- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'రైతుబంధు' లో మార్పులు తేవాలి
మనసులో మాట
'పోడు, కౌలు రైతులు తెలంగాణ కోసం ఉద్యమించలేదా? మనం తింటున్నది కౌలు రైతు పండించినదే కదా! కౌలు రైతుల విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదు. భూమి యజమానులు ఎక్కడో నగరాలు, పట్టణాలలో ఉంటారు. గ్రామాల్లో భూములను కౌలుకు ఇస్తుంటారు. రైతుబంధు సొమ్ము యజమానికే చేరుతుంది. కౌలుకు ఇచ్చిన యజమాని నుంచి డిక్లరేషన్ తీసుకోవచ్చు. ఈ డిక్లరేషన్ తప్పనిసరి అంటూ నిబంధన పెట్టి, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించవచ్చు. లేదా కనీసం వారికి సబ్సిడీ రుణాలు అయినా ఇస్తే బాగుంటుంది. మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారని రైతు సంఘాలు చెబుతున్న లెక్క.'
సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనం రైతుబంధు పథకం. యావత్ దేశాన్నే ఆకర్షించిన స్కీమ్ ఇది. వ్యవసాయం ప్రధానంగా ఉన్న దేశంలో రైతుబంధు ను మించిన స్కీమ్ మరొకటి ఉండదు. బహుశా అందుకేనేమో ఈ పథకం 2018 నవంబర్ 20 నుంచి 23 వరకు 'వ్యవసాయాభివృద్ధి లో వినూత్న ఆవిష్కరణలు' అనే అంశంతో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకుంది. కానీ, ఇది క్రమంగా భూస్వాములకు ఖజానాను దోచిపెట్టేందుకు సర్కారు అఫిషియల్‌గా తీసుకొచ్చిన స్కీమ్‌గా మారిపోతోందనే ప్రతిపక్షాలు, రైతుసంఘాల విమర్శలనూ కాదనలేం. ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా ఉండాలంటే సన్న, చిన్నకారు రైతులకు చేయూతనిచ్చేలా రైతుబంధులో మార్పులు చేయడం తక్షణ అవసరం. లేకపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ సంగతి రాజకీయ చాణిక్యుడిగా పేరున్న సీఎం కేసీఆర్‌కు తెలియదని అనుకోలేం.
రైతుబంధును బెస్ట్ స్కీమ్‌గా మార్చినప్పుడే బెస్ట్ ఫలితాలు అంది బంగారు తెలంగాణ అవతరించి తీరుతుంది. 25 ఫిబ్రవరి 2018 న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రకటించారు. 10 మే 2018న కరీంనగర్‌లోని ధర్మరాజ్‌పల్లి గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు రెండు పంటలకు కలిపి సంవత్సరానికి ₹ 10,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఎకరాల సంఖ్య పై పరిమితి లేదు. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ భూమి 1.53 కోట్ల ఎకరాలు కాగా, రైతుల సంఖ్య దాదాపుగా 62.5 లక్షలు. తెలంగాణలో 55 శాతానికి పైగా జనాభా పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు. గత యాసంగి పంటకు ఈ పథకం కింద ప్రభుత్వం 1.53 కోట్ల వ్యవసాయ భూమికని 62.5 లక్షల రైతులకు రూ. 7,515 కోట్లు ఇచ్చింది.
రాచమార్గం లో నిధుల మళ్లింపు?
రైతుబంధు పథకం మీద, రైతులకు సహాయం చేయడం మీద ఎవరికీ, ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ, నియమాలు, నియంత్రణ, పరిమితి లేకుండా ఇవ్వడం మీదనే అభ్యంతరాలు ఉన్నాయి. తక్కువ భూమి కలిగిన వారికి తక్కువ సహాయం, ఎక్కువ భూమి గల వారికి ఎక్కువ సహాయం చేయడమంటే భూస్వాములకే మేలు చేకూర్చినట్టు అవుతుంది. ఇప్పటికీ భూస్వాముల దగ్గరే వందల ఎకరాల భూమి ఉంది. వాళ్ల భూములను కూడా తక్కువ భూమి గల కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకు ఎలాంటి సహాయం అందదు. ఇందులో ప్రత్యేకంగా, అధికారికంగా జరిగే మోసాన్ని నిజాయితీగా గమనించాలి. రైతుబంధు పథకం అమలులో భూ పరిమితిని పెట్టకపోవడంతో నిధులు రాజమార్గంలో బడా బడా లీడర్లకు, ధనవంతులకు, ప్రజాప్రతినిధులకు, వ్యాపార వేత్తలకు, ఆసాములకు, భూస్వాములకు నేరుగా బ్యాంకులలో జమ అవుతున్నాయి.
తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక, దేశానికి ఆహార భద్రత కల్పించే రైతులకు ఎంతో మేలు కలిగించే రైతుబంధు లాంటి పథకాన్ని స్వాగతించాల్సిందే. ఏ ప్రభుత్వమైనా చిట్ట చివరి నిరుపేదకు అత్యధిక లాభం కలిగేలా పథకాలను రూపొందిస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం అలా జరగలేదు. బక్క రైతులను, భూస్వాములను ఒకే గాటన కట్టడం మాత్రం మంచి నిర్ణయం కానే కాదు. పేద పిల్లలు చదువుకోవడానికి స్కాలర్‌షిప్ కోసం ఆర్థిక సాయం కోరితే, పిల్లల తండ్రి ఆదాయం ధ్రువీకరణ పత్రం ఖచ్చితంగా అడిగే ఈ ప్రభుత్వం రైతుబంధు విషయంలో ఎందుకు కోటీశ్వరులకు కళ్లెం వేయకుండా మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదు!
వందల కోట్లు ఆయాచితంగా
ఒక అంచనా ప్రకారం సుమారుగా ఎకరా భూమి ఉన్న 18 లక్షల మంది రైతులకు రెండు పంటల దిగుబడికి ప్రభుత్వం అందించే సహాయం దాదాపు రూ.1,800 కోట్లు. 1-2 ఎకరాల భూమి ఉన్న 24 లక్షల మంది రైతులకు అందించే సహాయం రూ.4,800 కోట్లు. 3-5 ఎకరాలకు లోపు ఉన్న 11 లక్షల మందికి అందే సహాయం రూ. 4,400 కోట్లయితే, 5 నుంచి 10 ఎకరాల భూమి కలిగిన 4.4 లక్ష మంది రైతులకు ఇచ్చేది రూ. 3,300 కోట్లు. 10 ఎకరాలకు పైగా ఉన్న 94 వేల మందికి అందే సాయం రూ.940 కోట్లు. 25 ఎకరాలకు పైగా ఉన్న 6,500 మంది కి రూ.162 కోట్లుకాగా, 50 ఎకరాలకు పైగా దాదాపుగా 300 మంది రు.150 కోట్ల సాయం పొందుతున్నారు. ఈ లెక్కల ప్రకారమే 30 శాతానికి పైగా ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలే ఎక్కువగా లాభ పడుతున్నాయి.
గత మూడు సంవత్సరాల ఖరీఫ్ సీజన్ సరాసరి లెక్కలు చూస్తే యేటా కోటి 10 లక్షల నుంచి కోటి 25 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నవి. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.10,000 చొప్పున కోటి 50 లక్షల ఎకరాలకు సొమ్మును పంపిణీ చేస్తోంది. అంటే, 25-30 లక్షల ఎకరాలకు ఉత్తి పుణ్యానికి దాదాపు 1250-1500 కోట్లు అదనంగా పంచుతున్నదన్నమాట. అలాగే, గత మూడు సంవత్సరాల రబీ సీజన్ సరాసరి లెక్కలు తీసుకుంటే ఎక్కువ లో ఎక్కువగా 50-60 లక్షల ఎకరాలు సాగు చేస్తారు. దాదాపు రూ.4000-4500 కోట్లు పంటలు పండించకున్నా. బడాబాబులు, బంజరు భూముల యజమానులు, రియాల్టర్స్ జేబులకు చేరుతున్నాయి.
కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వలేరా?
పోడు, కౌలు రైతులు తెలంగాణ కోసం ఉద్యమించలేదా? మనం తింటున్నది కౌలు రైతు పండించినదే కదా! కౌలు రైతుల విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదు. భూమి యజమానులు ఎక్కడో నగరాలు, పట్టణాలలో ఉంటారు. గ్రామాలలో భూములను కౌలుకు ఇస్తుంటారు. రైతుబంధు సొమ్ము యజమానికే చేరుతుంది. కౌలుకు ఇచ్చిన యజమాని నుంచి డిక్లరేషన్ తీసుకోవచ్చు. ఈ డిక్లరేషన్ తప్పనిసరి అంటూ నిబంధన పెట్టి, కౌలు రైతుకు పెట్టుబడి సాయం అందించవచ్చు. లేదా కనీసం వారికి సబ్సిడీ రుణాలు అయినా ఇస్తే బాగుంటుంది.
మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారని రైతు సంఘాలు చెబుతున్న లెక్క. రెండు లక్షల మందికి పైగా ఆదివాసీ గిరిజన తెగలకు చెందిన నిరుపేద పోడు రైతులు ఉన్నారు. ఎన్‌టీఆర్ ప్రభుత్వ హయాంలో 'చెట్టు-పట్టా' పేరుతో వారు సాగు చేసుకుంటున్న భూముల మీద హక్కులు కల్పించారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 2005 అటవీ హక్కుల చట్టంలో హక్కు పత్రాలను కూడా ఇవ్వాలని చేర్చారు. నేటి ప్రభుత్వం అందుకు భిన్నంగా హరితహారం పేరుతో పోడు రైతుల భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వారి హక్కులకు భంగం కలిగిస్తుంది. వారికి ఎలా సాయం చేస్తుందో ముందు ముందు చూడాలి.
డా. బి.కేశవులు, ఎండీ
మనస్తత్వ, రాజకీయ నిపుణులు