మీకు నచ్చలేదని... నిజాలను అబద్దాలుగా మారుస్తారా?

by Ravi |   ( Updated:2023-06-21 00:01:08.0  )
మీకు నచ్చలేదని... నిజాలను అబద్దాలుగా మారుస్తారా?
X

మీకు నచ్చనంత మాత్రానా నిజాలు అబద్ధాలు కావు ముఖ్యమంత్రి గారు. మీకు అధికారం వుందని నిజాలకు మసిపూసి అబద్దాలుగా మార్చాలంటే సాధ్యపడదు. సమాజం కూడా హర్షించదు. వాస్తవాలకు ఉప్పు పాతరేసి అవాస్తవాలను అందలమెక్కించే శీలహీన సంస్కృతి జగన్ పాలనలో గజ్జెకట్టి నాట్యం చేస్తుంది. తనకు గిట్టని చంద్రబాబు చేసిన అభివృద్ధి ఆనవాళ్లను అబద్దాలతో చెరిపేసేందుకు తెగబడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై మూర్ఖంగా అవాకులు, చెవాకులు పేలుతూ తలబిరుసుతనం, అల్పత్వం, స్వార్ధంతో కాలకూట విషాన్ని చిమ్ముతున్నారు. దీనిని కురస రాజకీయం అనక ఏమనాలి?

అధికారం కోసం అబద్ధాలు..

'ఎన్టీఆర్‌ పుట్టిన గడ్డ అయిన గుడివాడకు చంద్రబాబు ఏమీ చేయలేదని, గుడివాడలో పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 8,912 టిడ్కో ఇళ్లను నిర్మించి ఇచ్చిన'ట్లు సీయం జగన్‌ రెడ్డి గుడివాడ సభలో చెప్పడం పచ్చి అబద్ధం. నిజంగా గుడివాడలోనే కాదు రాష్ట్రంలో కట్టించిన టిడ్కో ఇళ్ళను అన్నిటిని నేనే కట్టించానని ప్రమాణం చేసి జగన్ రెడ్డి చెప్పగలరా? నిజంగానే తెలియని వారు జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లలోనే టిడ్కో ఇళ్లు కట్టించారేమో అని నమ్మవచ్చు.

అబద్దాలతో జనాన్ని బురిడీ కొట్టించడంలో జగన్ నైపుణ్యం అనితర సాధ్యం. కూల్చడం, విడగొట్టడం, చెడగొట్టడం, విధ్వంసం చేయడం, అబద్దాలు, అహంకారం, అరాచకం, అవినీతి జగన్ రెడ్డి ఆభరణాలు. అధికారం కోసం ఏ అబద్ధాలు అయినా ఆయన చెప్పగలరు. జగన్మాయలు, అబద్దాలను ఎప్పటికప్పుడు విపులంగా ప్రజలు విశ్లేషించుకోవాలి. ఎందుకంటే అబద్ధాన్ని అబద్ధం అని విసుగు లేకుండా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ పాలనలో.. ఇటువంటి అబద్దాలను అడ్డుకోకపోతే ప్రజల భవిష్యత్తు మరోసారి అంధకార మౌతుంది. కావున రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి సామాన్య పౌరులు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి, విజ్ఞత ప్రదర్శించవలసిన సమయం వచ్చింది. ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఇటువంటి మాయలు, అబద్దాలు అడ్డుకోవడం సాధ్యపడదు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతూ బరితెగించి నగ్నంగా అబద్ధాలు చెబుతున్నారు.

జగన్ నిర్మించినవేవి!?

గత తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్లను 80 శాతం నుంచి 90 శాతం వరకు పూర్తి చేసింది. కానీ జగన్ రెడ్డి టిడ్కో ఇళ్లను నేనే నిర్మించానని జగన్‌ చెప్పుకొవడం ఏంటి? నాలుగేళ్ల జగన్‌ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క టిడ్కో ఇల్లు నిర్మించలేదు. కానీ వాటిని నేనే కట్టాను అని జగన్ చెప్పుకోవడం ఏ రాజకీయానికి నిదర్శనం. నిజానికి రాష్ట్రంలో పట్టణ పేదలకు పక్కా భవనాలను నిర్మించి ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో వీటిని చేపట్టింది. అప్పటి మునిసిపల్‌ మంత్రి టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి పట్టణాల శివార్లలో షీర్‌ వాల్‌ టెక్నాలజీతో అపార్ట్‌మెంట్లు నిర్మించడం జరిగింది. వాటిని టౌన్‌‌షిప్‌లా మార్చేందుకు గత ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేసింది. శాచ్యురేషన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేసింది. వీటిని మూడు కేటగిరీల్లో నిర్మించారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటికి రూ.500 డిపాజిట్‌ చెల్లిస్తే చాలు. ఇక కొంత సొంత డబ్బు ఖర్చు పెట్టుకోగలిగే శక్తి ఉన్న వారు రూ. 50 వేలు భరిస్తే 365 చదరపు అడుగుల ఇంటిని, రూ.లక్ష కడితే 430 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఇంటిని ఇవ్వాలని నిర్ణయించారు.ఇలా గత ప్రభుత్వం 1.43 లక్షల 300 చ.అడుగుల ఇళ్లు, 365 చ.అ. ఇళ్లు 44వేలు, 430 చ.అ. విస్తీర్ణమున్న ఇళ్లు 74వేలు నిర్మించింది. మొత్తం 2,.62,216 లక్షల ఇళ్ల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే వందశాతం పూర్తయ్యాయి. మరో 8 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో 80 శాతం 90 శాతం వరకు పనులు పూర్తయ్యాయి.

రివర్స్‌ టెండరింగ్‌ మాయ

జగన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే చేసింది రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో టిడ్కో ఇళ్ల పనులు నిలిపివేసి, అందంగా తన పార్టీ రంగులు వేయించడం.ఇలా 80 నుంచి 90 శాతం పనులు జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పంపిణీ చేస్తే గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న దుర్బుద్దితో టిడ్కో ఇళ్ల ప్రాజెక్టును రివర్స్‌ చేశారు. షీర్‌వాల్‌ టెక్నాలజీతో నాణ్యమైన పనులు చేయబట్టి ఇళ్లు గట్టిగా అలాగే ఉన్నాయి. లేకపోతే ఈ నాలుగేళ్లలో అవి ఎప్పుడో శిథిలమయ్యేవి. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు పూర్తి చేయలేదు. గుడివాడలో నిర్మించిన 8 వేల టిడ్కో ఇళ్లలో 6 వేల ఇళ్లకు కనీసం వాటర్ సప్లై కూడా లేదు. అయినా సరే. నాలుగు ఇళ్లు పంచిపెట్టి, ఆ పేరుతో ఒక సభ పెట్టి, వంద అబద్ధాలు చెప్పి, చంద్రబాబును తిట్టి కొందరినైనా నమ్మించి అధికారంలోకి రావాలని ఆరాటపడ్డారు జగన్ రెడ్డి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్‌ రెడ్డి టిడ్కో ఇళ్లపైనా అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అన్నీ అటకెక్కించారు. సెంటు పట్టా పేరుతో ప్రైవేటు భూములు కొనుగోలు చేసి రూ 7 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.

17 వేల కాలనీలా... ఎక్కడ జగనన్నా?

అయిదేళ్లలో 25 లక్షల ఇళ్ళు కడతామని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో నాలుగు లక్షల ఇళ్లు కట్టిన దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు కాదు వూళ్లు కడుతున్నామని సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకున్నారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో వున్నాయన్నారు. ఎక్కడ ఏ ఏ కాలనీ నిర్మించారో జగన్ రెడ్డి చూపించగలరా? తన జగన్మాయలు తెలుసుకోకుండా తాను చెప్పిన అబద్ధాలు నమ్మి తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ప్రజలంటే జగన్‌కు లోకువగా కనిపిస్తున్నట్లుంది. తన నిజ స్వరూపం తెలుసుకోకుండా ముఖ్యమంత్రిని చేసిన అమాయక ప్రజలకు ఏమైనా చెప్పవచ్చునన్న ధీమా జగన్ రెడ్డిలో పెరిగిపోయింది. అందులో భాగంగానే పేదలకు,పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ పేద ప్రజలను రెచ్చగొట్టి వెర్రివెంగళప్పలను చేద్దామనుకుంటున్నారు జగన్ రెడ్డి. అందుకే ఆయన ప్రతి బహిరంగ సభలో పచ్చి అబద్ధాల వరద పారిస్తున్నారు. కానీ జనం ఎల్లకాలం వెర్రి వాళ్ళు కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలను ప్రజలు మర్చిపోయి ఉంటారని, మరోసారి ముఖ్యమంత్రిగా ప్రజలను దగా చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ, చంద్రబాబుపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లను తాను కట్టినట్లు చెప్పుకొని లబ్ధిదారులకు అప్పగిస్తున్నారు.

పరదా కట్టుకొని పర్యటనలా?

ప్రభుత్వ వేదికలపై రాజకీయాలు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును తిట్టడం తప్ప తన నాలుగేళ్ల పాలనలో తాను ఏం చేశానన్నది మాత్రం చెప్పలేడు జగన్ రెడ్డి. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటానంటూ తనను పర్మిషన్‌ అడిగారని జగన్‌ చెప్పడం ఆయన కురస రాజకీయాలకు నిదర్శనం. ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకొంటారు. అందులో భాగంగానే ఆయన అక్కడ స్థానిక అధికారుల పర్మిషన్ అడిగారు. దానికి నన్ను పర్మిషన్‌ అడిగారు అని జగన్‌ చెప్పడం తగునా సీఎం గారు! అలాగే, పరి పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తే, మీరు బయటికి వస్తే దుకాణాలు మూసివేయడం, పరదాలు కట్టడం, చెట్లు నరికి వేయడం, రోడ్లు మూసివేయడం, ఊళ్లను, పట్టణాలను దిగ్భంధిస్తూ కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పిస్తూ పోలీసులు జనజీవనాన్ని ఎందుకు నరక ప్రాయం చేస్తున్నారో చెబుతారా? గతంలో చాలామంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. మీ లాగా దుకాణాలు మూసివేసి, చెట్లు నరికి వేయించి, పరదాలు కట్టుకొని జనంలో తిరగలేదు. మీరు అలా తిరగడానికి సిగ్గు పడాలి. టిడ్కో ఇళ్లపై కేవలం గుడివాడలో అబద్దాలు చెప్పి వెళ్ళి పోవడం కాదు. ధైర్యం వుంటే రాష్ట్రంలో మీరు కట్టించిన టిడ్కో ఇళ్ళను నేనే కట్టించానని మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా?

నీరుకొండ ప్రసాద్

98496 25610

Advertisement

Next Story