ఈ జాప్యం...విద్యార్థులకు శాపం

by Ravi |   ( Updated:2024-10-13 00:45:32.0  )
ఈ జాప్యం...విద్యార్థులకు శాపం
X

ప్రతీ పేద విద్యార్థికీ ఉత్తమమైన విద్యను అందించడం.. ప్రతీ పేద, మధ్యతరగతి విద్యార్థుల లక్ష్యాలకు ఆర్థికంగా అండగా ఉండి వారిని ఉన్నత స్థానాల్లో ఉంచడమే లక్ష్యంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు ఉపకార వేతనాన్ని ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్ స్థాయి విద్యను అభ్యసించలేని స్థాయి నుంచి... నేడు ఐఐటి, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ విద్యను సులువుగా విద్యార్థులు అభ్యసిస్తున్నారంటే కారణం ఫీజు రీయింబర్స్‌మెంటు ఉపకారమే కారణం. ఆ పథకం గానీ ఆనాడు ప్రవేశపెట్టి ఉండకపోతే ఈనాడు ఎవరూ ఇంత పెద్ద సాహసం చేసే వారు కాదు. కానీ ప్రస్తుతం అదే ఫీజు రీయింబర్స్‌మెంటు విద్యార్థులను చిదిమేస్తున్నది. కళాశాలల్లో చేరిన విద్యార్థులకు సకాలంలో రీయింబర్స్‌మెంటు రాకపోవడంతో తిప్పలు పడక తప్పడం లేదు. దీంతో డిగ్రీ, ఆపై చదువులకు వెళ్లాలంటే ఆర్థిక భారంగా మారిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు డిగ్రీ ఆపై విద్యను అభ్యసించడానికి కచ్చితంగా ప్రైవేటు కళాశాలలను ఆశ్రయించక తప్పదు. అటు ఇంజనీరింగ్‌లో చేరాలన్నా ప్రైవేటు కళాశాలలే పెద్ద దిక్కుగా మారాయి. అయితే, ఆ కళశాలల్లో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు రాకపోవడం శాపంగా మారింది. సంవత్సరాల తరబడి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు అందడం లేదు. అయినప్పటికీ ఆయా ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను తిప్పలు పెట్టలేక వారు అప్పుల్లో కూరుకుపోతున్నా కళాశాలలను నడిపించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ విద్యార్థులకు సుమారుగా ప్రభుత్వం రూ. 6500 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంటు కింద అందించాల్సి ఉంటుంది. దీంతో అటు కళాశాలల యాజమాన్యం, ఇటు విద్యార్థులు తిప్పలు పడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

విద్యను విస్మరిస్తే భవిష్యత్తు శూన్యం

విభజన అనంతరం తెలంగాణలో ఉపకారవేతనాలు రెగ్యులర్‌గా అందకపోవడంతో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. తమ చదువులు పూర్తయినా కళాశాలలకు ఉపకార వేతనాలు అందకపోవడంతో కళాశాలలు వారి సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కారణం వారికి అందించాల్సిన ఉపకార వేతనం అందకపోవడమే. దీంతో విద్యార్థులు చేసేదేమి లేక అక్కడే ఆగిపోయి ఉన్నత చదువులకు ముందుకు సాగని దయనీయ స్థితిలు దాపురించాయి. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి వారికి ప్రైవేటు కళాశాలలే దిక్కవుతున్నాయి. కారణం ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య పెరగడం.. ప్రభుత్వ కళాశాలలు తక్కువగా ఉండడం. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో అవకాశం దొరకని వారు ప్రైవేటు కళాశాలల్లో ఉపకార సాయంతో చదువులు సాగించి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని చేరుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో చదివి పార్లమెంటులో ప్రసంగానికి ఎంపికైన విద్యార్థులు ఉన్నారంటే వారు అందిస్తున్న విద్యా నాణ్యత స్పష్టం అవుతుంది.

ఉపకారవేతనాలు అందడం లేదు

ప్రభుత్వ కళాశాలలకు ఏ మాత్రం తగ్గకుండా మౌలిక వసతులూ కల్పించడం, బోధన కోసం, అధ్యయనం కోసం ప్రయోగశాలలు వంటి వాటితో విద్యార్థులకు లోపం లేకుండా తరగతులు అందిస్తున్నారు. అటువంటి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు కళాశాలలను నడపడమూ పెద్ద సవాల్ మారింది. అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందిస్తున్నప్పటికీ బకాయిలు ఇవ్వకపోవడంతో అటు విద్యార్థుల నుంచి మరీ ఇబ్బందులకు గురి చేయక తిప్పలు పడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూలు డిగ్రీ స్థాయి నుంచి వృత్తి విద్యా కోర్సులు బీఎస్సీ నర్సింగ్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి చదువులన్నీ ప్రైవేటు మీదనే ఆధారపడవలసి వస్తుంది. దీంతో విద్యార్థుల ఉన్నత చదువుకు ఉన్న ఏకైక అంశం ఉపకార వేతనం మీద చదువుకునే అవకాశం. అటువంటి విద్యార్థులకు సరైన సమయంలో ఉపకార వేతనాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ... పేదోడి ఉన్నత చదువుపై నిర్లక్ష్యం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్షించి ఉపకార వేతనాలు విడుదల చేసి .. విద్యార్థులకు వ్యథలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.

రీయింబర్స్‌మెంటు రాకపోతే సర్టిఫికెట్లు ఇవ్వం

ప్రస్తుతం ఆయా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు తమ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అక్కడక్కడ కళాశాలలు నిరాకరిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక అప్పులు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంది. ఈ సమయంలో అభ్యర్థి నమోదు చేసుకోవాలంటే సర్టిఫికెట్లు కావాల్సి ఉంటుంది. కళాశాలలు తప్పనిసరిగా పూర్తిగా బకాయిలు చెల్లిస్తేనే ఇస్తామంటుండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. ఈ మధ్య బీఎస్సీ నర్సింగ్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అప్పటికి కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంటు రాకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడానికి చాలా కళాశాలలు నిరాకరించాయి. దీంతో లక్షలు అప్పులు చేసి ఫీజు బకాయిలు చెల్లించి తెచ్చుకొని ఉద్యోగ నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సకాలంలో విద్యార్థులకు వెంట వెంటనే ఉపకార వేతనాలు చెల్లిస్తే వారి ఉన్నత విద్యకు మెరుగైన అవకాశాలు కల్పించిన వారవుతారు. అలా కాకుండా ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తే .. ఉపకార వేతనాల మీద ఆధారపడి చదువుకుందామనుకునే విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పూర్తి స్థాయిలో విద్యార్థుల ఉపకార వేతనాలు అందించి వారి మెరుగైన భవిష్యత్తుకు ఆటంకం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

78933 03516

Advertisement

Next Story

Most Viewed