లలిత సాహిత్యానికి చిరునామా

by Ravi |   ( Updated:2024-09-07 01:00:21.0  )
లలిత సాహిత్యానికి చిరునామా
X

ప్రముఖ కవి, తెలుగు సినీ లలిత గీతాల, దేశభక్తి గేయాల రచయిత, చిత్ర దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ అకాల మరణం పొందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 ఏళ్లు. ఆయనకి ముగ్గురు సంతానం. వారి పిల్లలు ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటు.

1948, ఆగస్టు 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో చేనేత కుటుంబంలో లక్ష్మమ్మ, లింగయ్య దంపతులకు వడ్డేపల్లి కృష్ణ జన్మించారు. డా. సినారె స్ఫూర్తితో సాహిత్యం పట్ల ఎక్కువ అభిరుచితో ఎన్నో గీతాలు, గేయాలు, రూపకాలు రచించారు. దాదాపు ముప్పై రెండేండ్లు కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖలో పనిచేసి ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉండగానే పదవీ విరమణ పొంది సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా చెబుతారు 'టపా (పోస్ట్) నాకు ఇష్టం ఉండేది కాదు. తిరుగు టపా అంటే పాట అంటే ప్రాణం అందుకే పాటల రచయితగా కొనసాగాలని ఉద్యోగానికి రాజీనామా చేశాను' అని.

హిట్ గీతాల రచయిత

ఆయన 1968లో స్రవంతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో పాటు కవికల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడుపూలు ఆరు కాయలు, సంక్రాంతి లక్ష్మి, స్వదేశీయం, వివేకానంద విజయం, ఆమ్రపాలి, బతుకమ్మ, జయజయహే తెలంగాణ, రమణీయ రామప్ప మొదలగు అనేక సంగీత నృత్య రూపకాలు వ్రాశాడు. సాహిత్యం, పద్యాలపై మంచి పట్టు ఉండడంతో సినిమాలపై దృష్టి సారించారు. పిల్లజమీందార్, అమృతకలశం, యుగకర్తలు, పెద్దరికం, భైరవద్వీపం, పిలిస్తే పలుకుతా వంటి పలు సినిమాల్లో హిట్ గీతాలెన్నో రాశారు. ఆయన ఇప్పటివరకు 60 ఆల్బమ్స్, దాదాపు 70 పై చిలుకు చిత్రాల్లో 200 పైగా పాటలు, వేలాది లలిత గీతాలు ఆయన కలం నుండి జాలువారిన జావళీలే.

స్పెషల్ జ్యూరీ అవార్డులు..

కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా అంతరించిపోతున్న గోవులపై ‘గోభాగ్యం’ పేరిట ఆయన తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో బహుమతి గెలుచుకుంది. బతుకమ్మ, ఆత్మహత్య, నేతన్నలు వంటి డాక్యుమెంటరీలను తీసి జాతీయస్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు పొందారు. టెలివిజన్‌లో భక్త కవి పోతన, భారతీయ సంస్కృతీ శిఖరాలు వంటి సీరియల్స్‌ను డైరెక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులకూ పరిచయం అయ్యారు. డా. సి. నారాయణ రెడ్డి గారితో స్ఫూర్తితో లలిత గీతాలపై మొట్టమొదటిసారిగా ప్రామాణిక పరిశోధన చేసి డాక్టర్ కావాలనే కోరిక నెరవేర్చుకున్నారు. తెలంగాణ భాషపై మక్కువతో తెలంగాణ భాష, యాసతో వెలుగచ్చింది నాటకాన్ని రాశారు. జయ జయహే తెలంగాణ పేరుతో సంగీత నృత్య రూపకం రచించారు. రచయితగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్‌గా, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్‌గా, పాడుతాతీయగా పాటల కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన సాహితీ సేవలు శ్లాఘనీయం.

పాటలు లలిత గీతాలు..

పాట ఆయనకు ప్రాణం లలిత గీతాలు, ఆయన జావళీలు ఆయన సాహితీ కృషికి నిదర్శనం. ప్రతి పాటకు ప్రాణ ప్రతిష్ట జరగాలి. పది కాలాల పాటు శ్రోతలు ఆదరించాలి అంటే పాటకు సంగీతం, సాహిత్యం, సన్నివేశం మూడూ ముఖ్యం అంటారు. ఈ మూడూ సమపాళ్లలో ఉంటే పాటలతో సినిమా హిట్ అవుతుంది, సినిమా ఫట్ అయినా పాటలు హిట్ అవుతాయి అంటారు. ఆయన పాటలు లలిత గీతాలు, మనసుకి హాయి గొలిపే సుకుమారాలు. అందుకే మళ్లీ జన్మ అంటూ ఉంటే రచయితగా కవిగానే పుడుతాను ఎందుకంటే.. మబ్బులెన్నో కమ్మినను వెలుగొందేవాడు రవి, మరణానంతరం మనగలిగే వాడు కవి అంటారు.

ఒక గొప్ప కవితో సంవత్సర కాలంగా నాకు లభించిన సాన్నిహిత్యం మరవలేని జ్ఞాపకం. నిన్న నిమ్స్ ఆసుపత్రిలో చేతిలో చెయ్యేసి చాలాసేపు మాట్లాడారు.. శ్రీనివాస్, ఆదివారం మా ఇంటికి రండి అని ఆహ్వానించారు. ఈలోగా అనంత లోకాలకు వెళ్లిపోయారు. చిత్ర పరిశ్రమకి ఆయన మరణం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ..

శిరందాస్ శ్రీనివాస్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ

94416 73339

Advertisement

Next Story

Most Viewed