రైతులతో చర్చలు...ఉద్యమం పక్కదారి పట్టించేందుకే!

by Ravi |   ( Updated:2024-02-27 01:00:21.0  )
రైతులతో చర్చలు...ఉద్యమం పక్కదారి పట్టించేందుకే!
X

గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ కోర్కెల సాధన కోసం తిరిగి ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. రైతాంగ ఉద్యమానికి భయపడి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నా దొడ్డిదారిన మోదీ ప్రభుత్వం వాటిని అమలు జరుపుతూనే ఉంది. మద్దతు ధరలకు చట్టబద్ధత గురించి కమిషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి సంవత్సరాలు గడిచినా దాని ఊసే ఎత్తలేదు. చట్టబద్ధత గురించి రైతాంగం ఎన్నిసార్లు అడిగినా మోదీ ప్రభుత్వం నుంచి సమధానమే లేదు. చట్టబద్దత విషయమై విసిగి వేసారిన రైతాంగం దాన్ని సాధించుకునేందుకు తిరిగి ఉద్యమ బాట పట్టక తప్పలేదు. ఆ మేరకు కార్యాచరణ ప్రకటించి మోదీ ప్రభుత్వానికి కూడా తెలియజేశారు.

రైతు సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక నిర్ణయం ప్రకారం 13-2-2024న రైతాంగం ఆందోళన ప్రారంభించారు. రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ఉద్యమ అణచివేతకు మోదీ ప్రభుత్వం పూనుకుంటున్నది. పంజాబ్, హర్యానా సరిహద్దుల వద్దకు రెండు రాష్ట్రాలకు చెందిన రైతాంగం వేలాది ట్రాక్టర్లతో ముందుకు సాగారు. రైతులను అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులను హర్యానా ప్రభుత్వం సరిహద్దుల వద్దకు పంపింది. ఫిబ్రవరి 13న ప్రారంభమైన రైతుల ఆందోళన ఢిల్లీ వెళ్లేందుకూ ఉదృత రూపం దాల్చింది. 21-2-24న ఉదయం ఢిల్లీ వైపు వెళ్లేందుకు 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులతో కదిలారు. శంభూ-కనేరీ సరిహద్దు వద్ద బారికేడ్లను దాటే ప్రయత్నం చేశారు. పోలీసుల టియర్ గ్యాస్ ప్రభావానికి శుభకరణ్ సింగ్ (22సం.) అనే రైతు యువకుడు మరణించాడు.

కేంద్రం దిగొచ్చింది కానీ....

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని ఇంకా అనేక డిమాండ్లతో 2021లో దేశ వ్యాపితంగా 18 నెలల పాటు సాగిన రైతాంగ ఉద్యమం మోదీ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో కదం తొక్కిన రైతాంగం మోదీ ప్రభుత్వ పాలననే స్థంభింప చేసింది. ఈ ఉద్యమంలో 700 దాకా రైతులు ప్రాణ త్యాగం చేశారు, వేలాది మంది రైతులు పోలీసు నిర్బంధానికి గురై అరెస్టులు, అక్రమ కేసులకు గురైయ్యారు. నిర్భంధానికి భయపడకుండా సాగిన రైతాంగ ఉద్యమానికి మోదీ ప్రభుత్వం లొంగక తప్పలేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, పార్లమెంట్ లో వాటిని ఉపసంహరించుకుంది. రైతుల ప్రధాన డిమాండ్ అయిన పంటల మద్దతు ధరలకు చట్టబద్దత విషయం పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటించింది.

మద్దతు ధరలకు చట్టబద్ధత

అసలు ప్రభుత్వ మద్దతు ధరల నిర్ణయమే వంచనా పూరితమైంది. సేద్యపు ఖర్చు అంటే, అందుకు బ్యాంకులు ఇచ్చే 25వేలనే ప్రామాణికంగా తీసుకున్నది. ఇది రైతులకు నష్ట దాయకమైంది. సేద్యపు ఖర్చుల్లో కుటుంబ శ్రమ, భూమి అద్దె, అప్పులకు వడ్డీలు కలసి ఉంటాయి. కానీ ప్రభుత్వ అలా సేద్యపు ఖర్చులను పరిగణలోకి తీసుకోకుండా ప్రకటించే మద్దతు ధరలు రైతులకు నష్టదాయకంగాను, బడా వ్యాపారులకు లాభసాటిగా మారింది. ఇలా ప్రకటించే ధరలకు కూడా చట్టబద్ధత లేకపోవటం వల్ల వ్యాపారులు పంటల ధరలను తమ ఇష్టానుసారంగా ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరల మోసాన్ని గ్రహించిన రైతాంగం మద్దతు ధరలు ప్రకటించి వాటికి చట్టబద్ధత కల్పించాలని కోరటం న్యాయమైనది. దీన్ని ప్రజలు గుర్తించి మద్దతు ఇవ్వాలి.

మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే తన ఇష్టులైన బడా వ్యాపారుల లాభాలు తగ్గుతాయని అందుకు మోదీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది. పంటలకు చట్టబద్దత కల్పిస్తే ఆహార ధాన్యాల ధరలు పెరిగి వినియోగదారులపై భారం పడుతుందని కుహనా మేధావులు చెబుతున్నారు. పంటలకు న్యాయమైన ధరలు లభించక రైతులు నష్ట పోతుంటే, వినియోగదారులు అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. బడా వ్యాపారులు రైతులను, వినియోగదారులను దోచుకుంటున్నారు. రైతుల పంటలకు చట్టబద్దత కల్పిస్తే ధరలు పెరగవు. సేద్యానికి కావాల్సిన వాటి ధరలు తగ్గిస్తే ఉత్పత్తి ఖర్చులు తగ్గి మార్కెట్లో వినియోగదారులకు సరసమైన ధరలకే ఆహార ధాన్యాల లభిస్తాయి. బడా పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్న మోదీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు పెంచితే ధరలు పెరగాల్సిన అవసరమే ఉండదు. ఈ వాస్తవాన్ని కుహనా మేధావులు ఎందుకు గుర్తించరు?

గ్రామాలకు నేతలను రానీయం...

మమ్ములను ఢిల్లీ వెల్లనీయకపోతే రాజకీయ నాయకులను గ్రామాలకు రానీయమని రైతులు, రైతు సంఘాల నాయకులు హెచ్చరికలు చేశారు. యువ రైతు మరణం, పలువురు రైతులకు గాయాలతో పరిస్థితి ఉధృతంగా మారటంతో మరోసారి చర్చలకు మోదీ ప్రభుత్వం రైతులను ఆహ్వానించింది. ఫలితంగా రైతులు రెండు రోజులు ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కాకుంటే 23న కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ప్రకటించింది. యువ రైతు మృతికి సంతాపంగా బ్లాక్ డే తో పాటు హో మంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రిపై హత్య కేసు బనాయించాలని డిమాండ్ చేస్తుంది. మోదీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నది. ఇంతకు ముందు ఇలానే చేసింది. దీన్ని రైతులు గ్రహించి ఉద్యమాన్ని ఉధృతం చేసి మోదీ ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.

- బొల్లిముంత సాంబశివరావు

98859 83526

Advertisement

Next Story

Most Viewed