తెలుగు సినిమా పాట విశేషం

by Mahesh |
తెలుగు సినిమా పాట విశేషం
X

న దేశ సినిమాల్లో పాత్రలు ఎంత ముఖ్యమో పాటలు అంతే ముఖ్యమయ్యాయి. సినిమా పాట మన ప్రజలకు ఎంతగానో చేరువైంది ఆపై ప్రజలతో మమైకమై పోయింది. దేశంలోని అన్ని భాషల సినిమా పాటల్లోనూ గొప్ప కవులు ఉన్నారు; గొప్ప కవిత్వం ఉంది. వాటిలో తెలుగు సినిమా పాట విశేషమైంది. తెలుగు సినిమా పాట, సినిమా కవుల విశేషాన్ని స్మరించుకుందాం.

1. దక్షిణ భారతదేశ భాషల సినిమాలో తెలుగు, తమిళ్ష్ భాషల పాటలు ఒకేసారి, ఒకే సినిమాతో వచ్చాయి. 1931లో వచ్చిన కాళిదాసు సినిమాతో తొలి తెలుగు సినిమా పాట మొదలైంది. "ఎంతరా నీదాన ఎందుపోదునో/ చింత విడువజాల శ్రీ రామ" అనే పల్లవితో మొదలయ్యే పాట తొలి తెలుగు సినిమా పాట. అజ్ఞాత కవి రాసిన పాట అది.

2. సాహిత్య ప్రమాణాల పరంగా 1960వ దశాబ్ది వరకు దక్షిణాదిలో తెలుగు సినిమా పాటే ఉన్నతమైంది. సముద్రాల రాఘవాచార్య, పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ ముగ్గురూ తెలుగు సినిమా పాటను ఇతర దక్షిణాది సినిమా పాటల కన్నా గొప్పగా నిలిపారు. దేవదాసు, మాయాబజార్ వంటి సినిమాల విషయంలో తమిళ్ష్‌ పాటలు తెలుగు పాటల స్థాయిలో లేవు. శ్రీశ్రీ రాసిన "కలకానిది విలువైనది..." పాటకు ప్రత్యామ్నాయంగా తమిళ్ష్‌లో వచ్చిన పాట తెలుగు పాటకు దీటుగా నిలవలేదు.

3. ప్రపంచంలో ఫార్సీ కవిత్వం విశేషమైంది అని జర్మనీ దేశపు పరిశీలకుడు గ్యోటా (Goetha) చెప్పాడు. ఆ ఫార్సీ కవిత్వ ధోరణిని మన మల్లాది రామకృష్ణశాస్త్రి దక్షిణాదికి తొలిసారి సినిమా పాట ద్వారా తీసుకు వచ్చారు. "చినికిన చినుకెల్లా‌‌ మంచి ముత్యము కాదు / మెరసిన మెరుపులో లేత వెన్నెల లేదు" అని చివరికి మిగిలేది సినిమాలోని‌ "చెంగూన అల మీద.." పాటలో రాశారు మల్లాది. ఫార్సీ‌ కవిత్వంతో‌ పరిచయం ఉన్నవాళ్లు ఇంత గొప్పగా రాయగలరు. చినికిన చినుకెల్లా మంచి‌ ముత్యము కాదు అని అన్నాక అలాంటి లేదా‌ దానికి మించిన‌ పాదం రాయడం మామూలు విషయం కాదు. అలాంటిది‌ ఆ పాదం రాశాక "మెరసిన‌ మెరుపులో‌ లేత వెన్నెల లేదు" అనగలగడం మహోన్నతం. మెరుపులో‌ లే‌ని దాన్ని చెప్పగలగడం తలపు మెరుపు. ఫార్సీ, ఉర్దూ గజళ్లలో ఈ తరహా భావనలూ,‌ పాదాలూ ఉంటాయి. ఇది గజలియత్‌ లేదా గజల్‌తనం. గజలియత్‌ను తొలుత దక్షిణాదికి తెలుగు సినిమా కవి మల్లాది రామకృష్ణశాస్త్రి తీసుకువచ్చారు. దేవదాసు సినిమా పాటల్లోని "మరపురాని బాధకన్నా మధురమే లేదు...", "గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు...", "బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్..." వంటి అభివ్యక్తులు గజలియత్ లేదా గజల్‌తనం. గజలియత్ దక్షిణాది భాషల సినిమా పాటల్లో తొలిగా తెలుగులోనే వచ్చింది.

4. దక్షిణాదిలోనే కాదు మన దేశ సినిమాలోనే పూర్తి సంస్కృతం పాట తొలిసారి తెలుగులోనే వచ్చింది! 1948లో వచ్చిన రత్నమాల సినిమాలో "ఆనంద దాయిని ..." పాట అది‌. మన దేశపు సినిమాల్లో సంస్కృతం పాటలు ఎక్కువగా తెలుగులోనే వచ్చి ఉంటాయి.

5. తెలుగు సినిమా కవి ఆత్రేయ మనసుకవి. మనసుపై, మనసు గురించి, మనసుకు సంబంధించి ఆత్రేయ రాసినంత గొప్పగా, ఎక్కువగా కవిత్వం దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఏ కవీ, ఏ రూపంలోనూ రాసుండడు.

6. ఆత్రేయపై తమిళ కవి కణ్ణదాసన్ ప్రభావం ఉందని మనకు తెలిసిందే. ఆ కణ్ణదాసన్‌పై ఆత్రేయ ప్రభావమూ ఉంది. ఆత్రేయ రాసిన "నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి" ని కణ్ణదాసన్ యథాతథంగా తీసుకున్నారు.

7. ప్రపంచంలో ఒక సినిమా కవి ఒక భాష సమగ్ర సాహిత్య చరిత్ర రాయడం అన్న ఘన సాధన ఒక్క తెలుగు సినిమా కవికి మాత్రమే సాధ్యపడింది. తెలుగు సినిమా కవి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను రాశారు.

8. దక్షిణాది భాషల సినిమాలో తొలిసారి గజల్‌ను తెలుగు కవి సి. నారాయణ రెడ్డి రాశారు. 1979లో వచ్చిన అక్బర్ సలీం అనార్కలి సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన "తానే మేలి ముసుగు తీసి ఒక జవ్వని పువ్వు లాగా నవ్వుతుంటే ఏం చేయను" పాట దక్షిణాది భాషల్లో వచ్చిన తొలి గజల్.

9. ఇతర భాషల్లో వచ్చిన సినిమా పాటలకు ప్రత్యామ్నాయంగా వేటూరి రాసినప్పుడు వేటూరే మేలుగా నిలిచారు. అమావాస్య చంద్రుడు సినిమాలో కణ్ణదాసన్ రాసిన సందర్భానికి వేటూరి "కళకే కళ ఈ అందమూ.." పాట కణ్ణదాసన్‌కన్నా గొప్పగా రాశారు. వేటూరి రాసిన "రవివర్మకే అందని ఒకే ఒక అందానివో.." పాట ముందుగా కన్నడంలో ఆర్.ఎన్. జయగోపాల్ రాసిన పాట. జయగోపాల్‌కన్నా వేటురే మేలుగా రాశారు. కన్నడ రాష్ట్ర కవి జీ.ఎస్. శివరుద్రప్ప రాసిన ఒక పాట సందర్భానికి, బాణికి తెలుగులో అమాయకచక్రవర్తి సినిమాలో వేటూరి ఆయనకన్నా గొప్పగా రాశారు. "వేదాంతమంటున్నది జగమంతా స్వప్నం, స్వప్నం/ కవి స్వాంతమంటున్నది జగమంతా స్వర్గం, స్వర్గం" పాట అది. మల్లెపూవు సినిమాలో "ఎవ్వరో ఎవ్వరో.." అంటూ వేటూరి రాసిన వేశ్యా వాటికలోని పాట హిందీ మూలం ప్యాసా సినిమాలో సాహిర్ లూధియాన్వీ రాసిన "ఏ కూచేన్ ఏ నీలామ్ ఘర్ దిల్ కషీ కే.."(జినే నాజ్ హేన్ హింద్ పర్) పాట కన్నా గొప్పది. "ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో/ ఏ కర్మం ఈ గాయం చేసిందో" వంటి గొప్ప పంక్తులతోనూ, "ఎవ్వరో, ఎవ్వరో.. ఎక్కడో, ఎక్కడో.. ఎప్పుడో, ఎప్పుడో .." అంటూ గొప్ప శిల్పంతోనూ ఆ పాటను రాశారు వేటురి.

10. విప్లవ శంఖం సినిమాలో శ్రీశ్రీ రాసిన "మూయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం..." వంటి విప్లవ గీతం మన దేశ సినిమాలో మరొకటి ఉండకపోవచ్చు. "సాయంకాలపు ఉరికంబం తెల్లవారితే రవి బింబం" అనీ, "బ్రతుకు సంతలో ముళ్లపుంతలో/ ఎండు డొక్కలే ఎర్రమల్లెలై.." అనీ అంటూ గొప్పగా రాశారు శ్రీశ్రీ ఆ పాటను.

11. రుద్రవీణ సినిమా పాటలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన తమిళ్ష్‌ పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలకు దీటైనవి కావు.

12. మన దేశ డబ్బింగ్ కవులలో తెలుగు కవి రాజశ్రీ కి దీటైన కవి ఇంకో భాషలో ఉండకపోవచ్చు. రాజశ్రీ డబ్బింగ్ పాటల్ని చాలా గొప్పగా రాశారు. సాధ్యమైనంత వరకూ మూలభాష కవుల భావాల్ని తీసుకోకుండా సమర్థవంతంగా డబ్బింగ్ పాటల్ని రాశారు ఆయన. ప్రేమ సాగరం డబ్బింగ్ సినిమాలో "చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి/ ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను" అంటూ మూలం కన్నా గొప్పగా రాశారు. గోపీ, వీటూరి వంటి తెలుగు కవులు డబ్బింగ్ పాటల్ని మూలాలకు అతీతంగా ప్రతిభావంతంగా రాశారు. తూర్పు సింధూరం అన్న డబ్బింగ్ సినిమాలో సీతారామశాస్త్రి "తల వాకిట ముగ్గులు వేకువకే అందం/ శ్రుతి కుదరని పాటకు లేదు కదా అందం/నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం/ తత్తితరిగిడ తరిగిడ తరిగిడ తధిగిణతోం" అంటూ తమిళ మూలంలో కవి వాలి రాసిన దానికి అతీతంగా అంతకన్నా మిన్నగా రాశారు.

13. అంతర్జాతీయ స్థాయి తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ. విశ్వ కవిత్వంపై, అభివ్యక్తి విధానంపై సరైన, మేలైన అవగాహన ఉన్న కవి ఆయన. ముత్యాల ముగ్గు సినిమాలో "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది/ కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది" అంటూ ఒక గొప్ప పాట రాశారు. సినిమాలో నాయిక పరిస్థితికి తగిన కావ్య స్థాయి, అంతర్జాతీయ స్థాయి అభివ్యక్తి ఆ పాట.

14. నేపథ్య గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక కవి కూడా. మంచిరోజు సినిమాలో "చెప్పాలనుంది చెప్పేదేలా..." పాటా, "నీ కోసమనే నే వేచినానే..." పాటా, "అనుకున్నా నేనని వేరెవరూ కారని..." పాటా, "తల్లీ తండ్రీ ఉండీ కూడా..." పాటా, "చిలిపికన్నుల చిన్నదానా...", పాటా, "నా పేరే కవ్వించే జవానీ..." పాటా, "బృందావనమే నీ హృదయం..." వెరసి ఏడు పాటలు రాశారు. రెండు పాటలు అప్పలాచార్య రాసినట్టు పాటల రికార్డ్‌పై ఉంది. సినిమా టైటిల్స్‌లో పాటల రచయితగా అప్పలాచార్య పేరు లేదు; ఆత్రేయ పేరు ఉంది. రికార్డ్‌పై ఏ పాటా ఆత్రేయ పేరుతో లేదు. నిజానికి అప్పలాచార్య, ఆత్రేయ ఈ సినిమాలో పాటలు రాయలేదు. పి.బి. శ్రీనివాస్ సినిమా కవిగా కొన్ని విశేషాలను చేశారు. ఒక మలయాళం సినిమాలో ఇంగ్లిష్ పాటను రాశారు. భాగ్యజ్యోతి అన్న కన్నడం సినిమాలో "పంకజ నేత్రీ మధుమయ గాత్రీ..." అంటూ ఒక సంస్కృతం పాటను రాశారు. ఆ పాటలో "ప్రణయ చంద్రికా ధవళిత రాత్రీ" అని అన్నారు. ఇలా అనడం సంస్కృత కావ్య స్థాయి. శనిప్రభావ అన్న మరో కన్నడం సినిమాలో "శ్రీరామ సుగుణాభి రామా..." అంటూ సంస్కృతం పాట రాశారు. మక్కళ భాగ్య అన్న కన్నడం సినిమాలో కన్నడం, హిందీ, తమిళ్ష్, తెలుగు నాలుగు భాషల పాటగా ఒక పాటను రాశారు. పి.బి. శ్రీనివాస్ తమిళ్ష్ సినిమాల్లో హిందీ పాటలు రాశారు. వాటిల్లో ఒకటి ఆకలి రాజ్యం పేరుతో తెలుగులోనూ వచ్చింది. ఆకలి రాజ్యంలో ఆయన రాసిన హిందీ పాట "తూ హేన్ రాజా మైహూన్ రానీ/ ఫిర్ భీ నహీన్ హై బాత్ పురానీ" అంటూ మొదలౌతుంది. నువ్వు రాజువు, నేను రాణిని/ ఆయినా సంగతి పాతది కాదు అని అర్థం. ఇది గజల్ అభివ్యక్తి. ఉర్దూ గజల్ షేర్‌లలో తొణికసలాడే దావా దలీల్ టెక్నిక్‌లో ఈ పంక్తుల్ని రాశారు. సిరివెన్నెల సినిమా మాటలు, పాటల్ని పి.బి. శ్రీనివాస్ హిందీలోకి డబ్ చేశారు. మనదేశంలో పి.బి. శ్రీనివాస్ మాత్రమే వేరు వేరు భాషల సినిమాల్లో వేరు వేరు భాషల పాటలు రాసిన కవి.

మన దేశ భాషల సినిమాలో తెలుగు కవులు, పాటలు విశేషం. దేశ భాషల సినిమాలో చంద్రబోస్ రాసిన తెలుగు పాటకు అంతర్జాతీయ పురస్కారం ఆస్కర్ వచ్చింది. ఇది పెద్ద విశేషం. ఆస్కర్ పురస్కారంతో తెలుగు సినిమా పాట అంతర్జాతీయమైంది. శంకరాభరణం సినిమా పాటల సాహిత్యం దేశంలో, దేశదేశాల్లో విశేషమైంది. ఒక దశ తర్వాత ముఖ్యంగా 1980 దశాబ్ది నుంచి తెలుగులో కవిత్వం, మంచి, గొప్ప కవిత్వం ఎక్కువగా సినిమా పాట ద్వారానే వచ్చింది. 1990 తర్వాత సీతారామశాస్త్రి కారణం కాగా తెలుగులో పరిగణననీయమైన కవిత్వం సినిమా పాట ద్వారానే వచ్చింది. తెలుగులో గత కొన్ని దశాబ్దాలుగా ప్రచురణల్లో, సభల్లో, సమ్మేళనాల్లో వచ్చిన కవిత్వం అన్న దాన్ని ప్రజలు వదిలించుకున్న పరిస్థితిలో కవిత్వాన్ని, మంచి, గొప్ప కవిత్వాన్ని ప్రజలకు తెలుగులో సినిమా పాట అందించింది. అదే ప్రజలకు నప్పింది; నచ్చింది. రానున్న రోజుల్లో కూడా తెలుగులో మేలైన కవిత్వం సినిమా పాట ద్వారానే వస్తుందేమో.

Read More..

కావడి యాత్రలో ఎందుకీ రభస?


రోచిష్మాన్

9444012279



Next Story