- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విలువల బాటలో 'ప్రస్థానం'
రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు ఆయన కలలను విశ్వసించే వ్యక్తి. ముఖ్యంగా భారతదేశ భవిష్యత్తును పునర్నిర్మించడానికి సాహసించేవారు. ఉప్పు నుండి ఉక్కు వరకు టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతుంది. ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు, పరోపకారి, మానవతావాదిగా తాను యువతరాలకు అత్యంత స్ఫూర్తిదాయకం. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి.
మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్‌లైన్స్ కంపెనీని ప్రారంభించింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా మొదట టాటా ఎయిర్ లైన్స్‌గా ఉండేది కానీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఇదొక్కటే కాదు ఆసియాలోనే మొట్ట మొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి స్టార్ హోటల్ అయిన తాజ్ హోటల్‌ని స్థాపించింది కూడా టాటాలే.
కారులో తిరగాలనే కలను నిజం చేస్తూ..
భారత దేశంలో ప్యాసింజర్ సెగ్మెంట్‌లో తయారైన మొదటి కారు టాటా ఇండికా. దీన్ని టాటా మోటార్స్ సంస్థ 1998లో తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటి నుంచి ఇది బడ్జెట్ కార్ల విభాగంలో మంచి ఆదరణ సంపాదించుకుంటూ వచ్చింది. కంపాక్ట్‌గా చిన్నగా ఉండే ఈ కారు ధర కూడా అంతే అందుబాటులో ఉండేది. దీంతో విడుదలైన రెండేళ్లలోనే ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్ చేయాలని రతన్ టాటా కోరుకోలేదు. ఒక ఆనందకరమైన దేశంగా భారత్ ఎదగాలని అనుకున్నారు. అందుకే ఆయన పేద, మధ్య తరగతుల వాళ్ల కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణే టాటా నానో. ఒకసారి తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో ఒక స్కూటర్ మీద ఒక భర్త , భార్య ఇద్దరు పిల్లలు ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూసి వెంటనే ఆయన పేద, మధ్య తరగతులకు అందుబాటులో ఉండేలా లక్ష రూపాయల్లో ఒక కారుని తయారు చేయాలనుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలైంది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాల వలన నానో కారు కొద్దిగా విఫలం అయ్యింది. నానో కారు తయారు చేయడం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన కలల కారు. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల.
నమ్మకానికి నిఖార్సైన బ్రాండ్
సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఉంటుంది. కానీ టాటా అలా కాదు టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడపెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలావరకు సమాజానికే వెచ్చిస్తున్నారు. అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్‌గా స్థిరపడిపోయింది. నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ బ్రాండ్ లోనే ఉన్నాయి. అందుకు తాజ్ హోటల్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా తమ హోటల్‌లోని 1500 మందికి పైగా అతిధులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలను సైతం కోల్పోయారు.
గర్వం, అహంకారం లేకుండా..
టాటాను 10000 కోట్ల రూపాయల విలువైన సంస్దని తన నాయకత్వంలో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు. ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు. ఏకంగా 96కి పైగా వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామిక వేత్త అయినప్పటికీ అయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మీడియాకి మీటింగ్‌లకు దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్‌మాన్‌కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి. వీటన్నిటికి మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపటంలో 100 శాతం విజయాన్ని సాధించారు. డబ్బు పరంగా అయన గొప్ప ధనవంతుడు కాకపోవచ్చు. కానీ మంచితనంలో ఆయన అపరకుబేరుడు. అందుకే భారతీయులందరు ఇష్టపడే గౌరవించే బిజినెస్ మాన్‌గా రతన్ టాటా నిలిచిపోయారు.
సాధారణ ఉద్యోగి నుంచి సీఈఓ దాకా
1961లో టాటా స్టీల్స్ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా రతన్ టాటా తన కెరీర్ ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి సరిగ్గా 30 సంవత్సరాలకు అదే కంపెనీకి చైర్మన్ అయ్యారు. టాటా గ్రూప్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన చైర్మన్‌గా రతన్ టాటా ఆధ్వర్యంలోనే టాటా గ్రూప్ ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది. టెట్లీ జాగ్వార్ ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్స్ లాంటి సంస్థలను టాటా గ్రూపులో విలీనం చేసుకున్నారు. ఆయన తన ఆస్తిలోంచి సుమారు 60 నుంచి 65 శాతం సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దాదాపు 30 స్టార్ట్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేశారు. వాటిలో చాలా వరకు నేడు సక్సెస్ బాట అందుకున్నాయి. ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ వరకూ, సబ్బు బిళ్ల నుంచి విమానాల వరకు విస్తరించిన టాటాల వ్యాపార సామ్రాజ్యానికి ఆయన వేసిన బాట అనితర సాధ్యమైనదని చెప్పవచ్చు. 86 సంవత్సరాల రతన్ టాటా నిష్క్రమణ భారత వ్యాపార ప్రపంచానికి తీరని లోటు.
నిబద్ధతా శకానికి ముగింపు
రతన్ టాటా నిష్క్రమించడంతో దాతృత్వం పట్ల నిబద్ధతతో నిర్వచించబడిన శకానికి ముగింపు పలికింది. దాతృత్వం, సమాజ అభివృద్ధికి టాటా అంకితభావం లక్షలాది మంది జీవితాలను తాకింది. విద్య నుండి ఆరోగ్య సంరక్షణ వరకు తన కార్యక్రమాలు లోతైన ముద్రను మిగిల్చాయి. నైతికంగా వ్యాపారం చేయడం తప్ప మరో మార్గం లేదని టాటా చూపించారు. నైతిక నాయకత్వం, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల తిరుగులేని నిబద్ధతకు నిలువెత్తు రూపం రతన్ టాటా. ఆయన మరణం ఎప్పటికీ పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. కానీ తాను మిగిల్చిన వారసత్వం ఆవిష్కరణ, కరుణ, శ్రేష్ఠత వంటివి నిబద్ధతతో నడిచే మెరుగైన భారతదేశాన్ని నిర్మించడానికి తరాల వ్యవస్థాపకులకు స్ఫూర్తినిస్తాయి. ఆయన గర్వపడేలా భారతీయ భవిష్యత్తును సృష్టించడం ద్వారా ఆయన జ్ఞాపకాన్ని గౌరవిద్దాం.
(రతన్ టాటా సంస్మరణలో)
వి. సుధాకర్
99898 55445