- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యక్ష నిరసనోద్యమమే పరిష్కారం!
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పేరు ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా. ఆయన అకస్మాత్తుగా, అకాల మరణం పొందిన నాటి నుండి నేటి వరకు సంతాప సభలు సమావేశాలు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. దిన పత్రికల్లో, టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఆయన అకాల మరణంపైన, ఆయన ఔన్నత్యంపైన, పాలకులపైన, న్యాయస్థాన తీర్పులపైన విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను పోస్టుమార్టం చేసినంత పని చేస్తున్నారు. మేధావులు, రాజకీయ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు చర్చోపచర్చలు చేస్తున్నారు. ఒక రకంగా ఇదంతా మంచి పరిణామమే. కానీ, సాయిబాబా పనిచేసిందీ, కోరుకున్నదీ ఇందుకోసం మాత్రమే కాదు. ప్రత్యక్ష నిరసన, ఉద్యమ కార్యాచరణ అనివార్యతను గుర్తించి నడుచుకోవడం పౌర సమాజం బాధ్యత.
నిజాలు చెప్పినందుకు, అమాయకులకు అండగా నిలిచినందుకు, యువతను చైతన్యపరచినందుకు, జాతి విముక్తి కోసం పోరాడినందుకు, స్వాతంత్ర అభిలాష వ్యక్త పరిచినందుకు పాలకులు కక్ష కట్టడం, బలి తీసుకున్న ఘటనలు చరిత్రలో అడుగడుగునా కనిపిస్తాయి. సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేసినందుకు బ్రూనోను పలు చిత్రహింసలకు గురి చేసి సజీవ దహనం చేశారు. మూఢనమ్మకాలను ప్రశ్నించి, జ్ఞాన మే ధర్మమని యువకులను చైతన్యపరచినందుకు సోక్రటీసుకు విషమిచ్చి చంపారు. బానిసల విముక్తి కోసం తిరుగుబాటు చేసిన నాయకుడు స్పాటకస్‌ను శిలువ వేసి చంపారు. ఆదివాసుల, మూలవాసుల స్వాతంత్ర్య కాంక్ష కోసం ఉద్యమించిన కొమురం భీం, రాంజీ గోండు, సీతారామరాజులను చంపేశారు. భగత్ సింగ్ ఆజాద్ సుఖదేవ్‌లను చెరసాల పాలు చేసి ఉరికంబం ఎక్కించారు.
మన కళ్లముందే బలైన సాయిబాబా
ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని చారిత్రక వాస్తవాలు. ఆదివాసులు దళితులు, మైనారిటీలు, అణచివేతకు గురవుతున్న జాతులకు అండగా నిలినందుకు జి. ఎన్ సాయిబాబా మన కళ్ల ముందే బలయ్యాడు. కేవలం 58 ఏళ్ల వయసులో 90% వికలాంగుడిగా ఉండి ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయనకు మరణం సంభవించింది. అన్యాయంగా సుమారు పదేళ్ల పాటు అత్యంత ఘోరమైన అండా సెల్‌లో నిర్బంధించడమే అందుకు ప్రధాన కారణం. నిర్బంధ కాలంలో సరైన వైద్య సౌకర్యం అందక, సరైన వసతులు లేక, స్వచ్ఛమైన గాలి లభించక, మనుష్య సంబంధాలు దూరమై ఒంటరితనం కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురై తీవ్ర యాతన అనుభవించాడు. ఈ పదేళ్ల జైలు నిర్బంధ కాలమే ఆయన మృత్యువుకు దారి తీసింది.
ఐరాస జోక్యం చేసుకున్నా ఫలించలేదు!
సాయిబాబా విడుదల కోసం అనేక ప్రజా సంఘాలు, పలు యూనివర్సిటీల మేధావులు, విద్యార్థులు, రచయితలు, కవులు, కళాకారులు చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు. చివరకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. తన మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మానవతా దృష్టితో నైనా అనుమతి లభించలేదు. చావును నిరాకరిస్తున్నారని బహిరంగంగా ప్రకటించి, చనిపోయే ఆరు మాసాల ముందు నిర్దోషిగా విడుదలైన పోరాటయోధుడు సాయిబాబా. ఆయన విడుదలై బయటకు వచ్చిన సమయంలో ఈ వాతావరణం ఆయనకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. తర్వాత ఏం చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు, ప్రజాసేవకే పునరంకితమవుతానని బలంగా ప్రకటించాడు. ఆదివాసుల కోసం, వారికి రక్షణ ఇచ్చే అడవి కోసం, శతాబ్దాలుగా వారి కాళ్ల కింద రక్షణలో ఉన్న ఖనిజాలను కార్పొరేట్ సంస్థల దోపిడీకి గురికాకుండా కాపాడేందుకు కృషి చేశారు. తనకు అంగవైకల్యం శరీరానికి మాత్రమే, మనసుకు కాదని ప్రకటించే ఆచరణతో చేశారు.
మెదడు చురుగ్గా పనిచేయడమే నేరమని..
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి వచ్చి హైదరాబాద్, ఢిల్లీలో చదువు పూర్తి చేసి, ఉద్యోగం చేసినా జీవితకాలం ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల, ఆదివాసుల, వివిధ జాతుల విముక్తి పోరాటాల గురించే ఆలోచించాడు, చర్చించాడు, కార్యోన్ముఖుడై పనిచేశాడు. ఈ దేశ ప్రజల హక్కుల కోసం, కనీసం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆలోచించడమే పెద్ద నేరం అయింది. మెదడు చురుగ్గా పని చేయడమే బెయిల్ రాకుండా, ఘోరమైన శిక్ష విధించేందుకు కారణంగా కోర్టు వివరించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన అన్వేషణల విషయానికొస్తే ఆయనలో చైతన్యవంతంగా పని చేసింది కేవలం మెదడు మాత్రమే. ఇటు సాయిబాబా, అటు స్టీఫెన్ హాకింగ్ వీల్ చైర్‌కు మాత్రమే పరిమితమై భవిష్యత్ తరాల కోసం తమ జీవితాలను అంకితం చేశారు. సాయిబాబాకు వేసిన శిక్ష, స్టీఫెన్ హాకింగ్‌కు కూడా వేసి ఉంటే సైన్స్ పురోగతి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
నాటి ప్రత్యక్ష కార్యాచరణ ఇప్పుడేది?
మానవాళి అభివృద్ధి కోసం, ప్రకృతి వనరుల రక్షణ కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, నిజాలు మాట్లాడినందుకు, దుర్మార్గాలను ప్రశ్నించినందుకు గొంతు నొక్కి వేయడం, జైళ్ల పాలు చేయడం, పలు రకాలుగా చంపడం నిత్యకృత్యమైంది. చనిపోయిన వెంటనే ఘనంగా అంతిమయాత్ర నిర్వహించడం, నిరసనగా బిగ్గరగా నినదించడం, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో చర్చలు జరపడం, సభలు సమావేశాలతో హోరెత్తించడం ఆనవాయితీగా మారింది. ఈ స్ఫూర్తి వారిని బతికించుకునేందుకు, కాపాడుకునేందుకు అవసరమైన ప్రతిఘటన రూపంలో కానరావడం లేదు. అమాయకులను ఎందుకిలా అక్రమంగా నిర్బంధిస్తున్నారని గానీ, వేధిస్తున్నారని గానీ ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణతో రాజ్యాన్ని అడ్డుకున్న ఘటనలు అరుదుగా ఉన్నాయి. భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష విధించిన సమయంలో శ్రీ శ్రీ నాయకత్వంలో పౌర సమాజం జైలు వద్దే నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పలుమార్లు వాయిదా పడింది. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చారు. కారంచేడు ఘటనపై స్థానికంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరి పారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సరైన సమయంలో ప్రత్యక్ష కార్యాచరణతో, సంఘటితంగా ఉద్యమించి పాలకుల దుర్నీతిపై పోరాడితే అనేక మందిని ప్రాణాలతో దక్కించుకో గలిగేవాళ్లమేమో..?
పీడితుల పక్షం వహిస్తే పాశవిక శిక్షలు
ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులు చేస్తున్న అకృ త్యాలు, హత్యలపై సరైన విచారణ ఉండదు, శిక్షలు ఉండవు. బడుగు బలహీన వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు అండగా నిలిచి పోరాడిన వారికే కొత్త కొత్త చట్టాలతో పాశవిక శిక్షలు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు కోసం, ప్రాథమిక హక్కుల కోసం ఉద్యమించడమే కాక, పాలకులను నిలదీసి ప్రశ్నించనంత కాలం సాయిబాబాలు వేధింపబడుతూనే ఉంటారు. వేటాడబడుతూనే ఉంటారు. బాధింపబడుతూనే ఉంటారు. బలవుతూనే ఉంటారు. పాలకుల ఫాసిస్ట్ వైఖరిని ప్రతిఘటించకపోతే, ఇలాంటి పాశవిక చర్యలు పునరావృతం అవుతాయి. పాలకు లు అమలు పరుస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలి, ప్రతిఘటించాలి. మానవతావాది సాయిబాబా రగిలించిన స్ఫూర్తితో ప్రజలను చైతన్యపరచాలి.
- రమణా చారి
99898 63039