వటవృక్షాలుగా విద్వేష బీజాలు

by Ravi |   ( Updated:2022-09-03 17:05:29.0  )
వటవృక్షాలుగా విద్వేష బీజాలు
X

ఎన్నికలకు ముందు మత ఘర్షణల సంఘటనల సంఖ్య పెరుగుతూనే ఉంది. శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో జరిగిన మత ఘర్షణలే ఇందుకు ఉదాహరణ. ఆ రాష్ట్రాలలో మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి. మెజార్టీ వర్గాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి, ఆస్తి, ఇతర నష్టాలు సంభవిస్తున్నాయి. త్వరలో ముంబాయి కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండగా అక్కడ లౌడ్ స్పీకర్ల వివాదం ముందుకొచ్చింది. విద్వేషాలు తేవడానికి సినిమాలతోపాటే సోషల్ మీడియాను పక్కాగా వాడుకుంటుంది బీజేపీ. ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. అందులో జరిగింది నిజం కాదని పండిట్లే చెప్పినా నమ్మడానికి వారు సిద్ధంగా లేరు.

దేశంలో ఎన్నికలకు ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం పరిపాటిగా మారింది. గత పదేళ్లుగా ఇది మరీ ఎక్కువైంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన సంఘటనలు దీనికి ఉదాహరణలు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న వేళ సరికొత్త వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. హిజాబ్ ఘటన ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీసిందో తెలిసిందే. రెండో అంశం హలాల్. ఆలయ ప్రాంగణంలో ముస్లింల దుకాణాలు పెట్టొద్దని, వారి క్యాబ్‌లలో ప్రయాణించవద్దని, వారి వద్ద పండ్లు కొనవద్దని, మసీదులలో లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దని ఇలా కొత్త కొత్త వివాదాలను సృష్టించారు. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నమంతా. ఈ వివాదాలు క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.కులాలు, మతాలే ప్రస్తుతం రాజకీయాలను శాసిస్తున్నాయి.రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. అందుకు కుల, మత పర విభజనను తేవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు.

దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలలోనే కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. యూపీ, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాలలో ఐదు దశాబ్దాలుగా కుల రాజకీయాలే శాసించాయి. దశాబ్ద కాలంగా ఈ పరిస్థితి మారింది. కుల రాజకీయాల స్థానాన్ని క్రమంగా మత రాజకీయం భర్తీ చేస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మత రాజకీయాలే పై చేయి సాధించాయి. ఉత్తర‌ప్రదేశ్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. కుల రాజకీయాలపై ఆధారపడిన సమాజ్‌వాదీ పార్టీ చతికిలపడగా, మత రాజకీయాలను శాసించిన యోగీ ఆదిత్యనాథ్ అధికారాన్ని నిలబెట్టుకోగలికారు. రానున్న ఎన్నికలలోనూ ఇదే ఫార్ములాను అనుసరించడానికి బీజేపీ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు, అల్లర్లే దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వీటిని నివారించడానికి బదులు మరింత ఆజ్యం పోసే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

కొత్తకొత్త దారులు

ప్రజల మధ్య విద్వేషాలు తీసుకురావడానికి కొత్త కొత్త దారులను కనుగొన్నారు మన రాజకీయ నాయకులు. 'రెండు రాష్ట్రాల ప్రజలు కలిసినప్పుడు స్థానిక భాషలు, ఇంగ్లిష్‌లో కాకుండా హిందీలో మాట్లాడాలి' అని చెప్పిన హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇది ఉత్తర, దక్షిణ రాష్ట్రాల ప్రజల మధ్య విభజన సృష్టించడానికి చేసిన ప్రయత్నంలా కనిపించింది. దీనిని దేశంపై గుజరాతీల పెత్తనాన్ని ప్రశ్నించకుండా, అటు వైపు ఆలోచన రాకుండా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లా భావిస్తున్నారు విశ్లేషకులు. ఆహారం విషయంలో కర్ణాటక, ఢిల్లీలో జరిగిన ఘర్షణలు సరికొత్త విద్వేషాలకు దారితీశాయి.

శ్రీరామనవమి సందర్భంగా మాంసాహారాన్ని వడ్డించారని, తింటున్నారని ఢిల్లీలోని జేఎన్‌యూ యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలు ఇతర విద్యార్థులను తీవ్రంగా చితకబాదారు. నవరాత్రుల సందర్భంగా ఢిల్లీలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ నగర పాలక సంస్థలు మాంసం క్రయవిక్రయాలపై తొమ్మిది రోజుల పాటు నిషేధాన్ని విధించాయి. కర్ణాటకలోని హిజాబ్ వివాదం అందరికీ తెలిసిందే. వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు, సెంటిమెంట్లను మన రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో ఉపయోగించుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడానికి ఆయా ప్రాంతాలపై ఉన్న సెంటిమెంట్ కూడా కారణమే.

సోషల్ మీడియా ప్రచారంతో

ఎన్నికలకు ముందు మత ఘర్షణల సంఘటనల సంఖ్య పెరుగుతూనే ఉంది. శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో జరిగిన మత ఘర్షణలే ఇందుకు ఉదాహరణ. ఆ రాష్ట్రాలలో మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి. మెజార్టీ వర్గాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి, ఆస్తి, ఇతర నష్టాలు సంభవిస్తున్నాయి. త్వరలో ముంబాయి కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండగా అక్కడ లౌడ్ స్పీకర్ల వివాదం ముందుకొచ్చింది. విద్వేషాలు తేవడానికి సినిమాలతోపాటే సోషల్ మీడియాను పక్కాగా వాడుకుంటుంది బీజేపీ.

ఇటీవల విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. అందులో జరిగింది నిజం కాదని పండిట్లే చెప్పినా నమ్మడానికి వారు సిద్ధంగా లేరు. తెలంగాణలోని పలు జిల్లాలలో శివాజీ విగ్రహాల మాటున విద్వేషాలను ఎలా పెంచుతున్నారో ఇటీవల ఓ ఇంగ్లిష్ డిజిటల్ పత్రిక ఆధారాలతో వాస్తవాలను వెల్లడించింది. మతం లేదంటే కులం, అదీ కాకుంటే ప్రాంతం, ఇంకా భాష, రంగు, ఆహారం, సంస్కృతి, సంప్రదాయం.. ప్రజల మధ్య విద్వేషాలు పెంచి, తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నాయకులు కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటూనే ఉంటారు. వీరి ఆగడాలను అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నాలు జరగకపోవడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం.

మహమ్మద్ ఆరిఫ్

సీనియర్ జర్నలిస్ట్

96184 00190

Advertisement

Next Story

Most Viewed