- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చర్చా సంస్కృతిని దెబ్బతీయొద్దు..
రాజకీయ నాయకులు వాళ్ల ఉనికి, అవసరాల కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం, కుల, మత కుంపట్లు రగిలించడం అనేవి గతంలో విన్నాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఏమైనా చేయవచ్చు, చేస్తారు అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది..! రాష్ట్రంలో ఎప్పుడూ లేని పరిస్థితులు నేడు కనిపించడం దేనికి సంకేతం? ఇది ఎంతవరకు దారి తీస్తుంది? అనే ఆలోచన మేధావుల్లో కనిపిస్తుంది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఛేదించి హైదరాబాద్ మహానగరాన్ని ఎలాంటి ప్రాంతీయ విభేదాలు లేని రాజధానిగా నిల బెట్టే బాధ్యత తెలంగాణ సమాజానిది. ఫ్యా క్షన్ రాజకీయాలకు హైదరాబాద్ మారు పేరు అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వంపై కూడా ఉంది.
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ..
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తొలగించడం, ప్రగతి భవన్ పేరు ఫూలే భవన్‌గా మార్చడం, ఘడీల పాలనకు చరమగీతం పడి ప్రజాపాలనా అందించడమే మా లక్ష్యం అని ప్రకటించడంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తెలంగాణ సమాజంలో వీటిపై సానుకూలంగా చర్చ జరిగిన మాట వాస్తవం. ప్రగతిభవన్‌లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, ప్రజలకు భరోసా కల్పించడంలో పూర్తిస్థాయిలో సఫలీకృ తుడైనారు అనే దాంట్లో సందేహం లేదు. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో భాగంగా గతంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నాడు టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాటలకు అనుగుణంగానే నేడు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ పేరును సంక్షిప్తంగా టీఎస్ నుండి టీజీ గా మార్చడం సబబైన చర్య.
పాలనలో కొత్త పంథా!
గత ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ సీఎల్పీని విలీనం చేసిన సందర్భంగా నాడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులను ఎవరూ ప్రోత్సహించకూడదు, అది భవిష్యత్ తరాలకు మంచిది కాదు అని మాట్లాడి అదే హుందాతనంతో సీఎం హోదాలో నేడు ప్రతిపక్ష పార్టీ నాయకుల సలహాలు రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటామని చెప్పారు. మేధావి వర్గం, ప్రజా సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు వారి నుండి అభిప్రాయాలు తీసుకుంటూ, ప్రజాపాలనా ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహాయ సహకారం కావాలని కోరడం రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం.
ప్రజాప్రతినిధుల నోట ఇన్ని బూతులా?
గతంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. ప్రస్తుత శాసనసభలో, శాసనమండలిలో సగానికి పైగా యువ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం శుభపరిణామం. కానీ వారు కొన్ని సందర్భాల్లో తాము ప్రజా ప్రతినిధులం అనే సోయి మరిచి మాట్లాడుతున్న భాష యావత్ తెలంగాణ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హుందా తనాన్ని, గౌరవాన్నీ పెంచుకోవాలె కానీ ఇలా వీధి రౌడీల్లా, ఒకరిపై ఒకరు పడి కొట్టుకోవడం, బూతు పురాణాలు అందుకోవడం చూస్తుంటే ఇలాంటి వారు ప్రజా ప్రతినిధులుగా ఉండకూడదు అనేది తెలంగాణ ప్రజల ఆవేదన.
ప్రజలు మెచ్చేలా పాలన సాగాలి!
ఎన్నో ఆశలు కలిగిస్తూ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నవి. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా సమర్థవంతంగా పాలన సాగిస్తూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనా దీక్షితులుగా మొదటి వరుసలో ఉండాలని తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ప్రజాపాలన అంటే ఎలా ఉంటుందో సామాన్య ప్రజలు అడిగిన చెప్పే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించాలి. తెలంగాణ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా, సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు పాలనలో సమానమైన అవకాశాలు కల్పించాలని, వచ్చిన అవకాశాన్ని కొన్ని తరాల ప్రజలు చర్చించుకునే, మెచ్చుకునేలా పాలన సాగించాలని, ఆశిద్దాం.
ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు!
ఏది ఏమైనా రాష్ట్ర రాజధాని వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర సంస్కృతిక, సంప్రదాయాలకు, ప్రయోజనాలకు, విరుద్ధంగా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు హైదరాబాద్ నెలవు అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ప్రభుత్వంపైనా ఉంది.
ఎర్ర కృష్ణ జాంభవ్
తెలంగాణ హైకోర్టు న్యాయవాది
96404 11238