గణతంత్ర భారతావని..

by Viswanth |   ( Updated:2023-01-26 02:11:33.0  )
గణతంత్ర భారతావని..
X

భారత స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే 1947 ఆగస్టు 15 అని అందరికీ తెలుసు. అది నిజమే అయినా ఆనాటితో మనపై బ్రిటన్ రాచరికమేమీ తొలిగిపోలేదు. ఆ తర్వాత కూడా బ్రిటిష్ గొడుగు కిందే ఉన్నాం. 1950 జనవరి 26న భారత ప్రజలకు సంపూర్ణ రాజకీయ స్వాతంత్య్రం లభించింది. బ్రిటిష్ రాజరికపు సంకెళ్లు తెంచుకొని భారతావని గణతంత్ర రాజ్యంగా ఉదయించింది.

1947 ఆగస్టు 15న మనకు బ్రిటన్ పార్లమెంటు స్వాతంత్రం ప్రకటించినా అది సంపూర్ణం ఏమీ కాదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచి మన ఉద్యమకారులు కోరిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. కానీ బ్రిటన్ రాజు పాలన కిందే భారత్ కొనసాగింది ఆయన ప్రతినిధిగా గవర్నర్ జనరల్‌ను నియమించారు. స్వాతంత్రం వచ్చేనాటికి మనకు రాజ్యాంగం లేదు. 1935లో ఆంగ్లేయులు అమలులోకి తెచ్చిన చట్టం ప్రకారమే పాలన కొనసాగింది.

ప్రత్యేక అంశాలను రాజ్యాంగంలో చేర్చి

స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, బ్రిటిష్ వలస పాలన కొనసాగుతున్న వేళ రాజ్యాంగ రచన కీలకంగా మారింది. 1946 డిసెంబర్ 9న తొలిసారి సమావేశమైన రాజ్యాంగ సభ చకచకా తన పని మొదలెట్టింది 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన కమిటీని ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యుల బృందానికి అంబేద్కర్ చైర్మన్‌గా, బెనగల నర్సింగరావు సలహాదారుడిగా రాజ్యాంగ రచనలలో కీలకపాత్ర పోషించారు. ఈ కమిటీ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటిని పరిశీలించి మన దేశానికి అవసరమైన అంశాలను సేకరించింది. ముఖ్యంగా బ్రిటన్, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాల నుండి అనేక అంశాలను పరిశీలించి మనకు అనువైన అంశాలను సేకరించి రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రూపొందించారు. దృఢ, అదృఢ లక్షణాలతో పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకోవడానికి వీలుగా అవకాశం కల్పించారు. ఏ దేశంలో లేని కొన్ని ప్రత్యేక అంశాలు మన రాజ్యాంగంలో చేర్చారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం మొదలైన ప్రత్యేక అంశాలను చేర్చారు. వీటన్నింటితో కూడిన రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రూపొందించారు.

రాజ్యాంగ రచనకు రెండేళ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది, దానిపై నిశితంగా, క్షుణ్ణంగా చర్చించాక అనేక సవరణలతో ఆమోదించారు. సామాన్యులు సైతం కమిటీ చర్చలు విని సూచనలు ఇవ్వడానికి అవకాశం కల్పించడం విశేషం. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ, దాన్ని రెండు నెలల పాటు అమల్లోకి తేకుండా ఆపారు. 1930లో లాహోర్ సదస్సులో సంపూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్ నినదిస్తూ, జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్యం దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది ఆ ముహూర్తాన్ని గౌరవిస్తూ కొత్త రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న ఆవిష్కరించారు.

చేతితో రాసి

రాజ్యాంగ ప్రతిలో సీతారాములు, అక్బర్ ,టిప్పు, బోస్ చిత్రపటాలను చేర్చారు. రాజ్యాంగ అసలు ప్రతిని టైపు చేయలేదు. ప్రింట్ చేయలేదు. చేతిరాతతో హిందీ, ఇంగ్లీషులో రాశారు. అందమైన అక్షరాలు (క్యాలిగ్రాఫీ) రాయడంలో దిట్టగా పేరొందిన ప్రేమ్ బిహారి నారాయణ్‌తో దీన్ని రాయించారు. శాంతినికేతన్‌కు చెందిన నందన్ లాల్ బోస్, ఆయన శిష్యుడు రామ్ మనోహర్ సిన్హాలు సనాతన భారతీయ పత్రికలతో పాటు జాతీయ ఉద్యమంలోని నేతలు, ఘట్టాల దాకా వివిధ అంశాలను ప్రతి పేజీలో అద్భుతంగా చిత్రీకరించారు. వేదాలు, రామాయణ ఘట్టాలు, మొహంజోదారో, బుద్ధుడు, మహావీరుడు ,గుప్తుల పాలనలోని స్వర్ణ యుగలతో మొదలుపెట్టి మధ్యయుగం నాటి మహాబలిపురంలోని నటరాజ శిల్పం, మొగల్ చక్రవర్తి, అక్బర్, మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ, మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్, వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి, గాంధీ దండి సత్యాగ్రహ యాత్ర, త్రివర్ణ పతాకానికి సుభాష్ చంద్రబోస్ సెల్యూట్ చేస్తున్న బొమ్మలను గీశారు. రాజ్యాంగం అమల్లోకి రాగానే రాజ్యాంగ సభ సహజంగానే రద్దయి తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించింది. సభా చైర్మన్ బాబు రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతి అయ్యారు.

ఆనాటి నాయకులు ఎంతో దూర దృష్టితో ప్రజలందరికీ రాజ్యాంగాన్ని అందిస్తే నేటి పాలకులు తమకు అవసరం వచ్చిన విధంగా రాజ్యాంగ స్వరూపాన్ని మార్చి వేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలందరిపైన ఉంది. అప్పుడే ఈ గణతంత్ర వేడుకలకు సార్ధకత చేకూరుతుంది.

జీవన్

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read....

దేశ ఖ్యాతిని ప్రపంచ యవనికపై రెపరెపలాడించిన ప్రముఖులు..


Advertisement

Next Story

Most Viewed