ఇది బహుజనుల రాజకీయ విజయం

by Ravi |   ( Updated:2024-06-15 01:15:31.0  )
ఇది బహుజనుల రాజకీయ విజయం
X

2024 ఎన్నికలు అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికే పట్టం కట్టాయి అని అనక తప్పదు. మోడీ ప్రభుత్వం మునుపటిలా రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నడిచే అవకాశం లేదు. భారత రాజ్యాంగానికి ఎవరైనా తలవంచాల్సిందే. దళిత, బహుజన, మైనార్టీల పోరాట స్ఫూర్తి ఈ ఎన్నికల్లో వెల్లివిరిసింది. మహాత్మా పూలే, అంబేడ్కర్ ఆశయాలతో దేశంలో బహు సంఖ్యాకులు చైతన్యంతో ఉన్నారని అర్థమవుతోంది. రామమందిర నినాదానికి, భారత రాజ్యాంగ పరిరక్షణ నినాదానికి జరిగిన సమరంలో రాజ్యాంగమే విజేతగా నిలబడిన సందర్భం మన ముందుకొచ్చింది. ప్రభుత్వంతో సమఉజ్జీలుగా ఉన్న ప్రతిపక్షం భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో కృతకృత్యం అవుతుందని, ఈ రాజ్యాంగ పోరాటాన్ని మరింత ముందుకు కొనసాగిస్తుందని ఆశిద్దాం.

భారత దేశంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్‌ 4వ తేది అత్యంత ఉత్కంఠభరితమైన వాతావారణంలో వెలువడ్డాయి. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు సంపాదించిన బీజేపీ 2024 ఎన్నికల్లో 241 సీట్లు మాత్రమే సాధించగలిగింది. 2019లో 52 సీట్లు మాత్రమే సాధించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో 99 సీట్లు సాధించగలిగింది. బీజేపీకి 2019 ఎన్నికల కంటే 60 సీట్లు తగ్గాయి. ఇకపోతే భారత రాజ్యాంగ సూత్రాల పరిరక్షణలోనూ, హేతువాద భావజాల ప్రచారంలో ముందున్న తమిళనాడు పుదుచ్చేరి ఎంపీ స్థానంతో సహా మొత్తం 40 స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. తమిళనాడులో సామాజిక న్యాయానికి అధునాతన ధర్మానికి, ప్రజలు పట్టం కట్టారు. నరేంద్ర మోడీ పనిగట్టుకొని సనాతన సంప్రదాయాలను ప్రచారం చేశారు. రాముడిని దక్షిణాది రాష్ట్రాలకు తరలించాలని ప్రయత్నం చేశారు కానీ లౌకికవాద భావజాలానికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో బీజేపీ, అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో బోణీ కూడా కొట్టలేకపోవడం గమనార్హం.

రామమందిరంపై అతి ప్రచారంతో దెబ్బ

ఈ ఎన్నికల ఫలితాలు భారతదేశానికే దిక్సూచిగా వున్నాయి. బీజేపీ వైఫల్యానికి ప్రధాన కారణం ముఖ్యమైనది అయోధ్య రామ మందిరం. రామమందిర నిర్మాణం కొందరి విశ్వాసానికి సంబంధించినపుడు ఆ విశ్వాసాన్ని భారతీయులందరి మీద రుద్ధాలనీ చూడటం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో ఘోర పరాజయానికి గురికావటానికి కారణం ఈ రామమందిర నిర్మాణమే. దళిత బహుజనుల నాయకుల స్ఫూర్తితో నిర్మించిన అంబేడ్కర్‌ పార్క్‌ యూపీలోనే వుంది. ఇవన్నీ మనకు స్ఫూర్తివంతమైనవి. కాని వాటిని రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. రామమందిరం కూడా అలాంటిదే. దానిని కళాత్మకమైన దేవాలయంగా చూస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఆ రామమందిరాన్నే బీజేపీ ప్రచారాస్త్రంగా తీసుకోవడం వలన ఆ అంశం నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఓటమికి దారి తీసింది.

చావు దెబ్బ తీసిన యూపీ

యూపీ, దేశంలోనే అత్యధిక సంఖ్యలో (80) లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం. దేశంలోని అత్యంత ముఖ్యమైన రాష్ట్రాలలో ఒకటిగా వుంది. ఈ రాష్ట్రంలో అత్యధిక నియోజక వర్గాలు గెలుపొందిన కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఈ ఎన్నికల్లో ఎస్పీ 37, కాంగ్రెస్‌ 6, స్థానాల్లో విజయం సాధించాయి. ఈ విజయం ఇండియా కూటమికి బాగా కలిసొచ్చింది. ఇకపోతే నరేంద్ర మోడీ భారతదేశంలోని ముఖ్యమైన దేవాలయాలన్నీ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. బీఎస్పీ ఓటు బ్యాంక్‌ కాంగ్రెస్‌, ఎస్పీకి బదిలీ కావడం చివరికి బీజేపీనే దెబ్బతీసింది. జాట్‌లు, రాజ్‌పుత్‌లు, క్షత్రియులు, బ్రాహ్మణులు సైతం బీజేపీకి, దూరం కాగా ఆ రాష్ట్రంలో దాదాపు 20% దాకా ఉన్న ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్‌-ఎస్పీ కూటమికి ఓటెయ్యడం గమనార్హం. జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు ఇవ్వాలని డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఎప్పుడో చెప్పారు. బీజేపీ రాజకీయాల్లో మతాధిపత్యం, కులాధిపత్యం, వర్ణాధిపత్యం, పితృ ఆధిపత్యం ఇవన్నీ కనిపించాయి.

రిజర్వేషన్లపై చేయి వేస్తే...

నిజానికి డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ భారత రాజ్యాంగంలో ఏ రిజర్వేషన్‌లు కల్పించారో ఆ రిజర్వేషన్‌లను రద్దు చేస్తామన్న బీజేపీ వాక్కు దళిత బహుజనులలో అభద్రతను కల్పించింది. అలాగే యువత ఆశలపై నీళ్ళు చల్లిన అగ్నవీర్‌ పథకం తీవ్రరూపం దాల్చింది. నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఫిరాయింపులకు ప్రోత్సాహం వంటివి బీజేపీని దెబ్బతీసాయి. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా మొదటికే మోసం తెచ్చాయి. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచేస్తుందనీ, అర్బన్‌ నక్సల్‌ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు, సోదరీమణుల మెడలోని మంగళ సూత్రాలను కూడా వదలరనీ మోడీ వ్యాఖ్యానించారు. నిజానికి ఒక మత ఆవేశం గాని, మతోన్మాదం కానీ, భారతదేశాన్ని పరిపాలించలేదు అనే విషయం ఈ ఎన్నికలు నిరూపించాయి. భారతదేశం పునర్‌నిర్మించాలంటే తప్పకుండా అంబేడ్కర్‌ మార్గాన్ని అనుసరించాల్సిందే.

రాజ్యాంగ పరిరక్షణ జరిగింది!

భారత రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదాన్ని ముఖ్యంగా మల్లిఖార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ భుజాన వేసుకుని దేశమంతా ప్రచారం చేయడం వల్ల మోడీ యొక్క ప్రభావం భారతదేశ ప్రజలకు తెలిసింది. బిహార్‌‌లో 12 సీట్లు సాధించిన నితీష్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌లో 16 సీట్లు సాధించిన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకమయ్యారు. వారు మోడీ నాయకత్వంలోని ఎన్‌డీఏని సమర్థించారు. మొదట మోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని రూపొందించిన వారిలో నితీష్‌ కుమార్‌ ముఖ్యుడు. కానీ ఆయన బీసీ కులగణన తీర్మానాన్ని బీజేపీ అంగీకరిస్తుందా? అనేది ప్రశ్న. అలానే ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాని పార్లమెంటులో నిరాకరించిన బీజేపీతో చంద్రబాబు చివరిదాకా మనుగడ అనేది ప్రశ్నార్ధకం?! ప్రభుత్వంతో సమఉజ్జీగా ఉన్న ప్రతిపక్షం భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో కృతకృత్యం అవుతుందని, ఈ రాజ్యాంగ పోరాటాన్ని మరింత ముందుకు కొనసాగిస్తుందని ఆశిద్దాం.

డా.కత్తి పద్మారావు

98497 41695

Advertisement

Next Story