మహా విధ్వంసానికి సజీవ సాక్ష్యం ‘ఫర్హా’

by Ravi |   ( Updated:2023-11-11 01:00:54.0  )
మహా విధ్వంసానికి సజీవ సాక్ష్యం ‘ఫర్హా’
X

పాలస్తీనా మూలాలుగల జోర్డాన్‌ దర్శకురాలు దారిన్‌ జె. సల్లామ్‌. అరబిక్‌ భాషలో ఆమె నిర్మించిన మొదటి కథా చిత్రం ‘ఫర్హా’. ఆమె అంతకు ముందు ఐదు లఘు చిత్రాలు నిర్మించింది. అవన్నీ చాలా అవార్డులు సంపాదించుకున్నాయి. ‘ఫర్హా’కి కూడా అవార్డులకూ, ప్రశంసలకూ కొదువలేదు. కానీ ఈ సినిమా రిలీజై ఇజ్రాయెల్‌లోని అల్‌ సరయా థియేటర్లో ప్రదర్శించినపుడూ, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేసినపుడూ ఇజ్రాయెల్‌ పాలకులు విరుచుకుపడుతున్నారు. ఈ సినిమాలో చూపిన సంఘటన ప్రస్తావన ఎవరు తీసుకొచ్చినా యూదు జాత్యహంకారులకు కలవరం మొదలౌతుంది. అగ్గిమీద గుగ్గిలమైపోతారు. 1948లో ఏమీ జరగలేదన్నట్టు బుకాయిస్తారు. ఇంతకీ, 1948లో జరిగిన ఆ సంఘటనేమిటి అది తెలుసుకుంటే ఈ సినిమా అర్థమౌతుంది.

పాలస్తీనా పూర్వ చరిత్ర

పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి క్రమంలో మధ్యప్రాచ్యంలో చమురు నిల్వలు కనుగొనబడినపుడు బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల కళ్లు ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లకు కూడలి స్థలం వంటి కీలకమైన పాలస్తీనాపై పడ్డాయి. ఒట్టోమాన్‌ సామ్రాట్టును ఓడించడంలో తమకు సహకరిస్తే సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకోవడంలో సహకరిస్తామని బ్రిటీషు వారు అరబ్బులకు హామీలిచ్చారు. కానీ తమ సొంత మతస్తుడైన ఖలీఫాను ఓడించిన అరబ్బులకు చివరికి మిగిలింది ఒట్టిచేయి మాత్రమే. ప్రపంచయుద్ధం ముగియక ముందే జోర్డాన్‌ పాలస్తీనా బ్రిటన్‌కీ, లెబనాన్‌ ` సిరియా ఫ్రాన్సుకీ దక్కేటట్టు వంతులు వేసుకున్నారు. ఆ కీలక ప్రాంతంలో తమ అనుకూల తొత్తు రాజ్యం ఏర్పాటు కోసం పావులు కదిపారు బ్రిటీషువారు. యూరప్‌లోని యూదు వ్యతిరేక భావనలకు విరుద్ధంగా ఒక కరుడుకట్టిన యూదు దురహంకార సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు వియెన్నాలోని పాత్రికేయుడు థియొడార్‌ హెర్జల్‌. ‘గొప్ప యూదు రాజ్య’ స్థాపనే లక్ష్యంగా ప్రకటించుకున్న ఈ మితవాద యూదు సిద్ధాంతానికి ‘జియోనిజం’ అంటారు. తాము పాలించిన ప్రతి ప్రాంతంలోనూ ‘విభజించి పాలించు’ విధానాన్ని ప్రయోగించడం బ్రిటీషర్లకు కొట్టిన పిండి.

దీంట్లో భాగంగానే పాలస్తీనా భూబాగంలోకి జియోనిస్టు వలసల్ని ప్రోత్సహించింది బ్రిటన్‌. ఈలోగా పాలస్తీనా ప్రజలు రాజ్యపాలన పద్ధతులు నేర్చుకునే వరకూ తామే పరిపాలన చేసే అధికారాన్ని (British Mandate 1923 – 1948) బ్రిటీషు వారు తమ చేతి కీలుబొమ్మ అయిన నానాజాతి సమితి నుండి దక్కించుకున్నారు. భారీగా యూదులు వలస రావడంతో 1922 నుండి 1935 మధ్యకాలంలో యూదుల జనాభా తొమ్మిది శాతం నుండి 27 శాతానికి పెరిగిపోయింది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా తిరగబడ్డ పాలస్తీనా అరబ్బులను బ్రిటీషు వారూ, జియోనిస్టులూ కలిసి క్రూరంగా అణిచివేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం 1947లో పాలస్తీనాను విభజించే పనిని బ్రిటీషువారు ఐక్యరాజ్య సమితికి అప్పగించారు. అప్పటికి పాలస్తీనా జనాభాలో మూడింట ఒకవంతుగా ఉన్న యూదులు (వీరిలో గత ముప్పై ఏళ్లలో వచ్చిన వారే అత్యధికం) ఆరు శాతం భూభాగానికి అధికారులుగా వున్నారు. వాస్తవం ఇలా వుంటే ఐక్యరాజ్య సమితి యూదులకు 52 శాతం నేలను, పాలస్తీనా అరబ్బులకు 45 శాతం నేలనూ, జెరుసలెం - బెతల్‌హాంలను కలిపి పుణ్యక్షేత్రాల కోసం అంతర్జాతీయ పర్యవేక్షణలో 3 శాతం నేలనూ ఉంచాలని కోరింది. యూదులకు ఇచ్చిన భూమిలో హైఫా నుండి జఫా వరకూ ముఖ్యమైన రేవు పట్టణాలూ, వ్యాపార కేంద్రాలూ, వ్యవసాయ భూములూ వున్నాయి. చాలా అరబ్బు మెజారిటీ ప్రాంతాలు ఇజ్రాయెల్‌ వైపు వెళ్లాయి. సహజంగానే ఈ విభజనను పాలస్తీనా అరబ్బులు తిరస్కరించారు.

శరణార్థులుగా వలసపోయిన అరబ్బులు

ఈలోగా 1948 మే 14 అర్ధరాత్రి పూట బ్రిటీష్‌ మేండేట్‌ ముగిసింది. జియోనిస్టు నాయకుడు డేవిడ్‌ బెన్‌ గురియన్‌ తనను తాను ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రిగా ప్రకటించుకున్నాడు. బ్రిటీషు వారు అలా వెళ్లారో లేదో గురియన్‌ పంపిన ముష్కరులు ముందే వేసుకున్న పథకం ప్రకారం పాలస్తీనా గ్రామాల్నుంచి అరబ్బుల్ని తరిమేశారు. హత్యలు చేశారు. మానభంగాలు చేశారు. చిన్నపిల్లల కపాలాలు పగలగొట్టారు. వందలాది గ్రామాల్ని ఖాళీ చేశారు. 15,000 మందిని చంపేసి, 7,50,000 మందిని తరిమేశారు. వీరిలో చాలా మంది చుట్టుపక్కల దేశాల్లో ఈనాటికీ శణార్థులుగా బ్రతుకుతున్నారు. ఈ మారణహోమానికీ, విస్థాపనకూ అరబ్బులు ‘అల్‌(న్‌) నక్బా’ (మహా విధ్వంసం) అని అంటారు. అది ఈనాటికీ సాగుతోందని గాజాపై తాజా దాడులు రుజువు చేస్తున్నాయి. ఈ ‘అల్‌(న్‌) నక్బా’ సందర్భంలోనిదే ‘ఫర్హా’ సినిమా.

సినిమా కథ

అది 1948. ఓ పాలస్తీనా గ్రామం. ‘ఫర్హా’ అంటే అరబిక్‌లో ‘ఆనందం’. జీవితాన్ని మరింత ఆనందంగా, అర్ధవంతంగా మలచుకోవాలని కలలు కనే 14 ఏళ్ల అమ్మాయి ఫర్హా. ఆ వయసు ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తే ఒక పనైపోతుందని భావించే సమాజం. వీలుకాని పరిస్థితుల్లోని ఆ ఆడపిల్లలు కూడా పెళ్లి ఊహల్లోనే గడిపేస్తారు. కానీ ఫర్హా మాత్రం అలా కాదు. మత గురువు వద్ద చదువుకున్న ఖురాన్ తో సరిపెట్టుకోదలుచుకోలేదు. పెద్ద నగరంలోని పాఠశాలలో చేరి ఇంగ్లీషూ, సైన్స్, గణితం, చరిత్ర చదువుకుని, పెద్ద డిగ్రీ సంపాదించి టీచర్‌ కావాలని కోరిక. ఫర్హా తండ్రి ఆ ఊరి పెద్ద. తమ గడ్డపై వున్న గడ్డు పరిస్థితి రీత్యా ఫర్హాకు వివాహం చేయడమే మంచిదని ఆయన తలుస్తాడు. తన బంధువుల అబ్బాయిని ఎంపిక చేసుకుంటాడు కూడా! కానీ ఆమె పట్టుదలకూ, అభ్యర్ధనకూ కరిగి రాజీ కొస్తాడు. ఫర్హాను పాఠశాలలో నమోదు చేసేందుకు రిజిష్ట్రేషన్‌ ఫారం తీసుకొస్తాడు. ‘మా నాన్న ఈ ఊరిలోనే గొప్ప నాన్న’ అని అరుస్తుంది ఫర్హా సంతోషం పట్టలేక. కాని ఆమె చుట్టుపక్కల పరిస్థితులు త్వరితగతిన మారిపోతున్నాయి. బ్రిటీషు వారు ఆ ప్రాంతాల్ని విడిచి వెళ్తుంటే వారిపై రాళ్లు రువ్వే చిన్న పిల్లలు మనకు ఈ సినిమాలో ఓ చోట కనిపిస్తారు. యూదుల రాజ్య స్థాపనకై కంకణం కట్టుకున్న బ్రిటిషర్లపై స్థానికులకు ఎంత ద్వేషం వుందో ఈ దృశ్యం చూపుతుంది.

ఆ రాత్రి స్థానిక పాలస్తీనా మిలీషియా బృందం వారు ఫర్హా తండ్రిని కలిసి, తమ ప్రతిఘటనా యుద్ధంలో భుజంతో భుజం కలిపి పోరాడమని కోరుతారు. కానీ గ్రామ పెద్దగా తమ గ్రామాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే తన బాధ్యతని ఖచ్చితంగా చెప్పేస్తాడతడు. మిలీషియానే కాదు సాధారణ పాలస్తీనా వాసులను కూడా మట్టుబెట్టే ప్రణాళికతో యూదు జాత్యహంకారులు ఉన్నారని మున్ముందు సంఘటనలు తెలియజేస్తాయి. ఆ రోజు మధ్యాహ్నం ఫర్హా తను స్కూళ్లో చేరబోతున్నాననే సంతోష వార్తను తన బంధువూ, బెస్ట్‌ ఫ్రెండ్‌ ఫరీదాతో పంచుకుంటుంటే దూరాన బాంబుల శబ్దాలు వినిపిస్తాయి. పరుగుపరుగున గ్రామానికి వచ్చి చూస్తే గ్రామస్తులంతా చెల్లా చెదురుగా పరుగులు తీస్తూ కనిపిస్తారు. గ్రామాన్ని ఖాళీ చేయమని సైనికులు లౌడ్‌ స్పీకర్‌లలో హెచ్చరిస్తున్నారు. ఫరీదా తండ్రి కారు తీసుకుని హుటాహుటిన వస్తాడు. ఫరీదాతో పాటు ఫర్హాను కూడా కారులో సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని వేడుకుంటాడు ఫర్హా తండ్రి. ఫరీదా తండ్రి సరేనంటాడు. కారు కొంత దూరం వెళుతుండగా, ఫర్హాకు తన తండ్రికి ఏమౌతుందా అన్న భయం పట్టుకుంటుంది. కారు దిగి పరుగున తండ్రి దగ్గరికి వచ్చి ‘నిన్ను విడిచి వెళ్లను నాన్నా’ అనంటుంది. నరసంహారం మధ్యలో తన కుమార్తెను ఎలా కాపాడుకోవాలో అర్థం కాదు ఫర్హా తండ్రికి. ఆమెను తమ ఇంటి వంట గదిలోకి తోసి బయటి నుండి తాళం వేస్తాడు. పరిస్థితి చక్కబడ్డాక వచ్చి తీసుకెళ్తానని చెబుతూ, భుజాన రైఫిల్‌తో బయల్దేరుతాడు ఫర్హా తండ్రి. తన గ్రామవాసులను ఎలా రక్షించాలనేది అతడి ఆలోచన!

అక్కడ్నుంచీ ఆ చీకటి గదిలో కొన్ని రోజుల పాటు ఆమె ఎలా తనను తాను కాపాడుకుంది అన్నదే సినిమాలోని ప్రధానాంశం. తలుపు సందులోంచి, నేలకీ, తలుపుకీ మధ్య గల ఖాళీలోంచి, గోడపై భాగంలో గల చిన్న కన్నంలోంచి మాత్రమే ఆమె బయటి ప్రపంచాన్ని చూడగలదు. ఆ పరిమిత వీక్షణంలోనే ఆమె ఇజ్రాయెల్‌ ముష్కరులు సాగించిన ‘నక్బా’ మారణకాండ ఘాతుకానికి సజీవ సాక్షిగా నిలుస్తోంది. నిజానికి ఫర్హా పరిస్థితి జియోనిస్టులతో దిగ్బంధనం కాబడ్డ పాలస్తీనాకు ప్రతీకలా అనిపిస్తుంది. అబూ మొహమ్మద్‌, ఉమ్‌ మొహమ్మద్‌, వారి ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఒక పాలస్తీనా కుటుంబం ఫర్హా ఇంటి వసారాలోకి వస్తుంది. దూరాన బాంబుల శబ్దాలు వినిపిస్తుంటే ఆ ఆడమనిషి ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఆ మగాడే ప్రసవం చేయిస్తాడు. తనను ఆ గది నుండి విడిపించమని ఫర్హా అతడ్ని కోరుతుంది.

అతడు ప్రయత్నిస్తుండగా అక్కడికి జియోనిస్టు దుండగులు వస్తారు. వారు ఆ కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపేస్తారు. నవజాత శిశువును చంపడానికి బుల్లెట్టును వృధా చేయొద్దని, కాలి బూటుతో తొక్కి చంపేయమనీ యువ సైనికుడితో చెబుతాడు కమాండర్‌. కానీ ఆ అబ్బాయిలో మిగిలిన మానవత్వం ఆ పని చేయనివ్వదు. చివరికి ఆ శిశువు మొహంపై ఒక చేతి రుమాలు వేసి వెళిపోతాడు ఆ యువకుడు. ఊపిరాడక ఆ బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తూ వుంటే, తను బయటపడి ఆ బిడ్డను ఎలా కాపాడాలా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే వుంటుంది ఫర్హా. చివరికి ఆమెకు ఆహార ధాన్యాల మధ్యలో దాచిన పిస్టల్‌ కనిపిస్తుంది. తలుపు తాళంపై కాల్పులు జరిపి మొత్తానికి బయటపడుతుంది. ఆమె బయటికి వచ్చేసరికి ఆ శిశువు శవంపై ఈగలు ముసిరివుంటాయి. ఊర్లోకి వచ్చి చూస్తే ఊరు మొత్తం నిర్మానుష్యంగా ‘ఘోస్ట్‌ విలేజ్‌’లా కనిపిస్తుంది. ఇది జరిగిన సంఘటన ఆధారంగా తీసినదనీ, ఫర్హా తన తండ్రిని ఏనాడూ కనుక్కోలేకపోయిందనీ, బహుశా నక్బాలో అనామకుడిగా తనువు చాలించి వుండొచ్చనీ, ఫర్హా చివరికి సిరియాకు శరణార్ధిగా తరలిందనీ తెరమీద కనిపించే ఎపిలాగ్‌ చెబుతుంది.

జరిగిన కథ ఇది

దర్శకురాలు ఈ కథను తన తల్లి దగ్గర వింది. రదియా అనే సిరియాకు చేరిన శరణార్థి కథ ఇది. రెండో ప్రపంచ యుద్ధానంతర ఆధునిక యుగంలో కూడా ఇజ్రాయెల్‌ తను పాలస్తీనా వాసుల్ని చంపి, వెళ్లగొట్టి ఒక విశాల సెట్లర్‌ రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం నేటికీ సాగిస్తోంది. తమ నేర చరిత్ర ప్రపంచం ముందు బట్టబయలు కావడం ఇజ్రాయెల్‌ పెద్దలకు ఇష్టం వుండదు. ‘‘మా సినిమా సిబ్బంది షూటింగ్‌ సమయంలో మానిటర్‌ చూస్తూ తమ తాతముత్తాతలు చెప్పిన కథలను గుర్తు చేసుకుంటూ విలపించారు’’ - అని దర్శకురాలు ఒక ఇంటర్వ్యూలో తన అనుభవం చెప్పింది.

ఈ సినిమా ఆసియా పసిఫిక్‌ స్క్రీన్‌ అవార్డుల ఫంక్షన్లో ఉత్తమ సినిమా అవార్డును గెల్చుకుంది. ఆస్కారు అవార్డు కోసం ఉత్తమ విదేశీ సినిమాగా జోర్డన్‌ దేశపు ఎంట్రీగా ఎంపికైంది. అమెరికా వాళ్లు దీనికి అవార్డు ఇవ్వరని మనకు తెలిసిందే. ఈ సినిమాకు దొరికిన ప్రపంచ వ్యాప్త ఆదరణకు కృతజ్ఞతలు చెబుతూ - ‘‘ఈ సినిమా ఉనికి మా ఉనికిని తెలుపుతోంది. మా నోరు నొక్కెయ్యడం ఎవరి తరమూ కాదు’’ అంటోంది దర్శకురాలు దారిన్‌ జె. సల్లామ్‌. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది వీక్షించవచ్చు.

- ఐకా బాలాజీ

90077 55403

Advertisement

Next Story