- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా బిల్లు అమలుతోనే సమానత్వం సాధ్యం!
అవనిలో సగం, ఆకాశంలో సగమైన స్త్రీని ఆదిపరాశక్తిగా కొలిచే మన సమాజంలో ఆమె తన ఉనికి కోసం ప్రతిసారి ప్రయత్నించాల్సి వస్తుంది. అయితే అవకాశాలు అందివస్తే తాము ఎవరికి తీసిపోమని కొందరు స్త్రీలు అత్యున్నత పదవులకు సైతం అర్హతలు సాధించి నిరూపిస్తున్నారు. కానీ సగటు మహిళలు మాత్రం అనునిత్యం అగచాట్లు పడుతూనే ఉన్నారు. కానీ పురుషులతో సమానంగా స్త్రీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు కల్పించే చట్టాలు అమలైతే తప్ప రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం సాధించలేమనేది వాస్తవం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో భారతీయ మహిళలు రాజకీయ రంగంలో పురుషులతో సమానంగా పోటీపడి రాణించగలిగారు. అలాంటి వారిలో ముఖ్యులు దేశప్రధానిగా సేవలందించిన శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమె సమకాలీన సమాజంలో గొప్ప పరిపాలన దక్షురాలిగా పేరుగాంచారు. ఈ క్రమంలోనే మరికొంత మంది స్త్రీలు రాయబారులుగా, గవర్నర్లుగా, స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఆ పదవులకే వన్నె తెచ్చారు. వీరిని ప్రేరణగా తీసుకొని రాజకీయాలలోకి రావాల్సిన నేటి భారతీయ మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించి 76 సంవత్సరాలు దాటినా దేశానికంతటికీ చట్టాలు చేసే అత్యున్నత సభలలో వారి సంఖ్యను చూసిన, చట్టసభల ప్రాతినిధ్య ఎన్నికల పోటీలో నిలబెట్టడానికి పార్టీలు కేటాయించిన సీట్లను చూసినా ఆశ్చర్యం కలగక మానదు.
వెయ్యి కూడా లేని.. అభ్యర్థుల సంఖ్య!
భారతదేశపు మొదటి రెండు సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య 45. అది 2019,17వ లోక్‌సభ ఎన్నికల నాటికి 726కి చేరింది. ఇది మొత్తం అభ్యర్థుల్లో కేవలం 9 శాతం. మరోవైపు లోక్‌సభకు పోటీ చేస్తున్న పురుష అభ్యర్థుల సంఖ్య 1957లో 1,474 ఉండగా, 2019 నాటికి 7,322 వరకు పెరిగింది. ప్రస్తుత 18వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికలలో ఇప్పటి వరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. మొత్తం 381 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ పూర్తయింది. ఈ మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీల తరపున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య వెయ్యి కూడా దాటేలా లేదు. దేశ జనాభాలో 58 కోట్లకు పైగా ఉన్న మహిళలను చట్ట సభల్లో పోటీ చేయించేందుకు పార్టీలు కేటాయించే సీట్లు అంతంత మాత్రమే. దేశంలో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ ప్రకటించిన సీట్లలో 16 శాతం, జాతీయ కాంగ్రెస్ 13 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయించారు. ప్రధాన పార్టీలే మహిళలకు సీట్లు కేటాయించే విషయంలో ఇలా ఉంటే మిగతా పార్టీల సంగతేంటో మనం ఊహించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలకు 525మంది అభ్యర్థులు పోటీ పడగా.. ఇందులో ప్రధాన పార్టీలు మహిళలకు కేటాయించిన సీట్లు కేవలం ఆరు. తెలంగాణలో పోటీ చేస్తున్న మొత్తం మహిళా అభ్యర్థులు రెండు శాతం దాటడం లేదు. ఇక ఇందులో గెలిచి లోక్ సభలో అడుగు పెట్టేది ఎందరో..!
ఈ బిల్లు అమలయ్యే వరకు..
మహిళలకు కేటాయించిన సీట్లలో వారు గెలిచిన సంఖ్యే లోక్ సభలో వారి ప్రాతినిధ్యాన్ని చూపిస్తుంది. పోటీలో ఉన్నంత మాత్రాన వారు ఎన్నికైనట్లు కాదు. 17వ లోక్ సభకు 726 మంది మహిళా అభ్యర్థులలో పోటీ చేస్తే కేవలం 78 మంది మాత్రమే గెలిచారు. ఇది మొత్తం సభలో 14.4 శాతం. అలాగే ఇప్పుడున్న రాజ్యసభలో మహిళా సభ్యుల సంఖ్య కేవలం 11 శాతానికి పరిమితం అయింది. ప్రస్తుతం నిర్వహించబడుతున్న లోక్ సభ ఎన్నికలలోను గెలిచే మహిళా అభ్యర్థుల సంఖ్య కొంచెం అటు ఇటుగా మారినా, 15 శాతానికి మించదనేది నిర్వివాదాంశం. మొత్తం పార్లమెంట్లో సభ్యుల సంఖ్య 790 ఉంటే, మహిళా ప్రతినిధుల సంఖ్య ఎప్పుడూ రెండంకెలు దాటలేదు. ఎన్నో అంతరాలు, అవాంతరాలు, అసమానతలు వీటన్నింటినీ అధిగమించాలంటే మహిళలు విధాన నిర్ణయాలలో భాగస్వాములు కావడం తప్ప వేరే మార్గం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అయ్యేవరకు చట్టసభల్లో వారికి దక్కాల్సిన వాటా దక్కేలా లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు గత సంవత్సరం పార్లమెంటు ఆమోదం పొందినా.. అమలయ్యేది మరో ఐదేళ్లకు కాబట్టి 2029 వరకు వారికి కేటాయించిన 33 శాతం రిజర్వేషన్ అమలు కాదనేది జగమెరిగిన సత్యం. అంతవరకు వారి అసంపూర్ణ ప్రాతినిధ్య సభలనే మనం చూడాల్సి వస్తుంది.
-డాక్టర్ సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి
9849618116