- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుషులు ప్రసాదించిన వైద్యం
భారతీయ వైద్యవిధానాలలో సిద్ధ వైద్య విధానం ఒకటి. ఇది దాదాపు 4000 సంవత్సరాల పూర్వపు వైద్య విధానం. ఇది దక్షిణ భారతదేశంలో ద్రవిడుల కాలంలో ప్రసిద్ధమైన వైద్యం. దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిని 'సిద్ధార్థులు' లేదా శైవ భక్తులైన 'రుషులు' అంటారు. వీరు దైవానుగ్రహం వలన ఈ వైద్యజ్ఞానము పొందారని అంటారు. పురాణ కథల ప్రకారం వీరు 18 మంది. వీరిలో అగస్త్యుడు ముఖ్యమైనవాడు, అందుకే అగస్త్య మహర్షిని 'సిద్ధ వైద్య పితామహుడి'గా పిలుస్తారు. ఈ సిద్ధ జ్ఞానాన్ని మొదటగా శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడని, ఆమె దీనిని నంది దేవునికి అందించిందని, ఆయన దీనిని సిద్ధులకు అందజేసాడని తమిళ గ్రంథాల ద్వారా తెలుస్తుంది.
ఆ వైద్య విధానానికి దగ్గరగా
ఈ గ్రంథాల ప్రకారం సిద్ధులను అత్యంత ప్రముఖులైన శాస్త్రవేత్తలుగా చెప్పినట్లు తెలుస్తుంది. 'అగస్తియార్' రచించిన గ్రంథాలు సిద్ధ వైద్యంలో అనేక చికిత్స పద్ధతులైన నాడీ పరీక్ష, శాస్త్ర చికిత్స, రస వైద్యం, ఆవిరి చికిత్స, యోగ, ముద్ర, ప్రాణాయామం వంటి 99 రకాలు పద్ధతులు ఉన్నట్టు తెలుస్తుంది. నేటికి ఇవి సిద్ధ వైద్యులకు మార్గదర్శకం అవుతున్నాయి. ఈ వైద్య విధానంలో సూత్రాలు, సిద్ధాంతాలు ఆయుర్వేద వైద్యంతో దగ్గరి సారూప్యతను కలిగి ఉంటాయి. అలాగే ఆహారం, మందుల సేకరణ, మందుల తయారీ, మందుల నిర్ధారణ వంటివి సైతం ఆ వైద్య విధానానికి దగ్గరగా ఉంటాయి. అలాగే తిరుక్కరాజ్ రాసిన తల కప్పియం అనే ప్రాచీన గ్రంథంలో క్రీ.పూ 2 వ శతాబ్దంలోనే రోగాలు వాత, పిత్త, కఫ దోషాలుగా ఉంటాయని. వీటిని బట్టే ఔషధాలు నిర్ణయిస్తారని తెలుస్తుంది. అంతే కాకుండా శరీరంలో వ్యాధికి విశ్వంలోని ఐదు ప్రాథమిక అంశాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వంటివి కూడా కారణమవుతాయని సిద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అనారోగ్యానికి కారణమైన అంశాలను సిద్ధ వైద్యులు రోగి నాడిని చూసి, మూత్రం, విరోచనం, కళ్లు, నాలుక పరీక్షించడం ద్వారా గ్రహిస్తారు. అలాగే రోగి మాట్లాడే విధానం, రోగికున్న వాసన, రుచి, స్పర్శ వంటి వాటి గురించి అడిగి తెలుసుకోవడం ద్వారా రోగాన్ని గుర్తిస్తారు. అలాగే రోగి శరీరం రంగును, జీర్ణక్రియ స్థితి వంటివాటిని తెలుసుకొని రోగాన్ని కనిపెట్టడం ఈ విధానంలో చెప్పారు. అలాగే రోగి మూత్రములోని రంగు, రుచి, వాసన, చిక్కదనం ద్వారా రోగాన్ని అధ్యయనం చేసే విధానాన్ని కూడా వివరిస్తుంది.
కరోనా సమయంలో గుర్తింపు
ఈ సిద్ధ వైద్యంలో రసఔషధాలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. అనేక అలివిగాని అతి తీవ్రమైన అనారోగ్యాలకు ఈ రస ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయని సిద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా మొక్కల వేర్లు, బెరడులు, ఆకులు, రత్నాలు, పశు ఉత్పత్తులతో కూడిన ఔషధాల తయారీ ఉంటుందని 'హోలిస్టిక్ హెల్త్' అనే ప్రభుత్వ ఆయుష్ పుస్తకం తెలియజేస్తుంది. ఈ సిద్ధ వైద్యం శ్రీలంక, సింగపూర్, మలేషియా, చైనా, తైవాన్ వంటి దేశాలలో సైతం విశేష ఆదరణ కలిగి ఉంది. ఈ సిద్ధ వైద్యంతో తయారు చేసిన 'కబాసురనీర్' ఔషధం కరోనా సమయంలో తమిళనాడులో అనేక కరోనా కేసులను తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని గుర్తించింది. ఈ గుర్తింపు ద్వారా సిద్ధ వైద్యం అమోఘమైన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి అద్భుతమైన ప్రకృతి వైద్య విధానానికి మన ప్రభుత్వాలు తోడ్పాటుతో పాటు ప్రాచుర్యం కల్పిస్తే ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని రుషుల ప్రసాదిత వైద్యం ప్రజలకు చేరువవుతుంది.
(రేపు జాతీయ సిద్ధ వైద్య దినోత్సవం)
డా. బాలాజీ దీక్షితులు పి.వి
సిద్ధ వైద్య ఎథిక్స్ కమిటీ సభ్యులు, తిరుపతి
88853 91722
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672