- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పుడమిలో ప్రభవించిన భారతరత్నం
పీవీ తెలుగు సంస్కృతికి తావి... బహు భాషలు పల్కును మీ మోవి... నవోదయ విద్యాలయాల రూపశిల్పివి.. రాజకీయ మేధావి పరిణితి చెందిన పరిపాలనదక్షుడివి... దక్షతతో దక్షిణాది నుంచి ఎన్నికైన తొలిప్రధానివి... మీ ఆర్థిక సంస్కరణల ఆలంబనగా అంతర్జాతీయ స్థాయిలో అందలం ఎక్కింది భారతదేశపు ఠీవి. మా ముద్దుబిడ్డవు, భారతరత్న నీవే. పీవీ తెలంగాణ పుడమిలో పొదువుకోబడ్డ అమరజీవి. మాన్య మనస్వీ... తెలుగు జాతి యశస్వీ...
వివిధ సంస్కృతులు, భాషలు సంగమించే చోట పెరిగిన వారిలో అద్భుతమైన వైవిధ్యం వెల్లివిరియటమే కాక, అనంతమైన సృజనకు దారితీస్తుందని పెద్దల మాట! పీవీగా అందరూ అభిమానంతో పిలుచుకునే పాములపర్తి వెంకట నరసింహారావు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు. తర్వాత భీమదేవరపల్లి మండలం వంగరలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలకు దత్తత రావడంతో ఆయన ఇంటిపేరే మారిపోయింది. అలా కరీంగనర్ జిల్లా దత్తపుత్రుడిగా వచ్చి.. రాజకీయాల్లో ఓ శిఖర సమానంగా భారతదేశ తొమ్మిదవ ప్రధానిగా ఎదిగారు! వారు 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు.
చదువులమ్మ కెమ్మోవి పీ.వీ
పూనాలో ఫెర్గుసన్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్., అలాగే నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి., ఇంకా హిందీలో సాహిత్యరత్న… మూడు డిగ్రీలు మూడు విభిన్న అంశాలు! తెలుగు, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీషు, హిందీ, పార్సీ, స్పానిష్ భాషలు బాగా వచ్చు. ఈ ఏడు మాత్రమే కాక మరో ఐదు భాషలు కన్నడ, పంజాబీ, ఫ్రెంచి, సంస్కృతం, భోజ్ పురి బాగా తెలుసు! ఇవి మొత్తం 12 భాషలు. మూడు పాతికలు పైబడిన తర్వాత కంప్యూటర్ తెలుగు లిపి నేర్చుకోవడం వారి నిత్య అధ్యయనానికి, నిరంతర పట్టుదలకు మచ్చుతునక! తత్వశాస్త్రం, సంస్కృతి, సాహిత్యం అంటే చాలా ఇష్టం. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయి పడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరిట హిందీలోకి అనువాదం చేశారు. అలాగే మరాఠీలో గొప్ప నవలగా పేరొందిన హరినారాయణ ఆప్టే గారి నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేటో’ను ‘అబల జీవితం’గా తెలుగులోకి అనువదించారు. తన స్వీయ కథను కాల్పనిక నవల ‘ఇన్ సైడర్’గా రచించారు. ‘అయోధ్య’ పేరుతో మరో వచన గ్రంథాన్ని వెలువరించారు. పీ.వీ. మౌనం విలువ తెలిసిన మహర్షి! మౌన ఋషి!! మౌనంగా ఎలా పనిచేయాలో ఆయనకు బాగా తెలుసు!
1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందే న్యాయశాఖ, జైళ్ల శాఖ, దేవదాయ, ఆరోగ్యం, విద్య శాఖలను మంత్రిగా పర్యవేక్షించారు. అలాగే 1991లో భారతదేశ ప్రధానమంత్రి అయ్యే ముందు విదేశాంగ వ్యవహారాల, హోంశాఖ, రక్షణ శాఖలతో కేంద్ర మంత్రిగా పని చేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కాదు ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా కూడా సేవలందించారు. ఇరవయ్యేళ్లుగా ఎన్నికలు లేకుండా సాగిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత ఎన్నికలు జరిపించిన ప్రజాస్వామ్యవాది.
సంస్కరణల ధురంధరుడు
1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. కానీ, ఆ సమయంలో అది ఓ ముళ్ల కిరీటం. స్థిరత్వం లేని ప్రభుత్వం. దీనికి తోడు చిక్కి శల్యమై చితిపైకి చేరిన ఆర్థిక వ్యవస్థ. కానీ, పీవీ తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని దీటుగా ఎదుర్కొన్నారు. ఓ వైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనారిటీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే.. మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లో పెట్టారు. నిజానికి పెద్ద హడావుడి లేదు, సంరంభం లేదు, ప్రచారపు ఆర్భాటం లేదు! ఈడీఆర్ఏ అంటే ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ – 1951 చట్టం నిశ్శబ్దంగా రద్దు చేయబడింది. ఇది పీవీ నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలకు తొలి అడుగు. పారిశ్రామికంగా ఔత్సాహిక ప్రయత్నం ప్రారంభం కాగానే ఎదురయ్యే ఈ తొలి నిబంధన చాలా రకాల నిబంధనలకు మూల బిందువు లాంటిది. చాలా మౌనంగా పని చేసుకుపోవాలని వాంఛించే నరసింహారావు గారి వ్యవహార శైలికి దర్పణం ఈ సంఘటన. దివాలా తీసే స్ధాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేశారు. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటారు.. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే.
అపర చాణక్యుడి ప్రస్థానం
పీవీ నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరిన ఆయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించారు. 1957లో శాసన సభ్యుడయ్యారు. తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వున్నారు . 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలలో పనిచేశారు.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445