- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గడ్డం సమ్మయ్య ఆశ్రితులకే ఆశ్రితుడు...
కులం ఒక విలక్షణమైన రూపం. ఉల్లిపాయ పొరలా ప్రతి పోరలోనూ విలువల దొంతరలను సహజ సిద్దంగా ఏర్పాటు చేసింది. పోషక, పోషిత, శోషిత లాంటి శ్రేణిలను ఏర్పాటు చేసి ఒకరి మీద మరొకరిని పరస్పర సహకారిగా మార్చి అమర్చిన అంతర్గత దొంతరలను ఏర్పాటు చేసింది. వందలాది కుల- ఉప కులాలుగా, ఆశ్రిత సమాంతర కులాలుగా కొన్ని జాతులను కట్టు బానిసలుగా మార్చారు. ఈనాటికీ మన కంటికి కనిపించని వినిపించని అదృశ్య, అవ్యాచ్య జీవులు ఉన్నారు.
అసమ విలువల చట్రం అత్యంత దిగువున ఉన్న కులస్తులు చిందు, డక్కలి. నిజానికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌లు వాళ్ళకే కావాలి. అనాదిగా అట్టడుగు పనులు చేస్తూ, బతుకీడుస్తున్న బడుగుజీవులు వాళ్ళు. వాస్తవానికి భారతరత్నకు అర్హుడు సమ్మయ్య. తరాలుగా సాంప్రదాయ చిందు యక్షగాన కళాకారుల కుటుంబం. అవ్వలు అయ్యలు తాతలు ముఖానికి రంగేసుకుని రామాయణ, భారత, భాగవత, యక్షగాన కథలు తరాలుగా చెబుతున్నారు.
ఎవరీ చిందు వాళ్ళు
ఈ దేశంలో ఒక దశలో వైదిక మతం తగ్గుముఖం పట్టిన సంక్షుభిత కాలాన ఆ పరంపరను వందల ఏళ్లుగా భుజాన వేసుకొన్న మోస్తున్న ధార్మిక రాయబారులు చిందు కళాకారులు. వీరు నిజమైన సాంస్కృతిక రథసారథులు. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే కథలు చెప్పడం, మిగతా కాలాన షికారు చేసుకొని 'రాత్రికి రాజులు పగలు యాచకులుగా' బతుకీడుస్తున్నారు. మన చుట్టూ చిందు, బైయిండ్ల, పంబాల, సమగర, డక్కలి, నులక చందయ్య(జంగాల) ఇంకా అనేక అదృశ్య, అవాచ్య కులాలు ఉన్నాయి. చానా మందికి ఇవి ఉన్నాయని కూడా తెలియదు.
నేను గడ్డం సమ్మయ్య ఊరు అప్పిరెడ్డి పల్లి పోయిన. ఆయన బతుకును దగ్గరగా చూసా. సమ్మయ్య సహచరి శ్రీ రంజని చేతి ముద్ద తిన్న. కల్లు బొట్టు తాగిన. కొడుకులు సోమరాజు, హిమగిరి, మురళిని కలిసా. సమ్మయ్య మా ఇంటికి సైతం వచ్చాడు. చిందు యల్లమ్మ, డక్కలి గోపాల్, గడ్డం సమ్మయ్య, శ్యామ్, గొప్ప కళాకారులు వాళ్ళు మనకు తెలియని తరతరాల చరిత్ర. వాళ్ళ కవిలే కట్టెలు వాళ్ళ మదిలో భద్రంగా ఉన్నాయి.
ఆనందం ఆస్వాదించలేక..
గడ్డం సమ్మయ్య బతుకు సంచారి. ఒక్కొక్క కన్నీటి బొట్టు బతుకుకి ఇంధనంగా మార్చుకున్నవాడు. అతను ఆశ్రితులకే ఆశ్రితుడు. అంటరాని వాడికే అంటరానివాడు నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆయన కింద ఇంకా పది కుల దొంతరలు ఉన్నా చిందు ఒక విశిష్ట మైనది. సకల కళలకు మూలం. మన ముందే బతికి మాయం అయిన చిందు ఎల్లమ్మ చెప్పిన అల్లి రాణి కథల వ్యధాత్మక గతం ఉంది. ఆమెది విస్మృత గాథ. ఆదిమ కాలాన సర్వ కళలకు మూలం అయిన చిందు తన పూర్వీకుల త్యాగ ఫలం.
నాకు ఈ అవార్డుల మీద ఏ భ్రమలూ లేవు. వివక్షల ఏలికల పాలనలో గుడిసెల చూరు కింద, చెట్లకింద సంచారులుగా బతికిన ఒక మట్టి బిడ్డ పాదాలు స్పృశించి పద్మశ్రీ తన పాపాలను కడుక్కుంది. మచ్చలేని నీ జాతి ఈ అవార్డుల పందేరంలో పడి కలుషితం అవుతుందేమో అనే బెంగ కూడా ఉంది సమ్మయ్య. ఎందుకో ఆరేడేళ్ల తర్వాత సమ్మయ్యకు ఫోన్ చేశా. కొడుకు మురళి ఎత్తిండు. సమ్మయ్య సహచరి శ్రీ రంజని గుండె మొరాయించి హాస్పటల్‌లో ఉంది. ఈ ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం కూడా అతనికి లేదు. ఆమె ఆరోగ్యం మీద నాకు బెంగ.
(గడ్డం సమ్మయ్యకి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా)
- గుర్రం సీతారాములు
99516 61001