- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామన్ మ్యాన్ డైరీ: ఎన్నో ఆశలతో గల్ఫ్ కి వెళ్ళిన కార్మికుని కథ
అనుమతి లేకుండా పనులు చేసినందుకు బహ్రెయిన్ కోర్టు రూ.30 లక్షల రూపాయల ఫైన్ విధించింది. లేదంటే ఉరిశిక్ష విధిస్తామని ప్రకటించింది. భర్త బతికొస్తే చాలని భావించిన రజిత తండ్రి సాయంతో ఉన్న జాగాను అమ్మేసింది. రూ.50 లక్షల రూపాయలు రాగా, రూ.30 లక్షలను చెల్లించింది. అప్పులు కట్టేసింది. బతుకు జీవుడా అంటూ ఇల్లు చేరాడు గంగాధర్. ఇప్పుడు పొలం లేదు. జైలు జీవితం కారణంగా చిక్కిపోయి అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు. రికవరీ కావడానికి ఏడాది పట్టింది. ఊరు విడిచి నిజామాబాద్‌లో కాపురం పెట్టారు. గంగాధర్ కార్ల షోరూంలో పనిచేస్తున్నాడు. రజిత ఓ బట్టల షాపులో పనిచేస్తున్నది. గంగాధర్ జీవితం 'గల్ఫ్ కథ'తో అనేక మలుపులు తిరిగింది.
గంగాధర్‌ది నిజామాబాద్జిల్లా బాల్కొండ. డిగ్రీ వరకు చదువుకుని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవాడు. రూ. ఎనిమిది వేల జీతం వచ్చేది. ఇంటిపట్టునే ఉండడం. పెళ్లి కాకపోవడంతో పెద్దగా ఇబ్బంది కలుగలేదు. గంగాధర్ తండ్రి గంగారామ్‌కు ఎకరం భూమి ఉంది. పసుపు, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసేవాడు. ఓ రోజు పొలానికి వెళ్లిన గంగారామ్ అక్కడే కుప్పకూలాడు.సాయంత్రం తండ్రి ఇంటికి తిరిగి రాకపోయే సరికి గంగాధర్ పొలానికి వెళ్లాడు.
మడి దగ్గర పడి ఉన్న తండ్రిని చూసి కలవరపడ్డాడు. స్నేహితుల సహాయంతో ఆర్మూర్‌లోని ఆస్పత్రికి తరలించాడు. డాక్టర్లు పరీక్షించి చనిపోయాడని చెప్పారు. కొండంత దు:ఖం ఆవరించింది. ఊరికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాడు. నెల రోజులు బడికి వెళ్లలేదు. స్కూలు యాజమాన్యం వేరొకరిని నియమించుకుంది. ఇపుడు గంగాధర్‌కు ఉద్యోగం లేదు. తండ్రి లేడు. వ్యవసాయం చూసుకుంటున్నాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటున్నది. ఏడాది గడిచింది. తండ్రి అంత్యక్రియలకు చేసిన అప్పులు కట్టేశాడు. పొలాన్ని కౌలుకు ఇచ్చి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకున్నాడు.
*
ఓ రోజు గంగాధర్ మేనమామ కిషన్ వచ్చాడు. యోగక్షేమాలు కనుక్కొన్నాడు. వారం క్రితమే గల్ఫ్ నుంచి వచ్చిన కిషన్, గంగాధర్‌కు తన బిడ్డను ఇచ్చి వివాహం చేస్తానని మనసులో మాట చెప్పాడు. కిషన్ కూతురు పేరు రజిత. డిగ్రీ వరకు చదువుకున్నది. గంగాధర్‌కు మామ కూతురంటే ఇష్టమే. తనకు ఉద్యోగం లేదని, ఉన్న ఎకరం పొలంలో ఏం పంటలు పండిస్తామంటూ మామ వద్ద ఆవేదన వెలిబుచ్చాడు గంగాధర్. 'నీకెందుకురా, నువ్వు కూడా గల్ఫ్ వచ్చేయ్, అక్కడ మంచి సంపాదన ఉంది. ఒక ఆర్నెల్లు కంప్యూటర్ వర్క్ నేర్చుకో. అక్కడ మంచి డిమాండ్ ఉందని' చెప్పి మరుసటి రోజు వెళ్లిపోయాడు.
రెండు నెలలు పోయాక గంగాధర్‌కు రజితకు వివాహం జరిపించారు. మేనరికమే కావడంతో పెద్దగా కట్నకానుకలు ఇవ్వలేదు. వారి కాపురం ఏడాది పాటు సాఫీగా సాగింది. రజిత గర్భవతి అయ్యింది. గంగాధర్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. పసుపునకు గిట్టుబాటు ధర రాకపోవడంతో సాగు ఆపేశాడు. మొక్కజొన్న మాత్రమే వేస్తున్నాడు. ఆ డబ్బులు ఏడాది పొడువునా కుటుంబం గడవడానికి చాలడం లేదు. మక్కలు కొనేవారు కరువయ్యాడు. ఏదో ఒక ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
*
భర్త ఆర్థిక ఇబ్బందులను గమనించిన రజిత దుబాయ్‌లో ఉంటున్న తండ్రికి ఫోన్ చేసింది. తాను ఒక నెల రోజులలో వస్తానని అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ ఫోన్ కట్ చేశాడు కిషన్. నెల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి మరుసటి రోజు బిడ్డ ఇంటికి వెళ్లాడు. గంగాధర్‌తో మాట్లాడాడు. కంప్యూటర్ నేర్చుకోలేదని, సమయం దొరకలేదని చెప్పాడు. దీంతో కిషన్ బహ్రెయిన్‌లో ఉంటున్న తన మిత్రుడు రాజేశ్వర్‌ను కాంటాక్ట్ చేశాడు. వర్క్ వీసా కావాలని అడిగాడు. 'ఇప్పుడు ఇవ్వడం లేదు. విజిటింగ్ వీసా మీద వచ్చి పని వెతుక్కోవాలని, తాను సపోర్ట్ చేస్తానని' చెప్పాడు. సరే అన్నాడు కిషన్.
గంగాధర్ బహ్రెయిన్ వెళ్లేందుకు రెడీ అయ్యాడు. తల్లికి, భార్యకు ధైర్యం చెప్పి బయలుదేరాడు. నాలుగు రోజులు రాజేశ్వర్ వద్ద ఉన్నాడు. తెచ్చుకున్న డబ్బులు ఐస్ గడ్డలా కరిగిపోయాయి. ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో లేబర్‌గా చేరాడు. రెండు రోజుల తరువాత లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారుల దాడులలో వారికి దొరికిపోయాడు. తీసుకెళ్లి జైలులో పెట్టారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. రజిత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. కిషన్ ట్రై చేసినా కలవలేదు. రాజేశ్వర్‌కు ఫోన్ చేస్తే 'పనికి వెళ్తున్నా అని చెప్పాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. నేను సీరియస్ గా ట్రై చేస్తున్నా' అన్నాడు. నెల రోజులు గడిచాక గంగాధర్ జైలులో ఉన్నట్టు తెలిసింది. కిషన్ అల్లుడిని రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డెలివరీకి వచ్చిన బిడ్డకు విషయం చెప్పొద్దనుకున్నాడు. రజిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
*
వారం గడిచింది. బిడ్డకు గంగాధర్ జైలుపాలైన విషయం చెప్పాడు కిషన్. రజితకు గుండె ఆగినంత పనైంది. బోరున విలపించింది. అక్కడి శిక్షలు కఠినంగా ఉంటాయని తెలుసుకున్న రజిత కన్నీరు కాలువలయ్యేలా విలపిస్తున్నది. విషయం అత్త లక్ష్మికి చెప్పడంతో ఆమె షాక్ కు గురైంది. నిద్రాహారాలు మానేసింది. చివరకు పక్షవాతం బారిన పడింది. చిన్న బిడ్డను పట్టుకొని అత్తకు సపర్యలు చేయడం రజితకు కష్టంగా మారింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓ రాత్రి లక్ష్మి నిద్రలోనే ఈ లోకాన్ని విడిచింది. చివరికి తమ్ముడు కిషనే తలకొరివి పెట్టాల్సి వచ్చింది.
గంగాధర్ బహ్రెయిన్ జైలులోనే మగ్గుతున్నాడు. రజిత ఉన్న ఎకరం భూమిని కౌలుకు ఇచ్చి అష్టకష్టాలు పడుతూ ఉంది. అనుమతి లేకుండా పనులు చేసినందుకు బహ్రెయిన్ కోర్టు రూ.30 లక్షల రూపాయల ఫైన్ విధించింది. లేదంటే ఉరిశిక్ష విధిస్తామని ప్రకటించింది. భర్త బతికొస్తే చాలని భావించిన రజిత తండ్రి సాయంతో ఉన్న జాగాను అమ్మేసింది. రూ.50 లక్షల రూపాయలు రాగా, రూ.30 లక్షలను చెల్లించింది. అప్పులు కట్టేసింది. బతుకు జీవుడా అంటూ ఇల్లు చేరాడు గంగాధర్. ఇప్పుడు పొలం లేదు. జైలు జీవితం కారణంగా చిక్కిపోయి అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు. రికవరీ కావడానికి ఏడాది పట్టింది. ఊరు విడిచి నిజామాబాద్‌లో కాపురం పెట్టారు. గంగాధర్ కార్ల షోరూంలో పనిచేస్తున్నాడు. రజిత ఓ బట్టల షాపులో పనిచేస్తున్నది. గంగాధర్ జీవితం 'గల్ఫ్ కథ'తో అనేక మలుపులు తిరిగింది.
ఎంఎస్ఎన్ చారి
79950 47580