- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా రిజర్వేషన్లు తగ్గించిందెవరు..!?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 నెంబర్ జీవో జారీచేసి హారిజాంటల్ రిజర్వేషన్స్ అమలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం చేస్తున్నదని రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్లలో కోత విధించారని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరి రేవంత్ ప్రభుత్వం నిజంగానే మహిళా రిజర్వేషన్లను తగ్గించిందా? ఉద్యోగ నియామకాల్లో మహిళలకు నిజంగానే అన్యాయం చేస్తున్నదా? రాష్ట్రంలోని మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అమలుకు దారితీసిన కారణాలేంటి తదితర విషయాలను పరిశీలిద్దాం!
భారత రాజ్యాంగం ఆర్టికల్ 16(4) ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో కల్పించే రిజర్వేషన్లను సోషల్ రిజర్వేషన్లుగా పరిగణిస్తారు. ఈ సోషల్ రిజర్వేషన్లను వర్టికల్ విధానంలో అమలు చేస్తారు. వర్టికల్ రిజర్వేషన్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు నాన్-రిజర్వుడ్ పోస్టులకు తమ ప్రతిభ ఆధారంగా ఎంపికైతే, సదరు పోస్టులను వారికి నిర్దేశించిన రిజర్వుడ్ కోటాలో లెక్కించరు. రిజర్వుడ్ కోటా పోస్టులను తగ్గించరు కూడా. ఓపెన్ కాంపిటీషన్‌లో ఎంతమంది అభ్యర్థులు ఎంపికైనా రిజర్వేషన్ కోటా పూర్తయినట్లు కాదు. ఈ అభ్యర్థులను లెక్కలోకి తీసుకోకుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి నిర్దేశించిన మొత్తం రిజర్వుడ్ పోస్టులను సైతం వారితో భర్తీ చేయాల్సిందే. దీన్నే వర్టికల్ విధానంగా పేర్కొంటారు.
హారిజాంటల్ విధానంలో..
ఇక, ఆర్టికల్ 16(1) లేదా 15(3) ప్రకారం ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు మహిళలకు ఉద్యోగ నియామకాల్లో కల్పించే రిజర్వేషన్లను స్పెషల్ రిజర్వేషన్లుగా పరిగణిస్తారు. ఈ స్పెషల్ రిజర్వేషన్లను హారిజాంటల్ విధానంలో అమలు చేయాలని పేర్కొంటూ రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రిట్ పిటిషన్ నం.27844 ఆఫ్ 2022 రిట్ పిటిషన్ నం.38502 ఆఫ్ 2022లో ప్రభుత్వాన్ని, టీఎస్పీఎస్సీ రాష్ట్ర హైకోర్టు అక్టోబర్ 14, 2022 నాడు ఆదేశించింది. మహిళలు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు తమ మెరిట్‌తో ఓపెన్ కోటాలో సెలెక్టయ్యే పోస్టులను వారికి నిర్దేశించిన రిజర్వుడ్ కోటా పోస్టుల నుంచి తగ్గించి, మిగతా పోస్టులను మాత్రమే రిజర్వేషన్లతో భర్తీ చేయాలని చెప్పేదే హారిజాంటల్ విధానం.
ఉదాహరణకు, ఒక కేటగిరి ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 25 పోస్టులు రిజర్వుడ్ కోటాలో భర్తీ చేయాల్సి ఉందనుకుందాం. ఓపెన్ కాంపిటీషన్‌లోనే 25 లేదా అంతకు మించి మహిళా అభ్యర్థులు సెలెక్టయితే, ఇక మహిళలకు రిజర్వుడ్ కోటా ఉండదు. మహిళా కోటా పూర్తిగా భర్తీ అయినట్లే భావిస్తారు. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు సైతం ఈ నిబంధనే వర్తిస్తుంది.
కేసీఆర్ హయాంలోనే ఉత్తర్వులు!
సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాల్లో 33.33 % శాతం మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్ విధానంలో అమలు చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని ఆదేశిస్తూ కేసీఆర్ ప్రభుత్వం, Memo No. 7593/Ser.D/A2/2022 Dated: 02-12-2022 నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మెమోతో కేసీఆర్ ప్రభుత్వమే మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చింది. దీని కొనసాగింపుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న 3వ నెంబర్ జీవో జారీ చేసింది. మహిళా రిజర్వేషన్ల అంశంలో వాస్తవాలు ఇవి కాగా, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వమే హారిజాంటల్ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చి అన్యాయం చేస్తోందంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడం, నిరాహారదీక్షలకు దిగడం ద్వారా వారు తమ సహజ గుణాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టవచ్చని వారు ఇంకా నమ్ముతున్నట్టున్నారు. పదేళ్ళపాటు పారదర్శకతకు పాతరేసి, జీవోలను దాచిపెట్టి, చీకటి పాలన చేసిన వారి నైజాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. హారిజాంటల్ విధానంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని 2022లో తమ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం దాచిపెట్టి కొత్త ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆ పార్టీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా యత్నించినట్లు స్పష్టమవుతోంది.
సీఎం సీరియస్‌గా తీసుకోవాలి!
బీఆర్ఎస్ పార్టీ నేతలు మహిళా రిజర్వేషన్లపై అబద్ధపు ప్రచారాలతో నిరాహారదీక్షలకు కూర్చొని ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళా వ్యతిరేకిగా చిత్రీకరిస్తుంటే, రాష్ట్ర ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంత అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నా ముఖ్యమంత్రికి వాస్తవాలు వివరించి అబద్ధపు ప్రచారానికి అడ్డుకట్ట వేసే చర్యలు అధికారులు ఎందుకు తీసుకోలేదో అర్థం కాదు. ఇందులో కుమ్మక్కు కోణం ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మహిళా రిజర్వేషన్ వంటి సున్నితమైన అంశంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంటే, వాస్తవాలను ప్రజలకు వెల్లడించేందుకు తనకెందుకు బ్రీఫ్ చేయలేదో సంబంధిత అధికారుల నుంచి సీఎం వెంటనే వివరణ కోరాలి. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పెంచాల లక్ష్మణ్ రావు,
అడ్వకేట్
98496 56460