మానసిక సంఘర్షణాత్మక సినిమా డియర్ జిందగీ

by Ravi |   ( Updated:2023-02-10 19:15:18.0  )
మానసిక సంఘర్షణాత్మక సినిమా డియర్ జిందగీ
X



కాసుల వేట మధ్య హిందీ సినిమా రంగంలో అప్పుడప్పుడూ ఒకింత మంచి సినిమాలూ వస్తాయి అనేందుకు 'డియర్ జిందగీ' ఒక ఉదాహరణ. వర్తమాన సంక్షోభ, సంక్లిష్ట సమాజంలో అదీ మహానగర సమాజంలో ఉత్పన్నమవుతున్న మానసిక వేదనలనూ, ఆందోళనలనూ వాటి పర్యవసానాలనూ ఆవిష్కరించిన సినిమా 'డియర్ జిందగీ'. ముంబై లాంటి మహానగరంలో వర్తమాన సినిమాటోగ్రాఫర్‌గా ఎదగాలనుకుంటున్న కైరా తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడితో పడ్డ సంఘర్షణ, ఫలితంగా రూపొందిన ఆమె వ్యక్తిత్వం ఈ సినిమాలో ప్రధాన అంశం. ఇందులో కైరాగా ఆలియా భట్ చాలా సహజమైన నటనను ప్రదర్శించింది. ఇప్పటి నటీమణుల్లో అలియా భట్‌ది విశిష్ట స్థానమని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ఇక దిమాఖ్ డాక్టరుగా షారూఖ్ ఖాన్ తనకున్న కమర్షియల్ ఇమేజ్‌కు భిన్నంగా, లో ప్రొఫైల్‌లో ఎంతో హుందాగా నటించాడు. థెరపిస్ట్ ఖాన్ చికిత్సతో ఆమె క్రమంగా తన లోపలి భయాలనుంచి, అందరూ దూరమవుతారనే ఆందోళన నుంచి క్రమంగా బయటపడుతుంది. తల్లిదండ్రులను ప్రేమించడంతో పాటు ఇతరుల పట్ల వుండే సహానుభూతే మనిషికి సాంత్వన అని తెలుసుకుంటుంది. డాక్టర్ జహంగీర్ పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది కైరా. కానీ తనకూ కైరాకూ మధ్య వున్నది కేవలం థెరపిస్ట్ సంబంధమే తప్ప మరేమీ లేదని. సున్నితంగా తిరస్కరించి అద్భుతమైన భవిష్యత్తులోకి పయనించమంటాడు జహంగీర్. గొప్ప ఆశావహమైన నోట్‌తో సినిమా ముగుస్తుంది.

సుప్రసిద్ధ హిందీ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ఇటీవలి సినిమా 'పఠాన్' ఆర్థికంగా విజయవంతమయిన సినిమాగా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఆర్థిక విజయాలకు ఒకింత దూరమై దాదాపు సంక్షోభంలో కూరుకుపోయిన బాలీవుడ్‌గా పిలుస్తున్న హిందీ సినిమాకు ఈ సినిమా పెద్ద ఊరట. ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో సుమారుగా అయిదు వందల కోట్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ గురించి చెప్పనే అక్కర లేదు. KGF2, భజరంగీ భాయిజాన్, దంగల్‌ల తర్వాత హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'పఠాన్' పేరు తెచ్చుకుంది. ఇదంతా స్టార్‌గా షారుఖ్ ఖాన్‌కి పెద్ద ఊరట. అయితే ఆయనలో స్టార్‌కు ఉండే లక్షణాలతో పాటు నటుడిగా కూడా మంచి లక్షణాలే వున్నాయి. అందుకు గతంలో షారుఖ్ చేసిన కొన్ని మంచి సినిమాలు నిదర్శనంగా నిలబడతాయి. షారుఖ్ చేసిన మంచి సినిమాల్లో నాకు నచ్చిన ఒక సినిమా 'డియర్ జిందగీ' గురించి నాలుగు మాటలు రాద్దామనిపించింది. కాసుల వేట మధ్య హిందీ సినిమా రంగంలో అప్పుడప్పుడూ ఒకింత మంచి సినిమాలూ వస్తాయి అనేందుకు డియర్ జిందగీ ఒక ఉదాహరణ.

వర్తమాన సంక్షోభ, సంక్లిష్ట సమాజంలో అదీ మహానగర సమాజంలో ఉత్పన్నమవుతున్న మానసిక వేదనలనూ, ఆందోళనలనూ వాటి పర్యవసానాలనూ ఆవిష్కరించిన సినిమా 'డియర్ జిందగీ'. 'ఇంగ్లీష్-వింగ్లీష్' సినిమాతో మంచి పేరునూ గౌరవాన్నీ పొందిన గౌరీ షిండే రూపొందించిన రెండవ చిత్రం 'డియర్ జిందగీ'. ఇది కూడా స్త్రీ పాత్రను ముఖ్యాభినేతగా చేసి రూపొందించిందే. ముంబై లాంటి మహానగరంలో వర్తమాన సినిమాటోగ్రాఫర్‌గా ఎదగాలనుకుంటున్న కైరా తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక ఒత్తిడితో పడ్డ సంఘర్షణ, ఫలితంగా రూపొందిన ఆమె వ్యక్తిత్వం ఈ సినిమాలో ప్రధాన అంశం. చిన్న సినిమాలు, యాడ్ ఫిల్ములూ షూట్ చేస్తూ పూర్తి నిడివిగల సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తున్న కైరా తన అస్థిరమైన మానసిక స్థితి, ఫీలవుతున్న అభద్రత ఆమెను ఒక చోట వుండనీయవు. అపనమ్మకం ఆమెను నీడలా వెంటాడుతూ వుంటుంది. ఆ స్థితిలో అనేకమంది బాయ్ ఫ్రెండ్స్, ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ అవడం, ఆధునిక నగర వాతావరణంలోని సమస్త స్థితినీ ఆమె ఎదుర్కొంటూ వుంటుంది. ఆ స్థితి నుండి మామూలు స్థితికి వచ్చే క్రమమే ఈ సినిమా. ఇందులో కైరాగా ఆలియా భట్ చాలా సహజమైన నటనను ప్రదర్శించింది. ఇప్పటి నటీమణుల్లో అలియా భట్‌ది విశిష్ట స్థానమని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ఇక దిమాఖ్ డాక్టరుగా షారూఖ్ ఖాన్ తనకున్న కమర్షియల్ ఇమేజ్‌కు భిన్నంగా, లో ప్రొఫైల్‌లో ఎంతో హుందాగా నటించాడు.

నగర యువతి అంతరంగ ఆవిష్కరణ

సామాజిక సంఘర్షణలే కాకుండా చిన్ననాడు ఆమె తల్లిదండ్రులు ఆమె పట్ల ప్రవర్తించిన తీరు కూడా కైరా జీవితంపై పడుతుంది. అన్ని వొత్తిడులనుండీ బయటపడి సంపూర్ణ వ్యక్తిగా మరే క్రమమే ఈ సినిమా. కథ విషయానికి వస్తే కైరా సినిమాటోగ్రాఫర్‌గా ఎదగాలనీ ఎప్పటికయినా తనను తాను నిరూపించుకోవాలని కలలు కంటూ కష్టపడే యువతి. చిన్న యాడ్స్ తీస్తూ నిలదొక్కుకునే క్రమంలో వుంటుంది. అనేక మంది మిత్రులూ తారసపడతారు. రెస్టారెంట్ ఓనర్ సిద్‌తో స్నేహం కుదురుతుంది. తర్వాత షూటింగులో భాగంగా రఘువేంద్రతో పరిచయం చాలా దూరం పోతుంది. రఘువేంద్రకు అమెరికాలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఆ సినిమాకు కైరా పూర్తి స్థాయి సినిమాటోగ్రాఫర్‌గా వుంటుదని హామీ ఇస్తాడు. ఆమె అతని నుంచి మంచి జీవితాన్ని కోరుకుంటుంది. కానీ రఘువేంద్రకు మరొకరితో ఎంగేజ్మెంట్ అవుతుంది. అది తెలిసి కైరా తీవ్ర నిరాశకు గురవుతుంది. రఘువేంద్రతో అఫైర్ తెలిసి సిద్ ఆమె నుండి పక్కకు జరుగుతాడు. ఇంతలో ముంబైలో ఇంటి ఔనర్ ఇల్లు ఖాళీ చేయమంటాడు. గోవాలో వున్న తల్లిదండ్రులు అక్కడికి రమ్మంటారు. తప్పని స్థితిలో ఆమె గోవాకు షిఫ్ట్ అవుతుంది. సిద్, రఘువేంద్రల విషయంతో ఆమెలో అస్థిరత మరింత పెరుగుతుంది. ఆమెకు మానసిక సాంత్వన కలిగేందుకు సైకాలజిస్ట్- 'దిమాఖ్ కా డాక్టర్' ను కలవమని మిత్రులు చెబుతారు. అలాంటి థెరపిస్ట్ వుంటాడా అని ఆమె ఆశ్చర్యపోతుంది. గోవాలో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. కానీ కైరా... దిమాఖ్ కా డాక్టర్ జహంగీర్(షారూఖ్ ఖాన్) ను కలుస్తుంది. ఇక అక్కడినుండి ఆ ఇద్దరి నడుమా కొనసాగే అనేక థెరపీ సిట్టింగులు ఆమె అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ పోతాయి.

'మేధావి అంటే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తెలిసినవాడు కాదు, జవాబు వరకు చేరే ఓపిక వున్నవాడు' అని డాక్టర్ జహాంగీర్ కైరాకు చెబుతాడు. ఓపికగా నీ మనసులోని అన్నీ విషయాలూ బయటపెట్టు అవే నీకు సమాధానాలు చెబుతాయి అంటాడు. అంతే కాదు ఒక నాటి సిట్టింగులో సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లి తన చిన్నప్పుడు తరుచుగా తండ్రి సముద్రంతో కబడ్డీ ఆడటానికి ఇక్కడకు తీసుకొచ్చేవాడని చెబుతాడు. ముందుకొస్తున్న అలలతో కబడ్డీ ఆడడం కైరాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

సహానుభూతే మనిషికి సాంత్వన

ఇక మరోసారి సైకిల్ రిపేర్ చేస్తున్న జహంగీర్‌ను చూసి ఏమిటి మీరు రిపేరింగ్ కూడా చేస్తారా అంటుంది కైరా. రిపేర్ కాకుంటే సైకిల్‌ను రీసైకిల్ చేస్తానంటాడు జహంగీర్. కిలకిలా నవ్విన కైరా నా దిమాఖ్ కూడా రిపేర్ కాకుంటే దాన్ని కూడా రీసైకిల్ చేస్తారా అంటుంది. ఇట్లా అనేక సందర్భాల్లో కొటేషన్ల లాంటి డైలాగ్‌లతో సినిమా ముందుకు సాగుతుంది. కైరాలో ఆందోళనలకూ అస్థిరత్వానికీ ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తాత దగ్గర వదిలేసి అమెరికా వెళ్లిపోవడం, ఆమెను సరిగ్గా పట్టించుకోకపోవడం లాంటి సంఘటనలు ఆమె మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం జహంగీర్ తెలుసుకొని వివరిస్తాడు. ఆమె క్రమంగా తన లోపలి భయాలనుంచి, అందరూ దూరమవుతారనే ఆందోళననుంచి క్రమంగా బయటపడుతుంది. తల్లిదండ్రులను ప్రేమించడంతో పాటు ఇతరుల పట్ల వుండే సహానుభూతే మనిషికి సాంత్వన అని తెలుసుకుంటుంది.

డాక్టర్ జహంగీర్ పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది కైరా. కానీ తనకూ కైరాకూ మధ్య వున్నది కేవలం థెరపిస్ట్ సంబంధమే తప్ప మరేమీ లేదని. సున్నితంగా తిరస్కరించి అద్భుతమైన భవిష్యత్తులోకి పయనించమంటాడు జహంగీర్. గొప్ప ఆశావహమైన నోట్‌తో సినిమా ముగుస్తుంది. అలియా భట్, షారూఖ్ ఖాన్‌ల నటనతో పాటు వారి సంభాషణలూ ఆకట్టుకుంటాయి. ఇద్దరూ పరిపక్వమైన నటన ప్రదర్శించారు.

అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది, మంచి విజయాన్ని సాధించిన 'డియర్ జిందగీ' మహిళా సినిమానే కాకుండా మానసిక సంఘర్షణ లాంటి అనేక సమస్యల్ని చర్చిస్తుంది. సంగీతం, ఫోటోగ్రఫీ బాగుంటాయి.

"డియర్ జిందగీ " రచన, దర్శకత్వం గౌరీ షిండే, రెడ్ చిల్లీస్ నిర్మాణం.

వారాల ఆనంద్

9440501281

Advertisement

Next Story

Most Viewed