- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టాల కడలిలో కోల్ సెక్టార్!
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రభుత్వ రంగంలోని కోల్ సెక్టార్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. జాతీయికరణ లక్ష్యానికి తూట్లు పడుతోంది. ప్రభుత్వం కోల్ సెక్టార్ నుంచి ఒక లక్ష 75,000 కోట్లు సంపాదించాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 500 బొగ్గు బ్లాక్‌లను దశల వారిగా వేలం వేస్తూ వస్తున్నది. ఇప్పటికే కార్పొరేట్‌ల చేతుల్లోకి 140కి పైగా బొగ్గు బ్లాకులు వెళ్లిపోయాయి. పార్లమెంట్‌లో 303 సీట్లు ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. చర్చకు అవకాశం లేకుండా ఏకపక్ష నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తున్నది. ఇందులో బొగ్గు బ్లాక్‌ల వేలంతో పాటు, కోల్ ఇండియా దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహారణ, షేర్‌ల అమ్మకం కీలకంగా పేర్కొనవచ్చు.
అదే కేంద్ర ప్రభుత్వ విధానం..
ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, పెద్ద ఎత్తున సాగుతున్నది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బిసీసీఎల్(భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్)లో 25 శాతం పెట్టుబడి ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోల్ ఇండియా బోర్డు ముందు ఉంది. బిసీసీఎల్ కోల్ ఇండియా అనుబంధ సంస్థగా కొనసాగుతున్నది. ఇప్పటికే కోల్ ఇండియా తన 33 శాతం షేర్లను అమ్మేసింది. ఇప్పుడు ఈ నిర్ణయంతో మరిన్ని షేర్లు బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇదంతా బిసీసీఎల్‌ను అమ్మేసే కుట్రలో భాగమే అనక తప్పదు! ఇలా ప్రభుత్వ రంగాన్ని అమ్మడం, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం మొత్తం ఆరు లక్షల కోట్లు సంపాదించే పనిలో ఉంది. ఈ ఏడాది లక్ష కోట్లు సంపాదించాలని నిర్ణయించింది.
నిజానికి బిసీసీఎల్‌ను కోకింగ్ కోల్ ఉత్పదన కోసం 1972 లో ఏర్పాటు చేసారు. 2021లో కంపెనీ టర్నోవర్ 8967.56 కోట్లు ఉంటే 2022 నాటికీ 6149.81 కోట్లకు తగ్గింది. అంటే ఏడాదికి దాదాపు 2817.71 కోట్లు టర్న్ ఓవర్ తగ్గింది. ఉత్పత్తి లక్ష్యం 2021-22 లో 37.14 మిలియన్ టన్నులు కాగా, ఉత్పత్తి చేసింది 24.66 మిలియన్ టన్నులు మాత్రమే. ఇక్కడ బొగ్గు నిక్షేపాలు 17095.461 మిలియన్ టన్నులు ఉండగా, గుర్తించినవి 14930.4 మిలియన్ టన్నులు. ఇందులో 268.2 మిలియన్ టన్నులు తీశారు. 1896.859 మిలియన్ టన్నులు తీయనున్నారు. 2022 ఏప్రిల్ ఒకటి వరకు బిసీసీఎల్‌లో మ్యాన్ పవర్ 38,915 ఉంటే, 2022 అక్టోబర్ 31 నాటికి 37,824 కు తగ్గింది. అధికారులు ఇందులో అక్టోబర్ నాటికి 1966 మంది ఉన్నారు. ఇక 25 శాతం వాటా అమ్మకం అనంతరం మ్యాన్ పవర్ 35 శాతం తగ్గే పరిస్థితి ఉంటుంది.
నిజానికి కేంద్ర ప్రభుత్వ విధానమే కార్మికుల సంఖ్యను తగ్గించడం. అందుకే ప్రభుత్వ రంగంను నిర్వీర్యం చేసే పనిలో పడింది. కేంద్రం అనుకున్నది సవ్యంగానే జరుగుతున్నట్టు ఉంది. ఒక కుక్కను చంపాలంటే, ముందు దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి, అందుకే పై లెక్కలు చూపి 25 శాతం కోల్ ఇండియా భాగస్వామ్యంను అమ్మేస్తున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో 100 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తికి కోల్ ఇండియా నిర్ణయం తీసుకున్నట్లు దీనికి తాను పదవిలో ఉన్నప్పుడు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశామని మాజీ చైర్మన్ గోపాల్ సింగ్ తెలిపారు.
ఇలాంటి సమయంలో కేంద్రం ఇలా వాటా ఉపసంహరణ చేస్తుందా? మొత్తానికి కేంద్రం ప్రభుత్వ రంగంను టోకుగా, గంపగుత్తగా, ఎయిర్ ఇండియాను అదానీకి అమ్మేసినట్లు 2024 పార్లమెంట్ ఎన్నికలు రాక ముందే అమ్మేసే కుట్రకు తెర లేపేసింది! కార్మిక సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు ఎట్టికి ఆందోళనలు చేస్తే, ఆగుతాయా? ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ఆర్థిక నీతిలో భాగం ఇది.
లాభాల్లో ఉన్నా, ప్రైవేటీకరణ తప్పదా..?
రామగుండంలో నరేంద్ర మోడీ పర్యటించి సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తి లేదని చెప్పి వెళ్ళారు. కానీ బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు విషయం ఏమి చెప్పలేదు! బిసీసీఎల్ మాదిరి రేపు సింగరేణిలోని కేంద్రం వాటాను అమ్మకానికి పెట్టరని, ఎలా నమ్మగలం! రైల్వేతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను రైల్వేను ప్రైవేట్ పరం చేస్తానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ తర్వాత ప్రధాని ఏం చేశారో జగమెరిగిన సత్యం! అంతేకాదు పీఎం మోడీ, ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఏ మాట నమ్మాలి? చెప్పండి మోదీజీ! సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. దేశంలో స్వాతంత్య్రానికి ముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఏకైక సంస్థ సింగరేణి! గత 20 ఏండ్లుగా లాభాల్లో నడుస్తూ, కార్మికులకు, లాభాల్లో వాటా ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు మిగులు సర్వీస్ ఉన్న నేషనల్ కోల్‌వేజ్ అగ్రిమెంట్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు అనారోగ్యం ఉంటే, డిపెండెంట్‌లకు ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే. అలాగే సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా 3,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, నాలుగు కొత్త గనుల నుంచి 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి టార్గెట్‌లు నిర్ణయించింది! ఇవి నాలుగు ఓపెన్ కాస్ట్ గనులే. అలాగే రానున్న మూడేండ్లలో 13 కొత్త గనుల పైన కూడా సింగరేణి ఇటీవల చర్చించింది! ఒరిస్సా లోని నైనీ బొగ్గు గని నుంచి ఏటా కోటి టన్నుల నాణ్యమైన బొగ్గును సింగరేణి మరో మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నది.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణ పాలసీ ప్రమాదం కాదా? ఇప్పటికే ఇలాంటి విధానాలు వల్ల కోల్ ఇండియాలో ఒకప్పుడు 8 లక్షలున్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 3.25 లక్షలకు, సింగరేణిలో 1991లో లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య నేడు 43 వేలకు పడిపోయింది! కోల్ ఇండియా కూడా సింగరేణి మాదిరి మంచి లాభాల్లో ఉంది. అయినా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి గని కార్మికుల ప్రతిఘటన తప్ప వేరే మార్గం లేదు. కార్మిక సంఘాలు ముందు నిలబడాలి. దేశంలోని కోల్ బెల్ట్ విస్తరించి ఉన్న 11 రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ బొగ్గు సంస్థలను బలహీనం చేస్తున్న విధానాలను కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిరసించాలి. ఈ ప్రాంత నిరుద్యోగులకు తమ భవిష్యత్తు కోసం పోరాడాలి! ప్రభుత్వ రంగంలోనే బొగ్గు సంస్థలు కొనసాగేలా, ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించే విధంగా ఒత్తిడి తేవాలి. బొగ్గు సంస్థల పరిరక్షణకు కృషి జరగాలి. తెలంగాణ గుండె కాయ అయిన సింగరేణిని కాపాడుకోవాలి!
ఎండి. మునీర్
9951865223