ఓట్ల కోసం కోట్లు...!!

by Ravi |   ( Updated:2024-10-29 00:31:20.0  )
ఓట్ల కోసం కోట్లు...!!
X

సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే ఆ అభ్యర్థి.. ప్రజల విశ్వసనీయతను గెలుచుకున్నాడని ఆ ప్రజల తీర్పుతో పట్టం కట్టారని ప్రజలు విశ్వసిస్తున్న సందర్భంలో.. ప్రపంచంలో చాలా చోట్ల ఓట్లను కొనుక్కునే దుస్థితి ప్రజాపాలనకు వ్యతిరేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే సమర్థవంతమైన నాయకుడు ఎటువంటి పక్కదారులు తొక్కకుండా పీఠం ఎక్కితే ప్రజలకు ఆశించిన పలు రంగాలలో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచానికే దిక్సూచిగా అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా ప్రెసిడెన్షియల్ రాజకీయాల్లో అపర కుబేరుడైన ఎలన్ మాస్క్ చేస్తున్న రాజకీయ జమ్మిక్కులు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తారాస్థాయిలో ఉన్నాయి.

మస్క్‌కి కేబినేట్‌లో చోటు..?

ఇటీవల రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్‌కు మద్దతు తెలుపుతూ ‌ఆయన గెలుపే లక్ష్యంగా చేసుకొని ప్రచారంలో భాగంగా పొలిటికల్ యాక్షన్ కమిటీ ‌ఎలక్ట్రోరల్ ఓట్లను కీలకంగా తనవైపుకు తిప్పుకోవడం కోసం ఏకంగా ఒక్కో ఓటుకి మిలియన్ డాలర్లు ఆఫర్‌గా ఇవ్వడం ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎన్నికల్లో ట్రంపుకు మద్దతుగా నిలవాలని, పెన్సిల్వేనియాలో రోజుకు ఒకరిని లక్కీ‌డిప్ ద్వారా ఎంపిక చేసి వారికి బహుమతిగా 8 కోట్ల నలభై లక్షల రూపాయలు ఇవ్వడం లాంటి చర్యలు చూసి ప్రజాస్వామ్యంలో ఓట్లను కొనుక్కునే పద్ధతిగా పలువురు పరిశోధకులను అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ కోసం 75 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాడని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. అమెరికా ధర్మాసనం ఎలాన్ మాస్క్ చేస్తున్న పనిని తప్పు పట్టడం ఒక శుభ పరిణామానికి నాంది పలికినట్టు చెప్పక తప్పదు. అయితే రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే, మాస్క్‌కి కేబినెట్లో చోటు కల్పిస్తానని అలా సాధ్యం కాకుంటే ప్రభుత్వ సలహాదారుగా, ‌తీసుకుంటానని ట్రంప్ చెప్పడం ఒక గమనార్హం. ట్రంప్‌తో ఇటీవల మాస్క్ చర్చలు జరిపిన నేపథ్యంలో మాస్క్ ప్రభుత్వ పెట్టుబడిలో కీలక మార్పులను తీసుకురావడానికి ఒక ప్రణాళిక తయారు చేయాలని, దానికి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అడుగులు వేయాలని సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఏది ఏమైనప్పటికీ అగ్రరాజ్యమైన అమెరికాలో ఓట్లు సాధించుట కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా డబ్బును ఆయుధంగా వాడడం హాస్యాస్పదమే.. ఓట్ల కోసం అగ్ర రాజ్యంలో జరుగుతున్న పరిణామాలను చూసి ప్రపంచ ప్రజలు విస్తుపోవాల్సిందే.

-డా. చిటికెన కిరణ్ కుమార్

94908 41284

Advertisement

Next Story

Most Viewed