- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాధ్యతలు నేర్పే ఘుగర
ప్రాచీన కాలం నుంచి మొదలుకొని నేటి వరకు గజ్జెలు (మువ్వలు) మన జీవన విధానంలో ఎనలేని మనుగడను కొనసాగిస్తున్నాయి. పశుపక్ష్యాదులు మొదలుకొని, పసిపాప ప్రాయం నుంచి వృద్ధ్యాప్యం దాకా మువ్వలతో వున్న అనుబంధం విడదీయలేనిది.
కోడిపుంజు కాళ్ల నుంచి... లేగ దూడ మెడ వరకు పసిపాపగా వేసే మొదటి అడుగు నుంచి.. భర్తతో వేసే చివరి అడుగు వరకు బంజార ప్రజల జీవితంలో మువ్వ/ గజ్జెలకు ఉన్న ప్రాముఖ్యత వైవిధ్యమైనది.
ఛమ్క్య ఘుగర పేరి... ఛమ్మ్ ఛమ్మ్ నాచుకన్
ఝూంజరియ పేరి.. జవాని ఉమర్ ఆయికన్
గోళ్ ఘుగర పేరి.. గోల్ మాల్ న వేణోకన్...
తీని రంగీర్ ఘుగర ఛూట్ చాలే...
మారే వీరణారీ సోపతి ఛూట్ చాలీ...
వాక్టీర్ బంధమేతి భందీ చాలీ...
ఓ ఘుగర మార్ బేటీ బేటార్ ఖుణ్ ఖుతియ మ బోలే కన్ మురిసి చాలీ..
ఛమక్క్య ఘుగర, ఝూంజరియ, గోళ్ ఘుగర, వాంక్డి ఇలా బాల్య దశ నుంచి యవ్వన దశ, కౌమర దశ, వృద్యాప్యం దాకా బంజార భోరీకి గజ్జలతో ఉన్న అనుబంధం విడదీయరానిది. బాల్య దశలో తండ్రి తన కూతురు ఛమక్య్క ఘుగరతో చేసే సవ్వడిని వింటూ మురిసిపోతాడు. తన బాధ గాధలను మరిచిపోయేలా తన కూతురిని...
నాఛ్ బాయి నాఛ్ అంటూ పాట పాడుతూ ఆ మువ్వలు మరింత గా సవ్వడి చేసేలా ప్రోత్సహిస్తాడు.
యవ్వన దశ ఆరంభంలో తన జీవితంలో చోటు చేసుకునే మార్పులకు, బాధ్యతలకు భయపడకుండా శరీర పరిపక్వతకు మునుపే మానసిక పరిపక్వతకు సంసిద్ధపరుస్తూ తల్లీ తన కూతురికి ఇచ్చే కానుకే ‘ఝూంజరియ’ ఈ గజ్జెలు పూర్తిగా లోహంతో తయారు చేయబడి ఉంటాయి. లేత కాళ్లకు నొప్పిని, బొబ్బలను పరిచయం చేస్తాయి. అసౌకర్యంగానూ అనిపిస్తాయి. వాటన్నింటిని ఓర్చుకోవడం వల్ల ఊహించని మార్పులు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి అనే అనుభవ పాఠాలను ఈ ఝాంజరియ నేర్పిస్తాయి.
కౌమర దశలో కానుకగా అందించే గోళ్ ఘుగర బంజార(ఛోరీ) అమ్మాయికి ఉద్వేగ పూరితమైన బహుమతిగా భావించబడతాయి. ఎందుకనగా అన్నదమ్ములు ప్రేమతో ఒక్కో గజ్జను తాడు సహాయంతో ప్రేమగా అల్లి తమ అక్క/ చెల్లికి ‘గోళ్ ఘగర’తో పాటు ఇంటి పరువు, ప్రతిష్టను బాధ్యతగా అందిస్తారు. కౌమర దశలో ఉన్న తనపై తమ ఇంటి పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉన్నాయని అంతటి బరువైన గోళ్ ఘుగరను తాను ధరించి సత్ప్రవర్తనతో మొలుగుతూ మంచి పేరును తెచ్చుకోవాలని, ప్రేమతో కూడిన బాధ్యతను తన అన్నదమ్ముల చేతుల మీదుగా గోళ్ ఘుగర రూపంలో ఆనందంగా అందిపుచ్చుకుంటుంది.
ఈ గోళ్ ఘుగరలు చాలా బరువుగా ఉంటాయి. తాను వేసే ప్రతి అడుగులో తనపై ఉన్న బాధ్యతను గుర్తుచేస్తూ ఉంటాయి. తన పెళ్లి సమయంలో తనను అత్తగారి ఇంటికి అప్పజెప్పే ముందు తనపై నమ్మకం ఉంచి తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను తనకు అప్పగించినందుకు గాను తన పుట్టింటి వారు ఆశించినట్లుగా పుట్టింటి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా నడుచుకొని ఆ బాధ్యతలను తిరిగి గోళ్ ఘుగర్ రూపంలో అన్నదమ్ములకు అందిస్తుంది.
ప్రతి ఆడపిల్ల జీవితంలో అత్యత్తమమైన ఘట్టం పెళ్లి. ఈ సమయంలో అన్నదమ్ములు తమ సోదరి తమ ఇంటి పరువు ప్రతిష్టలను బాధ్యతగా కాపాడిందని గుర్తించి ఆ గోళ్ ఘుగరను ఎంతో భావోద్వేగంతో ఏడుస్తూ విప్పుతారు.
ఈ సందర్భంగా పెళ్లికూతురు జీవితకాలం తాను వారికి సోదరిగానే ఉంటానని, తనకు ఆ గోళ్ ఘుగర బరువుగా లేవని. తనను పరాయి ఇంటికి పంపించకూడదని తన కుటుంబంతో ఉన్న అనుబంధంలో వచ్చే మార్పులను తాను స్వాగతించనని, తనను వారి ప్రేమానురాగాలకు దూరంగా పంపించకూడదని, అంతటి మధురమైన అనుబంధాన్ని విడదీయకూడదని ఏడుస్తూ తన భావాలను పాట (ఢావ్లో) రూపంలో వ్యక్తపరుస్తుంది.
అన్నదమ్ములు ఘుగర విడిపించగా తనకు కాబోయే భర్త ‘వాంక్డి’ని (ఇసుక రేణువుల్లాంటి చిన్న చిన్న మువ్వలు అమర్చబడి లోహంతో తయారు చేయబడినది) పెళ్లి కూతురు కాళ్లకు ఎక్కిస్తారు. ఈ వాంక్డిని తిరిగి తన భర్త మరణం తరువాతనే తొలగిస్తారు. వాంక్డి ని స్వీకరించిన తాను అత్తింటి గౌరవ మర్యాదలను అనుగుణంగా అత్తింటి బాధ్యతలను స్వీకరించినట్లుగా భావిస్తుంది.
ఛమక్క్య ఘుగర, ఝూంజరియ, గోళ్ ఘుగర తన మానసిక పరిపక్వతకు అర్థవంతమైన నడవడికకు ప్రోత్సహించడం ద్వారా తాను తన పుట్టింటి గౌరవ మర్యాదలను కాపాడటంలో గడించిన అనుభవాల ఆధారంగా తన మెట్టినింటి పరువు ప్రతిష్టలను కాపాడాల్సిందిగా... ఆ బాధ్యతలను అనుక్షణం గుర్తుంచుకునే లాగా ఘుగరను పెళ్లికూతురు (నవ్లేరి)కి తన వేషధారణలో భాగం చేస్తూ గ్గుంగ్టో, టోప్లీ, కాళీ, ఖయ్య, తాక్లీ, పెట్టిలలో మువ్వలను అమర్చుతారు.
కొత్త జీవితాన్ని స్వాగతిస్తూ పెళ్లికూతురు (నవ్లేరీ) వాటి బరువును ఆనందంగా ఆస్వాదిస్తుంది. అనుక్షణం తన అత్తింటి కట్టుబాట్లను గుర్తు చేసుకుంటూ వాటికి అనుగుణంగా సక్రమంగా నడుచుకుంటూ తాను అడుగులు వేసినప్పుడు మొదలైన మువ్వల సవ్వడి తన పిల్లల చేతిలో (ఖుణ్ ఖుణియ) గిలకగా మారి చేస్తున్న సవ్వడిని వింటూ ఆనందంగా తన జీవితంలో మువ్వలు/( గజ్జెల)కు ఉన్న అనుబంధం విడదీయలేనిది అనే విషయాన్ని గ్రహిస్తుందీ. బంజార ఛోరీ...
నేనావత్ స్రవంతి
జేఎల్, ఇంగ్లిష్
70936 44541