుతున్నారు అనేది ముఖ్యం.

ఇలానా మనదేశం ఎదుగుతున్నది?

ప్రపంచ దేశాల్లో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది అని చెబుతున్నారు. అయితే మానవ వనరుల అభివృద్ధి పరంగా ప్రపంచంలోని 191 దేశాలలో మన దేశ స్థానం 132లో ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో భారత ప్రజలు 153 దేశాలలో 144 స్థానంలో ఉన్నారు. అంటే భారతీయులు ఎంత ఆయురారోగ్యాలతో ఉన్నారో అవగతం అవుతుంది. తాగే దానికి మంచినీళ్లు కూడా లభించని దేశాలలో మన దేశం 122 దేశాలలో 120 వ స్థానంలో ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 107 దేశాలలో మనదేశం 94వ స్థానంలో ఉంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపుగా మన దేశం ఎదుగుతున్నది అంటే ఇలానా?

డా. ఎనుగొండ నాగరాజ నాయుడు,

రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి,

98663 22172

Advertisement

Next Story

Most Viewed