పంద్రాగస్టు పండుగనా? విషాదమా?

by Ravi |   ( Updated:2023-08-15 00:15:06.0  )
పంద్రాగస్టు పండుగనా? విషాదమా?
X

గంగా నది తీరమే కాదు, సింధునది తీరంలోనూ సనాతన ధర్మం, సంస్కృతి వికసించింది. సింధు, ముల్తాన్ వంటి ప్రదేశాలలో మన వేదాలు రాశారు. పాకిస్తాన్ హిందువులకు కూడా పవిత్రమైనదే కానీ దురదృష్టవశాత్తు 1947లో వాటిని మనం కోల్పోయాం. ముందుచూపు లేకపోవడం వల్లనో, ముస్లిం లీగ్ బెదిరింపులకు తలొగ్గడం వల్లనో, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించుకున్నాం. ఈ దేశ విభజన భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే మానవత్వానికి మాయని మచ్చ..

అఖండ భారత్‌ను సమర్థిస్తూనే..

పాకిస్తాన్‌లో ఉన్న మైనారిటీలను పూర్తిగా వదిలివేయమని, ఆపత్కాలంలో ఆదుకుంటామని విభజన సమయంలో గాంధీ, నెహ్రూ లాంటి కాంగ్రెస్ నాయకులు వారికి హామీలు ఇచ్చారు.. అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకులు అనేక తీర్మానాల ద్వారా అఖండ హిందుస్థాన్ విభజన జరగదని హామీ ఇచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మక మహాసభలు 1929 - 30లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగాయి. డిసెంబర్ 31న ఆయన మన దేశ ప్రజల చేత సంపూర్ణ స్వాతంత్ర ప్రతిజ్ఞ చేయించాడు. ఆ జాతీయ లక్ష్యం పట్ల నిబద్ధతకు పావన రావీనది జలాలే సాక్షాలు. 1940లో ముస్లిం లీగ్ పాకిస్తాన్ ఏర్పాటు తీర్మానాన్ని తమ సమావేశాల్లో ఆమోదించింది. దీనికి గాంధీజీ స్పందిస్తూ ఈ ద్విజాతి సిద్ధాంతం ఒక అసత్యం, దేశ విభజన అన్నమాటే అబద్ధం, విభజించడం మహా ఘోరం, ఇది సహించరాని దేహ ఖండన.. దానికంటే ముందు నన్ను ఖండించండి అని అన్నారు. 1942 కాంగ్రెస్ అలహాబాద్ సమావేశాల్లో పండిత్ జగత్ నారాయణ ప్రతిపాదించిన అఖండ హిందూస్తాన్ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంతో కాంగ్రెస్ ఈ దేశ ఏకత్వం పట్ల తన విశ్వాసాన్ని, విభజన పట్ల వ్యతిరేకతను గట్టిగా చెప్పింది. 1945లో కాంగ్రెస్ పార్టీకే చెందిన డా. రాజేంద్రప్రసాద్ జైల్లో ఉన్న రోజుల్లో ఇండియా డివైడెడ్ అనే పుస్తకంతో పాకిస్తాన్ డిమాండ్‌ను విశ్లేషించి ఏ విధంగా ఆచరణ సాధ్యం కాదో నిరూపించారు.. కానీ 1947 జూన్ 3న నూతన రాజప్రతినిధిగా వచ్చిన మౌంట్ బాటెన్ అధికార బదలాయింపు పథకం ప్రకటించాడు. దీని ప్రకారం దేశ విభజనను నిర్ణయించారు.

1947 జూన్ 15 నాడు ఏఐసీసీ ఒక తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానం మొదటి పేజీలో కాంగ్రెస్ ఇలా రాసుకుంది. ‘పర్వతాలు, సముద్రాలు, మైదానాలు, నదులు వంటి భౌగోళిక పరిస్థితులు సహజంగా భారతదేశాన్ని అఖండ భారత్‌గా తీర్చిదిద్దాయి. కృత్రిమంగా దీనిని విడగొట్టలేము. అఖండ భారత చిత్రం మన హృదయాంతరాలలో నిలిచిపోయింది. దానిని ఎవరూ చెరిపి వేయలేరు. ప్రస్తుత ఆవేశాలు చల్లారిన మీదట ఈ సమస్యలను సరియైన రీతిలో పరిష్కరించుకొని, ద్విజాతి సిద్ధాంతం అసత్యం అనే విశ్వాసంతో మళ్లీ కలుస్తామని ఏఐసీసీ విశ్వసిస్తుంది’ అని రాసుకుంది.

వారికి ఉత్సవం కాదు..

కానీ దేశ విభజన ఫలితంగా 10 లక్షల మంది హిందువులు, సిక్కులు, ముస్లింలు మత మౌఢ్యుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. తమ ఇళ్లను, ఊర్లను వదిలి లక్షల మంది హిందువులు శరణార్థులుగా భారత్ చేరారు. లక్షల మంది హిందువులు, సిక్కులు తరతరాలుగా ఉన్నటువంటి తమ ఇల్లు, ఆస్తులు, ఊర్లు వదలలేక అయితే ముస్లింల చేతిలో చంపబడ్డారు లేదా మతం మార్చబడ్డారు.. ఇంతటి విషాదం జరుగుతుండగానే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌కు స్వాతంత్రం వచ్చింది. దీనికి ఒక్కరోజు తర్వాత 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వతంత్రం వచ్చింది..

లక్షలాదిగా హిందువులు, సిక్కుల మానప్రాణాల హరించిన తర్వాత సిద్ధించిన ఈ అసంపూర్ణ స్వాతంత్రం మనం పండుగలాగా చేసుకోవాలా? అసహజమైన, అనవసరమైన దేశ విభజనకు ఒప్పుకొని స్వాతంత్ర భారతవానికి తాను రూపశిల్పిగా ప్రధాని పదవి, అధికారం ద్వారా హిందుస్థాన్‌ను ఏలాలనే కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ అత్యాశకు బలైన లక్షలాది మంది ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఈ విషాద విభజనతో చనిపోయిన వాళ్ళ ఆత్మలు మనల్ని ఇప్పటికీ అడుగుతున్న ప్రశ్న ఇదే! మీరు భారత్‌లో ఉండి ఆగస్టు 15న ఉత్సవంగా జరుపుతున్నారా? మేము పాకిస్తాన్లో ఉన్న హిందువులం.. పాకిస్తాన్లో ఉన్న హిందువులకు ఆగస్టు 14 గానీ 15 గానీ విషాదమే గాని.. ఉత్సవం కాదు. మా హృదయాలు ఎంతగా కృశించి పోయాయో మీరు ఎప్పుడైనా ఊహించారా? ఈ రెండు రోజులు మాకు సమస్యలను, మృత్యువును ఎదుర్కొనే రోజులే గానీ ఉత్సవాలు జరుపుకునే రోజులు కాదు..

(సేకరణ: హెచ్.వి శేషాద్రి రచించిన ‘దేశ విభజన విషాదగాథ’ గ్రంథం నుండి)

శంకరోళ్ల రవికుమార్

బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ప్రతినిధి,

96423 26411

Advertisement

Next Story

Most Viewed