- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెనడాలో భారతీయ విద్యార్థుల కష్టాలు..
భారతదేశంలోని విద్యార్థులకు అత్యంత ఇష్టమైన నాలుగు గమ్యస్థానాలలో కెనడా ఒకటి. కెనడాకు వెళ్లే 72 శాతం మంది భారతీయ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ పొందాలని కోరుకుంటారు, అయితే 60 శాతం మంది కెనడాలో శాశ్వత నివాసం పొందాలని ఆకాంక్షిస్తారు. 2023 నాటికి, భారతదేశం నుండి దాదాపు 3,30,000 మంది కొత్త వలసదారులు (విద్యార్థులతో సహా) కెనడాలో నివసిస్తున్నారు.
అద్దెలు చెల్లించడానికి సరిపోక..
ఇటీవలి కాలంలో కెనడాలో విద్య, ఉపాధి లక్ష్యాలను సాధించడంలో భారతదేశంలోని విద్యార్థులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇందులో మొదటిది సౌకర్యవంతమైన వసతి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 3.45 లక్షల గృహ యూనిట్ల కొరత ఉంది. భవిష్యత్తులో 35 లక్షల యూనిట్లకు పైగా గృహాల కొరతను అంచనా వేసింది, అంటే ప్రస్తుత కొరత కంటే 10 రెట్లు ఎక్కువ. చాలా ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా వసతి గృహాలు లేకపోవడంతో విద్యార్థులు అద్దె వసతి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. గత సంవత్సరం వరకు విదేశీ జీఐసీ ( విద్యార్థి ఒక సంవత్సరం పాటు వారి జీవన వ్యయాలను కవర్ చేయడానికి తమ వద్ద నిధులు ఉన్నాయని ప్రభుత్వానికి అందించాల్సిన హామీ) దీనిని కెనడా ప్రభుత్వం పెంచేసింది. దీంతో పెరుగుతున్న అద్దెలతో, జీఐసీ కింద వచ్చే రాబడి తమ అద్దెలకు చెల్లించడానికి కూడా సరిపోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
తగ్గిపోతున్న పార్ట్‌టైమ్ జాబ్స్
అంతేకాకుండా, విద్యార్థులకు కళాశాలలు వసూలు చేసే ట్యూషన్ ఫీజు రెసిడెంట్ కెనడియన్లు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ. ఇప్పుడు పని దొరకడం చాలా కష్టంగా ఉంది. వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం 600-700 మంది విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి దుకాణాలు, రెస్టారెంట్‌ల వెలుపల గంటల తరబడి పొడవాటి క్యూలలో నిలబడుతున్నారు. అంతేకాకుండా, అనేక ప్రాంతీయ ప్రభుత్వాలు విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత వర్క్ పర్మిట్‌ల నిబంధనలను మారుస్తున్నాయి. ఉదాహరణకు, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ తూర్పు ప్రావిన్స్‌లో, ఆరోగ్య సంర క్షణ, ప్రాథమిక విద్య వంటి కొన్ని ఎంపిక చేసిన పని రంగాలలో మాత్రమే ఇప్పుడు కొత్త వలసదారులకు శాశ్వత నివాసం ఇవ్వబడుతుంది. దీంతో చాలా మంది భారతీయ విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత కెనడా వదిలి వెళ్ళవలసి వస్తుంది.
మధ్యలో నిబంధనలు మార్చవద్దు!
కానీ ఇప్పుడు వారి అవకాశాలు మసకబరుతున్నాయి. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్‌లోని భారతీయ విద్యార్థులు ప్రాంతీయ ప్రభుత్వం చేసిన ఈ నిబంధనల మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. తమ అకడమిక్ ప్రోగ్రామ్ మధ్యలో వీసా పొడిగింపు, వర్క్ పర్మిట్ల నిబంధనలు మార్చరాదని డిమాండ్ చేస్తున్నారు. స్టడీ పర్మిట్‌లు పొందినప్పుడు అమలులో ఉన్న నిబంధనలనే తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752