తమిళ సినిమాల్లో.. దళిత వాదానికి పెద్దపీట!

by Ravi |   ( Updated:2023-08-05 00:30:44.0  )
తమిళ సినిమాల్లో.. దళిత వాదానికి పెద్దపీట!
X

సినిమాలు సామాజిక దర్పణాలు. అవి సమాజాన్నీ, సామాజిక వాస్తవాల్నీ ప్రతిబింబించాలి. పొరలు పొరలుగా వున్న సామాజిక అంతరాల్ని, అణచివేతని, అరాచకాల్ని ప్రశ్నించాలి. కానీ వ్యాపార వూబిలో చిక్కి ఉన్నత వర్గాల చేతిలో వుండిపోయి సినిమా తన మౌలిక లక్షణాల్ని లక్ష్యాల్ని గాలికి వదిలేసిందనే చెప్పాలి. కానీ అన్నీ భాషా చిత్రాల కంటే భిన్నంగా ఇటీవల తమిళ సినిమా రంగంలో దళిత సమస్యల్ని ఉటంకిస్తూ, దళితుల్ని ఉన్నతీకరిస్తూ పలు సినిమాలు వచ్చాయి. విజయవంతమయ్యాయి. అదొక మంచి పరిణామం. మిగతా భాషా సినిమాలకు మార్గదర్శనం.

కులం కారణంగా...

కుల వివక్ష, ఆత్మగౌరవం వాటికోసం అణచివేతకు గురైన వర్గం చేసే పోరాట ఇతివృత్తంతో ఇటీవల వచ్చిన తమిళ సినిమా ‘మామన్నన్’ తెలుగులో 'నాయకుడు'. ఆ సినిమాకు దర్శకుడు మారి సెల్వరాజ్. ఇప్పటికే ‘పరియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’ లాంటి క్లాసిక్స్ సినిమాలతో తన ముద్రని తమిళ సినిమా రంగంలో నెలకొల్పిన దర్శకుడు ఆయన. ఈయన ఈ సినిమాలో ప్రతిభావంతంగా ఆవిష్కరించిన ‘శ్లేష, ‘ప్రతీకాత్మకత’ చాలా గొప్పగా వుంటుంది. పందుల్ని పెంచే కులానికి, నిమ్న కులానికి చెందిన నలుగురు చిన్న కురాళ్ళు బావిలో ఈత కొడుతూ ఉంటే అది చూసిన ఉన్నత కులానికి చెందిన పెద్దలు బావిఒడ్డు పైనుండి రాళ్ళతో కొట్టి దాడి చేస్తారు. నలుగురి లోంచి ఒక పిల్లవాడు దెబ్బలు తగులుతూ వుండగానే తప్పించుకుని పైకి వస్తాడు. అతను ఆ ఊరి మామన్నన్ కొడుకు. కానీ మిగతా ముగ్గురూ రాళ్ళ దెబ్బలకు బావిలోనే చనిపోతారు. మామన్నాన్ ఆ ఊరిలో అధికార పార్టీ కార్యకర్త. అతను వెళ్ళి ఎమ్మెల్యేను కలిసి న్యాయం చేయాలంటాడు. కానీ పార్టీ అనీ, అదీ ఇదీ అని చెప్పి ఊరు వాళ్లందరినీ మభ్యపెడతాడు. బావిగోడ కూలి పిల్లలు చచ్చిపోయారని నమ్మ బలుకుతాడు. అదంతా చూసిన ఆ తప్పించుకున్న ఆదివీరన్ ఖిన్నుడవుతాడు. ఇంట్లోంచి పారిపోయి యుద్ధ విద్యను నేర్పించే ఓ గురువు దగ్గర శిష్యుడిగా చేరిపోతాడు. తన తండ్రితో మాట్లాడడు. ఇద్దరి నడుమా గ్యాప్ పెరుగుతుంది.

తర్వాత కాలం గడిచి ఆ నియోజకవర్గం కిందికులాల వారికి రిజర్వ్ చేయడంతో మామన్నన్ శాసన సభ్యుడు అవుతాడు. ఆదివీరన్ పెరిగి పెద్దవాడై కాలేజీ చదువులతో పాటు యుద్ధ విద్యలో నిష్ణాతుడయ్యి యువకులకు శిక్షణనిస్తూ వుంటాడు. ఆదివీరన్ క్లాస్‌మేట్ లీలా ఆ ఊర్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చే ఇనిస్టిట్యూట్ పెడుతుంది. కానీ ఆ ఊరిలో అధికార పార్టీ జిల్లా కార్యదర్శి అయిన ఉన్నత కులానికి చెందిన రత్నవేలు అన్న పెద్ద విద్యాసంస్థల్ని నడుపుతూ వుంటాడు. లీల ఉచిత శిక్షణా సంస్థ పైన దాడి చేస్తాడు. దానికి ప్రతిగా ఆదివీరన్ తన వాళ్ళతో కలిసి ఆతని విద్యాసంస్థల పైన దాడి చేస్తాడు. అదంతా తెలుసుకున్న రత్నవేల్ దాడి చేసిన వాళ్ళల్లో ఎంఎల్ఏ కొడుకు వున్నాడని తెలిసి ఇద్దరిని పిలిపిస్తాడు. ఎంఎల్ఏ అయినా రత్నవేల్ మామన్నన్‌ను నిలబెట్టి మాట్లాడుతుంటే ఆదివీరన్ చూసి నాన్నా కూర్చో అంటాడు. కానీ మామన్నన్ కూర్చోడు. తమ ముందు కూర్చోలేడు ఇవ్వాళ కాదు ఎన్నో ఏళ్లుగా అంతే అని గేలి చేస్తారు. దాంతో ఉన్నత కులానికి చెందిన వాళ్ళు తమని ఎట్లా నీచంగా చూస్తారో గమనించి ఆదివీరన్ ఎదురు తిరుగుతాడు. అట్లా ‘కుర్చీ’ ఈ సినిమాలో మరో గొప్ప సింబల్ అవుతుంది. కులం కారణంగా నిలబెట్టి మాట్లాడడం భరించలేకపోతాడు.

కులసమస్య, ఆత్మగౌరవ నేపథ్యంలో..

మరోవైపూ రత్నవేల్ కుక్కల్ని పెంచుతూ వుంటాడు. పరుగు పందెలకు తీసుకెళ్తూ వుంటాడు. తాను బాగా ఇష్టపడ్డ కుక్క ఒక పోటీలో ఓడిపోతే దాన్ని క్రూరంగా కొట్టి హింసించి చంపేస్తాడు. ఇంకోవైపు ఆదివీరన్ హాబీగా పందుల్ని పెంచుతూ వుంటాడు. రత్నవేల్ తన తండ్రి ద్వారా వచ్చిన అధికారం, తన అగ్రకులం ద్వారా వచ్చిన ఆధిపత్యాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ వుంటాడు. ఇద్దరి మధ్య వైరం పెరిగినప్పుడు తన కుక్కల్ని పంపి ఆదివీరన్ పెంచుతున్న పందుల్ని చంపిస్తాడు రత్నవేల్. వైరం తారస్థాయికి చేరుతుంది. అప్పటిదాకా మౌనంగా వున్న మామన్నన్ కొడుకు స్ఫూర్తితో మారిపోయి రత్నవేలుకు ఎదురు తిరుగుతాడు. హింసాత్మకంగా మారిన స్థితిలో ముఖ్యమంత్రి రత్నవేలును పిలిచి హెచ్చరిస్తాడు. కానీ తన కులాధిపత్యాన్ని ప్రదర్శించి నాకు మీ ఒక్క పార్టీనే కాదు మరెన్నో ఉన్నాయని పార్టీ మారతాడు. ఎన్నికల్లో మామన్నన్‌కు వ్యతిరేకంగా తన మనిషిని నిలబెట్టి కుల సంఘాల్ని కూడగట్టుకుని, డబ్బును వెదజల్లి గెలిచి మామన్నన్‌ను ఓడించి అతన్ని, అతని కొడుకుని అంతం చేయాలనుకుంటాడు. కానీ యువత ఎదురు తిరగడంతో ఎన్నికల్లో మామన్నన్ గెలుస్తాడు. గెలిచిన మామన్నన్‌ను స్పీకర్‌ను చేస్తారు. అసెంబ్లీలో ఉన్నత కుర్చీని అధిరోహిస్తాడు. రత్నవేలు లాంటి ఉన్నత కులానికి చెందిన వాడి ముందు కూర్చోవడానికి వీల్లేని మామన్నన్ స్పీకర్ సీట్లో కూర్చోవడం మరో సింబాలిక్ ప్రదర్శన.

సినిమాలో మామన్నన్ పాత్రలో వడివేలు చాలా గొప్పగా నటించాడు. ఇక రత్నవేలు పాత్రధారైన ఫహాద్ ఫాజిల్ కూడా అద్భుతంగా చేశాడు. ఇట్లా మొత్తం మీద కులసమస్య, ఆత్మగౌరవ సమస్యల్ని తీసుకుని రూపొందించిన ఈ సినిమా తమిళ సినిమా రంగంలో మైలు రాయిగానే చెప్పొచ్చు. దర్శకుడి ప్రతిభ ప్రస్ఫుటంగానూ, కమిట్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలో సెన్సార్ తదితర కారణాల వల్ల ఎక్కడా దళిత అన్న మాట లేకున్నా బుద్దుడు, అంబేడ్కర్‌ల విగ్రహాల్నీ బొమ్మల్నీ చూపిస్తూ తన ఇమేజరీలతో ఆ విషయాన్ని దర్శకుడు స్పష్టంగా ఎప్పటికప్పుడు చెబుతూనే వుంటాడు.

తెలుగు చిత్రసీమకు.. ఆ దమ్ముందా?

ఇట్లా ‘మామన్నన్’ సినిమానే కాదు ఇటీవలి కాలంలో తమిళ సినిమా దళిత సమస్య, కుల సమస్యల్ని తీసుకుని మంచి సినిమాల్ని విజయవంతమైన సినిమాల్ని అందించింది. ఆ విషయంలో తమిళ రంగాన్ని మనసారా అభినందించాలి. ఇప్పటికే పా రంజిత్ రూపొందించిన ‘మద్రాస్’, కబాలి, కాలా మొదలైన సినిమాలు కుల సమస్యను తీసుకుని గొప్ప ఒరవడికి పాదులు వేశాయి. నిజానికి తమిళ సినిమా రంగంలో 1930ల్లోనే పురాణాల మీద ఆధారపడి బ్రాహ్మణీయ సినిమాలు వచ్చాయి. అప్పుడు వచ్చిన అనేక సినిమాల్లో ప్రధాన పాత్రధారి ఇంటి పేరులోనే అతని కులం ధ్వనించేట్టు ఉండేది. ఉత్తమపుత్తిరాన్, సేవాసదనం, సభాపతి లాంటివి కొన్ని. అప్పుడే దేవదాసీ సమస్యతో కూడా సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత 1950ల్లో పెల్లుబికిన ద్రవిడ ఉద్యమం నేపథ్యంలో బ్రాహ్మణ వ్యతిరేక సినిమాలు వచ్చాయి. ఆ కాలంలో కొంత వాస్తవవాద ధోరణి వచ్చి కులాన్ని హేతుబద్ద దృష్టితో చూడడం మొదలు పెట్టారు. దానికి కొంత మానవీయ కోణం కూడా కలిపారు. అప్పుడే కులాన్ని గురించి తమిళ సినిమాలు స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టాయి. ఇక 1956 లో వచ్చిన 'మధురై వీరన్‌'లో ఎమ్జీఆర్ వేసిన అంటరానివాడి పాత్ర విజయవంతమై ఆయన రాజకీయంగా కూడా లబ్ధి పొందాడు. తర్వాత కరుణానిధి రాసిన ‘పరాశక్తి’ లాంటి సినిమాలు ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఆ తర్వాత ‘భారతి కన్నమ్మ’ లాంటి సినిమాలు కులాన్ని గట్టిగానే ప్రశ్నించాయి. కానీ అవి ఆర్థికంగా విజయవంతం కాకపోవడంతో ఆ ఒరవడి కొంత కాలం తగ్గింది.

పా రంజిత్ లాంటి వాళ్ళు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. మద్రాస్, పరియెరుం పెరుమాళ్, అసురన్ లాంటివి కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా వచ్చాయి. ఇక కాలా, కబాలితో ఇవి మరింత ముందుకు పోయాయనే చెప్పాలి. అయినప్పటికీ తమిళ నవ్య దర్శకులు దళిత వాదాన్నీ, కుల సమస్యనీ తమ సినిమాల్లో ప్రధాన ఇతివృత్తంగా చేసుకుంటున్నప్పటికీ అనేక ఒత్తిడుల మధ్య పనిచేస్తున్నారనే చెప్పాలి. ఉన్నత కులాల వారి ఆధిపత్యంలో వున్న సినిమా రంగం తమ ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూనే వుంది. కానీ పా రంజిత్ లాంటి వాళ్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయపతాక ఎగురవేస్తూ వుండడంతో ఆర్థిక మూలాలపైన నిలబడ్డ సినిమా రంగం అలాంటి సినిమాల్ని తప్పనిసరై ఆమోదించాల్సి వస్తున్నది. రజనీకాంత్ లాంటి పెద్ద హీరోలు, వడివేలు లాంటి పెద్ద నటులు ఈ సినిమాల పట్ల ఆసక్తి చూపడం కూడా ఒక రకంగా వాటికి బలమనే చెప్పాలి. మొత్తం మీద తమిళ సినిమా రంగం కులసమస్యను, దళిత వాదాన్నీ బలంగా చాటే దిశలో ముందుకు సాగుతూ వుంది. కానీ మన తెలుగు సినిమా అలాంటి స్థితికి చాలా దూరంగా వుంది. సమాజంలో వేళ్లూనికుని వున్న కుల సమస్యనే కాదు.. మరే సమస్యను కూడా ప్రధాన ఇతివృత్తాలుగా చేసుకునే పరిస్థితి లేదు. కుమురంభీమ్ లాంటి పోరాట యోధుల పాత్రల్ని తీసుకుని ఫిక్షన్ అని దబాయిస్తూ వున్న తెలుగు సినిమా తమిళ సినిమా నుంచి ప్రేరణ పొందాలని ఆశిద్దాం.

- వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story

Most Viewed