'రూట్' మార్చిన భక్తి చిత్రాలు

by Ravi |   ( Updated:2023-07-01 00:31:28.0  )
రూట్ మార్చిన భక్తి చిత్రాలు
X

చిత్ర పరిశ్రమకు ప్రేమ, హాస్యం తర్వాత లాజిక్ తో పని లేకుండా ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పించే అంశం ‘భక్తి’. 1950ల నుంచి నేటి ఆది పురుష్ వరకు ఇందుకు ఉదాహరణగా అనేక సినిమాలను చూపించవచ్చు. ప్రతి దర్శకుడు ఏదో ఒక దశలో ‘భక్తి’ని నమ్ముకొని చిత్రం తీసినవారే. కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఎంతో మంది దర్శకులు తమ సిద్ధాంతాలను ప్రక్కన పెట్టకుండానే ఈ కోవకు చెందిన చిత్రాలు నిర్మించి, దర్శకులుగా తన స్థానమును సుస్థిరం చేసుకున్నారు. దానికి ఉదాహరణే వి. మధుసూదన్ రావు, ఆయన తొలి చిత్రం ‘సతి తులసి’ తర్వాత కాలంలో ‘వీరాభిమన్యు’, ‘భక్తతుకారం’ వంటి సినిమాలు తీశారు. పురాణ చిత్రాల బ్రహ్మగా కమలాకర కామేశ్వరరావు గారిదో ప్రత్యేకమైన బాణీగా చెప్పుకోవాలి. కాలక్రమంలో వచ్చిన మార్పులను గమనిస్తూ భక్తి చిత్రాలను ఆయన చేశారు. ‘వినాయక విజయం’ అటువంటిదే. సి.ఎస్.రావు వంటి వారు ‘కృష్ణాంజనేయ యుద్ధం’లో రాజనాల, ఎన్టీఆర్‌ల మధ్య సంభాషణలలో సామ్య వాదం, రాజరికం, పెట్టుబడి వర్గాలు దోపిడీ వంటి అంశాలను అంతర్లీనంగా చెప్పించి సంభాషణలు రాయించుకున్నారు. జనం మెచ్చుకున్నారు. ఇక ‘బాపు’ గురించి, ఆయన తీసిన ‘రామాయణ కథ’ చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘లవకుశ’ (పి.పుల్లయ్య, సి.ఎస్.రావు) సృష్టించిన ప్రభంజనం ఓ చరిత్ర.

గుడిని ప్రధాన కథా వస్తువుగా..

వర్తమానంలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ‘నోము’ సినిమాతో పాముల ప్రపంచం తెరమీదకు ‘రంగుల్లో’ తెచ్చారు ఏ.వీ.ఎం. అంతకుముందు కూడా పాములు చిత్రాలు వచ్చాయి. కానీ ‘పాము’ హీరోగా వచ్చిన సినిమాలు అటు భక్తికి, ఇటు కాసులకి కూడా. పాము నిర్మాతలకు గిరాకీ వస్తువుగా రూపాంతరం చెందింది. క్రమేపీ కాలంలో వచ్చిన సాంకేతిక మార్పులు, ప్రేక్షకులలో వస్తున్న ఆలోచన తీరును గమనించిన నిర్మాత, దర్శకులు నాటి ‘నాగిన్’ నుంచి నేటి ‘విరూపాక్ష’ వరకు ఓ ‘ఫాంటసీ’ కథలను తయారు చేస్తున్నారు. క్షుద్ర శక్తికి, దైవభక్తికి మధ్య యుద్ధంగా హీరో, విలన్లను సృష్టిస్తున్నారు. ప్రయోగాలు చేస్తున్నారు. శ్రీదేవి ‘నాగిన్’, ‘దేవతలారా దీవించండి’ నుంచి ఈ మధ్య వచ్చిన ‘కాంతారా’ వంటి చిత్రాలు విజయవంతమై దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఓ విజయవంత ప్రయోగాత్మక భక్తి చిత్రాలకు మార్గం సుగమం చేశాయి.

మారుతున్న కాలంతో పాటు సాంకేతిక అభివృద్ధి సాధ్యమైంది. మంచి చిత్రాలతో పాటు విపరీత ధోరణుల చిత్రాలు ‘భక్తి’ పేరుతో జనం మీదకు వదిలేస్తున్నారు. ‘అమ్మోరు’, ‘దేవి పుత్రుడు’, ‘దేవి’ చిత్రాల వేగం వలన కావచ్చు. ఓ రెండు చిత్రాల విజయం కావచ్చు. నిర్మాతలకు ధైర్యం వచ్చి ‘కన్నయ్య - కిష్టయ్య’ వంటి చిత్రాలను తీశారు. చేతులు కాల్చుకున్నారు. ‘యమదొంగ’ నుంచి రాజమౌళి మార్కు భక్తి, రక్తి ప్రభంజనం మొదలైంది. ‘గుడి’ ఓ ప్రధాన కథా వస్తువుగా మారింది. ఇవన్నీ గతంలో లేవని కాదు. కానీ సినిమాలో ప్రధానమైన ‘ట్విస్టు’కి ‘దేవాలయం’ ఓ ప్రధాన అంశం అయింది. ‘మురారి’, ‘శ్రీ ఆంజనేయం’, ‘కార్తికేయ’, ‘కార్తికేయ- 2’ వంటి వాటి విజయాలు ఇందుకు ఊపిరి పోసాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘బంగార్రాజు’ వంటి సీక్వెల్స్ కూడా వచ్చాయి. సొమ్ము చేసుకున్నాయి. కేరళలోని గుడి అని చెప్పి ‘యాగంటి’లో సినిమా తీసి ప్రేక్షకులు చెవులో పూలు పెట్టిన ‘భక్తి’, ‘ప్రేమ’ చిత్రాలు కూడా వచ్చాయి.

గ్రాఫిక్స్ తో.. ఫీలింగ్స్ తెప్పించలేం!

మితిమీరిన సాంకేతికతకు ప్రాధాన్యం కల్పిస్తూ వచ్చిన ‘ఆది పురుష్’ రామాయణ కథకు కొత్త భాష్యం చెప్పింది. ‘వీఎఫ్‌ఎక్స్’ ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో నటీనటుల ప్రతిభ, రామాయణ కథలోని భావోద్వేగాలు, కుటుంబ పరమైన ధర్మాధర్మ సూత్రాలు ఎంతవరకు ప్రేక్షకులకు చేరాయో ఎన్నో సమీక్షలు తెలిపాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు-కే కూడా విష్ణు తత్వాన్ని చెప్పే కథని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'ఆదికేశవ'లో, ‘రుద్రకాళేశ్వర్ గుడి’ వెనుక మాఫియా నీడలతో చేసిన యుద్ధంను చూపించబోతున్నట్టు లీకులు ఉన్నాయి. సందీప్ కిషన్ నటిస్తున్న ‘భైరవకోన’ పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ‘హను-మాన్’ వంటి చిత్రాలు ఏ మేరకు ప్రేక్షకులను రప్పించి భ(ర)క్తి చిత్రాలుగా నిలుస్తాయో వేచి చూడాలి.

భక్తి చిత్రాల నిర్మాణంలో ప్రధానమైనది కథకు సరిపడిన తారలు. వారి నుంచి నటనను రాబట్టుకునే దర్శకులు. ఎమ్మెస్ రెడ్డి (శ్యాం ప్రసాద్ రెడ్డి) వంటి వారు ‘అమ్మోరు’, ‘అరుంధతి’లకి ముందు.. అందరూ బాలలే నటించిన రామాయణం తీసి విజయం సాధించారు. బాల భారతం, ‘యశోద కృష్ణ’ (ఈ రెండు చిత్రాలకు కే.కామేశ్వరరావు దర్శకుడు) వంటి వాటి తరువాత రామాయణం.. బాలలతో వచ్చింది. పై రెండు చిత్రాలలో కొన్ని ప్రధానమైన పాత్రలు ప్రసిద్ధ నటులు నటించారు. ఎందుకీ ప్రస్తావనంటే, భక్తి చిత్రాలు నిర్మించే ముందు ‘కమిట్మెంట్’ అవసరం. నాగయ్య నుంచి ఎన్టీ రామారావు, అక్కినేని వంటి వారు భక్తి చిత్రాల్లో గొప్పగా నటించి ఆ సినిమాలకే వన్నె తెచ్చారు. వి.ప్రనారాయణ, భూకైలాస్‌లో నుంచి చక్రధారి, దానవీరశూరకర్ణ వరకు ఆయా నటుల, దర్శకులు అంకిత భావం తెలుస్తుంది. అంజి, దేవీపుత్రుడు లాంటి చిత్రాలు ఎందుకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయో అందరికీ తెలిసిందే. ఏతా వాత చెప్పేదేమిటంటే పాన్ ఇండియా భక్తి చిత్రాలు తీసిన, పాత్రలకు సరిపడే పాత్రధారులు లేకుంటే ‘గ్రాఫిక్స్’ లో అద్భుతాలు చేయవచ్చు కానీ ‘ఫీలింగ్స్’ ని సృష్టించి ప్రేక్షకులను మెప్పించలేమనేది తెలుసుకోవాలి. భక్తితో తీసే సినిమాలు కావాలి.. గానీ కేవలం భక్తి సినిమాలు త్రీడీలో తీసిన ప్రయోజనం శూన్యం. ‘రూట్’ మార్చుకున్న భక్తి చిత్రాలు ‘రూకలు’ తెచ్చి పెట్టలేవనేది సత్యం.

భమిడిపాటి గౌరీశంకర్

-94928 58395

Advertisement

Next Story