సమగ్ర భూ పంపిణీ.. అభివృద్ధికి మూలం!

by Ravi |   ( Updated:2024-12-31 01:16:05.0  )
సమగ్ర భూ పంపిణీ.. అభివృద్ధికి మూలం!
X

సమాజంలో భూ అసమానతలు గ్రామీణ అభివృద్ధికి, వ్యవసాయ ఉత్పత్తికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాయి. అందుకే సమగ్ర భూ పంపిణీ ద్వారా భూమి లేని రైతులకు భూమిని అందించడం, రైతుల ఆర్థిక స్థిరత్వం, చిన్న తరహా, మధ్య తరగతి రైతులు తమ స్వంత భూమిలో పనిచేయడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు, నీటి వనరుల వినియోగం వంటి మౌలిక సదుపాయాలు పెరిగి, సమాజంలో సమన్వయం పెరిగి కూలీలు తమ సొంత గ్రామాల్లోనే జీవనోపాధి పొందితే వారు పట్టణాలకు, నగరాలకు వలసలు తగ్గుతాయి.. అందుకే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర భూ పంపిణీ ఒక కీలకమైన అంశం.

రాష్ట్రంలో సాగుభూమి 165 లక్షల ఎకరాలుంది. ఇందులో 51 లక్షల ఎకరాలు వివిధ కారణాల వల్ల బీడుగా మార్చారు. వాస్తవ సాగు 115 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. ఇందులో దళితుల వద్ద 15 లక్షల ఎకరాలు, గిరిజనుల వద్ద 18 లక్షల ఎకరాల భూమి ఉంది. సాగు భూమిలో దళితులకు 9.17 శాతంకాగా, గిరిజనులకు 10.94 శాతం ఉంది. వాస్తవానికి భూములపై శ్రమ చేస్తున్న వాళ్లు దళితులు, గిరిజనులే. అలాంటి వారి వద్ద భూమి లేకపోవడం వల్ల వారి జీవనాధాయం పెద్దగా ఏ మాత్రం పెరగడం లేదు. రాష్ట్రంలో భూమి లేని కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో 50 శాతంగా ఉన్నాయి. అందులో దళితులు, గిరిజనులు వెనకబడిన తరగతుల వారు ఎక్కువగా ఉన్నారు. దళితుల్లో 50 శాతం మందికి, గిరిజనుల్లో 43 శాతం మందికి సెంటు భూమి లేదు.

కాంగ్రెస్ మినహా..

ప్రభుత్వ లెక్కల ప్రకారం 1977 నుండి 2002 డిసెంబర్ నాటికి తెలంగాణ జిల్లాలలో దళితులకు 1.01 లక్షల ఎకరాలు, గిరిజనులకు 0.80 లక్షల ఎకరాలు, ఇతరులకు 1.25 లక్షల ఎకరాలు ఇలా మొత్తంగా 3.07 లక్షల ఎకరాల మేరకు సీలింగ్ మిగులు భూములను పంపిణీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. దీని కింద వివిధ దశల్లో 3.82 లక్షల మంది లబ్ది పొందారని నివేదికలు తెలుపుతున్నాయి. అదే విధంగా అసైన్డ్ చేసిన భూమి దళిత, గిరిజనులు, ఇతరులకు కలిపి 16.79 లక్షల ఎకరాలను, 10.09 లక్షల మందికి పంపిణీ చేసినట్లు నివేదికలు రూపొందించారు. ఇనాం భూముల రద్దు చట్టం కింద 80వేల మందికి 2.37 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. చరిత్రాత్మకమైన రక్షిత కౌలుదారీ చట్టం కింద (38ఇ/1955) ప్రకారం 3.51 లక్ష ఎకరాల భూమిని అసైన్డ్ చేశారు. ఇవి కాక 1945లో ఆచార్య వినోభాబావే భూదాన్ పథకం కింద కూడా భూములు పంపిణీ చేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 విడతలుగా 7.04 లక్షల ఎకరాలు ఉభయ రాష్ట్రాల్లోని పేదలకు పంపిణీ చేశారు. ఆరో విడత కిరణ్ కుమార్ రెడ్డి 82 వేల ఎకరాలు పంపిణీ చేశారు. అయితే, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మినహా ఇతర ప్రభుత్వాలు నిరుపేద రైతులకు భూమిని పంపిణీ చేసిన సంఘటనలు అరుదనే చెప్పవచ్చు.

ధరణితో విధ్వంసం సృష్టించి

వివిధ బలహీనవర్గాల ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా మెరుగుపరచడం కోసం ఉమ్మడి అంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వివిధ మార్గాల ద్వారా భూ పంపిణీ చేపట్టాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ‘ధరణి’ అనే వ్యవస్థను ప్రవేశ పెట్టి రాష్ట్రంలోని 25-30 లక్షల కుటుంబాల్లో అశాంతిని, అలజడిని కలిగించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాల్లోని ‌సాఫ్ట్‌వేర్ సంస్థలకు రాష్ట్ర భూములపై పెత్తనాన్ని అప్పగించారు. ఇక అధికార పార్టీ నాయకులు ధరణిలోని లొసుగులను అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను నిసిగ్గుగా అర్ధరాత్రి పూట కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటన కోకోల్లోలు.. అంతేకాదు గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పంపిణీ చేసిన దాంట్లోనూ అత్యధిక భూములను ప్రభుత్వ అవసరాల నిమిత్తం స్వా ధీనం చేసుకోని, ఆ తర్వాత ప్రవేట్ కంపెనీలకు అమ్ముకున్నారు. వివాదస్పద భూములను, రి మాండ్ ఉన్న భూములను లక్షల ఎకరాలను ధరణి చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకొని గత ప్రభుత్వ నేతలు తమ అను యాయులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ అండతో అసైన్డ్ భూము లు, ఇనాం భూములు, ఫారెస్ట్ భూములు, ఇతరత్రా సమస్యలున్న భూములను ఆ పార్టీ నాయకులు కొందరు కబ్జాలకు పాల్పడ్డారు.

ఆశలన్నీ ప్రభుత్వంపైనే..

గత ప్రభుత్వాలు ఏడు విడతల పంపిణీ కింద ఇచ్చిన లక్షకు పైగా ఎకరాల్లోని చాలా భూ ములు ప్రజానీకం చేతులో లేవు. ఉన్న కొద్దిపాటి భూములు కూడా సాగుకు యోగ్యం గా లేవు. అనేక చోట్ల పట్టాలిచ్చి కూడా హద్దులు చూపించలేదు. పంపిణీ చేసిన దాంట్లో పట్టా కాగితాలపై మూడెకరాలు రాస్తే పొజిషన్లో రెండెకరాలు, ఒక ఎకరమే ఉన్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరికి పట్టాలిచ్చినా పొజిషన్లో భూములు చూపలేదు. చూపిన చోట భూమి సాగుకు యోగ్యం కాని పరిస్థితి. ఉదాహరణకు..కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో కొంతమంది దళితులకు పట్టాలిచ్చి ఇంతవరకు భూములే చూపించలేదు. ప్రస్తుతం వీరి చేతిలో అధికారులు ఇచ్చిన కాగితాలు మాత్రమే ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ అంతే. అటవీ అధికారులు గిరిజనులను నిర్బందాలకు గురిచేస్తున్న ఘటన కోకోల్లలు. బాధితులు అనేక సందర్భాల్లో పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినా పట్టించుకోని పరిష్కరించిన దాఖ లాలు లేవు. అందుకే గ్రామీణ ప్రాంత రైతులు అందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇక అధికారంలోకి వచ్చాకా కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి రద్దుచేసి ‘భూభారతి’ చట్టాన్ని తీసుకురావడంతో ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది రైతుల ఇబ్బందులను కడతేస్తారని విశ్వాసంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

- డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ,

చైర్మన్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం,

85010 61659

Advertisement

Next Story

Most Viewed